
రాజకీయ ఇంధనమా, ఖనిజ సంపదా? కరుగుతున్న బైరటీస్ చెప్పే కథ ఏమిటీ?
బైరటీస్ బావురంటోంది.. నిల్వలు అడుగంటుతున్నాయి.. మంగంపేట గని ఖాళీ అయితే పెద్ద సంక్షోభమే
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒకప్పుడు శాసించిన బైరటీస్ (Baryte) ఖనిజం ఇప్పుడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కో అంటే కోట్లు పలికిన ఈ సంపద ఇప్పుడు అడుగంటే దశకు చేరినట్టు శాస్త్రీయ సర్వేలు చెబుతున్నాయి. దేశం మొత్తంలో ఉన్న బైరటీస్ నిల్వల్లో 95 శాతం ఒక్క కడప జిల్లా మంగంపేటలోనే ఉన్నాయి. ఇది మన దేశానికి ఉన్న ఏకైక అతిపెద్ద గని. కానీ, ఈ నిల్వలు ఇప్పుడు కళ్లు మూసి తెరిచేలోగా కరిగిపోతున్నాయి.
కనుమరుగవుతున్న ఖజానా
ఒకప్పుడు కొండల్లా ఉన్న ఈ ఖనిజ సంపద ఇప్పుడు లోయల్లా మారుతోంది. గణాంకాలు చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. 2015లో: 4.9 కోట్ల టన్నుల నిల్వలు ఉండేవి.
2024 నాటికి అవి 2.3 కోట్ల టన్నులకు పడిపోయాయి. ప్రస్తుతం ఏటా 2.7 మిలియన్ టన్నుల మేర తవ్వేస్తున్నారు. ఇదే వేగంతో వెలికితీస్తే, మరో 7 నుండి 8 ఏళ్లలో మంగంపేటలో బైరటీస్ గనులు పూర్తిగా ఖాళీ అయిపోవడం ఖాయం. ఆ తర్వాత అక్కడ మట్టి తప్ప ఏమీ మిగలదు.
బైరటీస్ ఎందుకు అంత ముఖ్యం?
చాలామందికి బైరటీస్ అంటే ఏంటో తెలీదు కానీ, ఇది మన దేశ ఇంధన భద్రతకు ప్రాణాధారం. భూమిలోపల కిలోమీటర్ల కొద్దీ లోతులో చమురు, గ్యాస్ కోసం బావులు తవ్వేటప్పుడు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి, అగ్నిప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఈ బైరటీస్ పౌడర్‌ను వాడుతారు. దీనికి వేరే ప్రత్యామ్నాయమే లేదు.
భవిష్యత్ అవసరాలకు ఎంత కావాలంటే...
భారతదేశం తన శక్తి అవసరాల కోసం అండమాన్, కేజీ బేసిన్‌లలో ఉన్న చమురును వెలికితీయాల్సి ఉంది. దీనికోసం దాదాపు 600 మిలియన్ టన్నుల బైరటీస్ అవసరం. కానీ మన దగ్గర ఉన్నది చాలా తక్కువ.
ఇది కేవలం చమురుకే కాదు, రక్షణ రంగంలో క్షిపణి వ్యవస్థలు, పెయింట్లు, ప్లాస్టిక్, రబ్బర్ తయారీలో కూడా వాడుతారు.
సంక్షోభానికి అసలు కారణం ఏంటి?
మన దేశ అవసరాల కంటే విదేశాలకు ఎగుమతి చేయడమే ఈ కొరతకు ప్రధాన కారణం. దీని వెనుక ఒక బలమైన ఆర్థిక చిక్కుముడి ఉంది. మైనింగ్ సంస్థ (APMDC) దాదాపు ₹10,000 కోట్ల అప్పులు, బాండ్లు తెచ్చింది. ఆ అప్పుల వడ్డీలు కట్టడానికి, వాయిదాలు చెల్లించడానికి చేతిలో నిరంతరం డబ్బు ఉండాలి. ఆ ఆదాయం కోసం నిల్వలను విపరీతంగా తవ్వి విదేశాలకు అమ్మేస్తున్నారు. అంటే, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తక్షణ డబ్బు కోసం ఇంటి కప్పును పీకి అమ్మేస్తున్నట్టుగా ఉంది ఈ పరిస్థితి.
రాజకీయ ఇంధనం, బాలగోపాల్ ఏమన్నారంటే..
బైరటీస్ అంటే కేవలం డబ్బు కాదు, రాయలసీమలో రాజకీయ శక్తిని నిర్మించే ఒక ఆయుధం. ప్రముఖ నేత బాలగోపాల్ విశ్లేషించినట్టు 1970ల నుండి దీనికి విదేశీ మార్కెట్‌లో ధర పెరగడంతో, మైనింగ్ లీజుల చుట్టూ దౌర్జన్యం, ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలయ్యాయి.
పల్లెటూరి ఫ్యాక్షన్ నుండి జిల్లా రాజకీయాల వరకు, అక్కడి నుండి రాష్ట్ర స్థాయి అధికారం వరకు ఎదగడానికి బైరటీస్ నుంచి వచ్చిన సంపద 'రాజకీయ ఇంధనం'గా పనిచేసింది.
ఈ ఖనిజం కొందరిని కోటీశ్వరులను చేసింది, కొందరికి అధికారం ఇచ్చింది కానీ, ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడంతో ఈ సహజ వనరు ఇప్పుడు అంతమయ్యే దశకు చేరింది.
గని ఖాళీ అయితే రాష్ట్రానికి మూడు రకాల దెబ్బలు తగులుతాయి. గని ఖాళీ అయితే అది కేవలం కడప జిల్లా సమస్య కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకే దెబ్బ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బైరటీస్ నిల్వలు తరగడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు మూడు స్థాయిల్లో నష్టం జరుగుతుంది అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ డాక్టర్ తులసిరెడ్డి. "ఆర్థిక, రాజకీయ నష్టాలతో భావితరాలకు ఉంచాల్సిన ఓ సహజ వనరును మనం కోల్పోయినట్టవుతుంది. గని ఖాళీ అయితే, రాష్ట్రానికి ఒక ముఖ్య నాన్-టాక్స్ రెవెన్యూ వనరు పోయినట్టే. మంగంపేట ప్రాంతంలో ఉద్యోగాలు, లోకల్ ఎకానమీ కుప్పకూలే ప్రమాదం ఉంది" అన్నారు తులసిరెడ్డి.
దీనివల్ల రాజకీయ నష్టం కూడా ఉందని చెప్పారు ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. రవీంద్రనాథ్. "ఇప్పుడున్న స్ట్రాటజిక్ లీవరేజ్ (వ్యూహాత్మాక బేరసారాలు) పోతుంది. కేంద్రంతో వనరులపై బేరసారాలు చేసే శక్తి తగ్గుతుంది. దానివల్ల చాలా నష్టపోతాం" అనేది రవీంద్రనాథ్ చెప్పిన మాట.
ఒక తరం లాభాల కోసం భవిష్యత్ తరాల వనరును ఖాళీ చేసిన రాష్ట్రంగా మిగిలిపోవడం ఖాయమనే విమర్శలూ లేకపోలేదు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.శరత్ మాటల్లో చెప్పాలంటే సహజవనరుల దోపిడీని అరికట్టాలి, పొదుపుగా వాడుకున్నప్పుడే అది భావి తరాలకు అందించిన వాళ్లం అవుతాం.
ఇదే సమయంలో, దేశం బైరటీస్ దిగుమతులపై ఆధారపడితే, చైనా లాంటి దేశాలపై ఎనర్జీ ప్రోగ్రామ్ ఆధారపడే ప్రమాదం ఉంటుంది. ఇది కేవలం వాణిజ్య సమస్య కాదు, జియో పొలిటికల్ రిస్క్ అని ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్ డి.నరసింహారెడ్డి అన్నారు.
దేశంలో బైరటీస్ ఉన్నా దిగుమతులు ఎందుకు?
C-DEP రిపోర్ట్ చూపిస్తున్న మరో కోణం ఏమిటంటే - దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద బైరటీస్ గని ఉన్నప్పటికీ, డిఫెన్స్, ఆయిల్ ఫీల్డ్ సర్వీసులు, పెయింట్స్ పరిశ్రమలు ఇప్పటికే బైరటీస్‌ను దిగుమతి చేసుకుంటున్నాయి. దేశీయ ఉత్పత్తి ఎక్కువగా ఎగుమతులకు పోతుంటే తిరిగి దాన్నే దిగుమతి చేసుకోవడం విడ్డూరంగా ఉందనే విమర్శలూ ఉన్నాయి. ఇలా చేయడం వల్ల విదేశీ కరెన్సీ నష్టం, దేశీయ విలువ జోడింపు కోల్పోవడం, పరిశ్రమల పోటీ సామర్థ్యం తగ్గడం వంటి వన్నీ జరుగుతున్నాయని C-DEP రిపోర్ట్ చెబుతోంది.
దేశ భద్రతకూ ఈ ఖనిజం అవసరమే..
మన దగ్గర ఖనిజం అయిపోతే, చమురు తవ్వకాల కోసం చైనా లాంటి దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. మన సంపదను మనం తక్కువ ధరకు ఎగుమతి చేసి, రేపు అవసరానికి ఎక్కువ ధరకు విదేశాల నుండి కొనుక్కోవాల్సి వస్తుంది.
పరిష్కార మార్గాలు, ప్రభుత్వం ఏం చేయాలి?
-ముందు మన దేశ అవసరాలకు సరిపడా స్టాక్ ఉంచుకుని, ఆ తర్వాతే మిగిలిన దాన్ని విదేశాలకు పంపాలి.
-కేవలం వడ్డీలు కట్టడం కోసమే ఖనిజాన్ని తవ్వి పారేసే పద్ధతిని మార్చాలి. APMDC ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ఇతర మార్గాలను వెతకాలి.
-దీనిని ఒక 'క్రిటికల్ మినరల్'గా గుర్తించి, జాగ్రత్తగా వాడుకోవాలి. లిథియం, కోబాల్ట్ లాగానే బైరటీస్‌ను కూడా ‘క్రిటికల్ మినరల్’ జాబితాలో చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు.
-ప్రైవేటు ఎగుమతి దారులు, రాజకీయ పలుకుబడితో జరిగే అక్రమ తవ్వకాలను అరికట్టాలి.
ఒక తరం రాజకీయాల కోసం, తెచ్చిన అప్పులు కట్టడం కోసం ప్రకృతి ఇచ్చిన ఈ అరుదైన వనరును పూర్తిగా ఖాళీ చేస్తే.. రాబోయే తరాలకు మనం సమాధానం చెప్పుకోలేం. మంగంపేట గనిని కాపాడుకోవడం అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాపాడుకోవడమే.
Next Story

