జగన్ తో లక్ష్మిపార్వతి

ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేతిలో పావుగా మారారా? ప్రతిపక్షాలపై విమర్శలకు ఆమెను వాడుకుంటున్నారా?


జి. విజయ కుమార్

అటు తెలుగు చిత్ర సీమలోను.. ఇటు రాజకీయాలలోను సంచలనాలు సృష్టించిన ఎన్టీఆర్‌ రెండో పెళ్లి, ఆమెతో వివాహాన్ని ఆయన కొడుకులు, కుమార్తెలు ఒప్పుకున్నారా లేదా.. ఆ సమయంలో నెలకొన్న సంఘటనలు, ఆ తర్వాత ఎన్టీఆర్‌ మరణం, అంతిమ యాత్రలో ఆమెకు ఎదురైన అవమానాలు ఆ ఎపిసోడ్‌లన్నీ పక్కన పెడితే నందమూరి లక్ష్మీపార్వతి రాజకీయ ప్రయాణం తాజాగా చర్చ నీయాంశంగా మారింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తొలినాళ్ల నుంచి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్మిపార్వతికి ఎలాంటి రాజకీయ భరోసా ఇవ్వలేదని అటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తో పాటు ఇతర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
2024 ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్‌ చేపట్టిన కసరత్తు, అభ్యర్థుల ఎంపికలు, సీట్ల కేటాయింపులు, కోఆర్డినేటర్‌ పదవుల కేటాయింపుల ఎపిసోడ్‌లో లక్ష్మీపార్వతి పేరు ప్రస్తావన ఎక్కడా తెరపైకి రాలేదు. ఆమె అసెంబ్లీ స్థానం కేటాయిస్తున్నట్లు కానీ.. పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా వైసీపీ నేతలను కోఆర్డినేట్లగా నియామకాలు చేపట్టిన సందర్భాల్లో కానీ లక్ష్మీ పార్వతిని ఎక్కడా పరిణనలోకి తీసుకోక పోవడంతో లక్ష్మీపార్వతి రాజకీయ మనుగడ అంశం తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం తెలుగు అకాడమీ చైర్మన్‌గా ఉన్న లక్ష్మీపార్వతి తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం కల్పించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అడిగినట్లు కూడా లేదు. ఎన్టీ రామారావు మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించి చంద్రబాబును ధీటుగానే ఎదుర్కోగలిగారు. అయితే రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు సర్వసాధారణం కాబట్టి వాటిని ఫేస్‌ చేయడంలో లక్ష్మీపార్వతి విఫలమయ్యారు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. తర్వాత జరిగిన పరిణామాల్లో కొంత కాలం ఇంటి వద్దనే ఉంటూ వచ్చారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీలో చేరి ప్రచార సభలకు హాజరయ్యారు. జగన్‌మోహన్‌రెడ్డి కూడా అధికారంలోకి రాగానే ఆమెకు తెలుగు అకాడమి చైర్‌పర్సన్‌గా పదవినిచ్చి గౌరవించారని చెప్పొచ్చు.
విమర్శలు చేయడంలో దిట్ట
ప్రతిపక్షాలను ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబును, ఆ పార్టీ సీనియర్‌ నాయకులను విమర్శించడంలో లక్ష్మీపార్వతిది అందె వేసిన చేయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ప్రధానమైన నాయకుల వివరాలు ఆమెకు తెలియనవి కావు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా టీడీపీలోని ముఖ్య నాయకులంతా ఆమెకు నమస్కారాలు చేసిన వాళ్లే. ఎన్టీ రామారావుకు అనుంగు శిష్యుడు.. సినీ నటుడు మోహన్‌బాబుతో సహా ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు కూడా లక్ష్మిపార్వతిని తిరస్కరించడంతో ఆమె విధిలేని పరిస్థితుల్లోనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశ్రయించారు. అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేసేందుకు లక్ష్మిపార్వతి ప్రస్తుతం ఉపయోగ పెడుతున్నారడంలో సందేహం లేదు.
ప్రత్యక్ష రాజకీయాల్లో అవకాశం కల్పించని జగన్‌
వైసీపీలో ముఖ్యులైన నాయకులందరికీ ఎక్కడో ఒక చోట సీట్లిచ్చి అవకాశం కల్పించారు. లక్ష్మీపార్వతి తనకు సీటు కావాలని బయట పడకపోయినా మనసులో మాత్రం ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని ఆమె సన్నిహితుల ద్వారా తెలిసింది. తెలుగుదేశం పార్టీలో ఇప్పటికీ లక్ష్మిపార్వతిని అభిమానించే వారు లేకపోలేదు. అయితే చంద్రబాబు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ వైపు చూసే చాన్స్‌ కూడా లక్ష్మిపార్వతికి వచ్చే అవకాశం లేదు. కాగా ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక అన్ని పార్టీల వారు దాదాపు పూర్తి చేశారు. ప్రధానంగా వైసీపీ అందరి కంటే ముందుగానే తన అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో లక్ష్మిపార్వతిని ఏ మేరకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉపయోగించుకుంటారు. ఆమె ద్వారా ఎన్టీఆర్‌ అభిమానుల ఓట్లు కొన్ని అయినా రాబట్టుకుంటారా లేదా అనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఉంది.
Next Story