ఎమ్మెల్యే దగ్గుబాటి అవినీతి అంతుందా? మాంసం కొట్లనూ వదల్లేదా!
x

ఎమ్మెల్యే దగ్గుబాటి 'అవినీతి' అంతుందా? మాంసం కొట్లనూ వదల్లేదా!

అనంతపురం రూరల్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ను అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు మందలించారా


నిజం గడప దాటక మునుపే అబద్ధం అరుగుల మీద ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. వారిలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కూడా ఉన్నారు. ఆయన ఇటీవలి కాలంలో పెద్ద వివాదాస్పద వ్యక్తిగా తయారయ్యారు. వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సాయంత్రం తన ఛాంబర్ కి పిలిపించి మరీ తీవ్రస్థాయిలో మందలించారు. ఆయన ఏదో చెప్పబోయినపుడు.. 'మీరేమీ చెప్పవద్దు, మీ పద్ధతి మార్చుకోకపోతే బాగుండదు' అని హెచ్చరించి పంపినట్టు సమాచారం.
ఈ ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలు ఏమిటంటే...
ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈ ఎమ్మెల్యేపై లెక్కకు మిక్కిలి ఆరోపణలు ఉన్నాయి. ఈ చిట్టా చాంతాడంత ఉందని తెలిసింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఈ ఎమ్మెల్యే ఎవర్నీ వదిలిపెట్టలేదు. మాసం అమ్మే వాళ్ల నుంచి కిలోకి 25 నుంచి 30రూపాయలు మామూళ్లుగా వసూలు చేయించారు. ఇవ్వని వాళ్లను ఎమ్మెల్యే అనుచరులు వేధిస్తున్నారు. ఇందుకోసం మాంసం అమ్మే షాపుల వద్ద తన అనుచరులను కాపలా కూడా పెట్టించారట. మాంసం కొట్లో సాయంత్రానికి ఎంత అమ్మారో తెలుసుకుని అన్ని కిలోలకు వాళ్ల దగ్గర మామూళ్లు వసూలు చేయించినట్టు ఒక ఆరోపణ కాగా భవన నిర్మాణాలు, లేఅవుట్లు, ఇళ్ల ప్లాన్లు సరేసరి.
అక్రమ నిర్మాణ ఆరోపణలు ఉన్న భవన యజమానులను తన ఇంటికి పిలిపించుకుని బెదిరించి డబ్బు వసూలు చేయడం ఇంకొక ఆరోపణ. ఈ తరహా ఆరోపణలు దాదాపు అందరు ఎమ్మెల్యేలపై ఉన్నప్పటికీ దగ్గుబాటి వారి రూటే వేరన్నట్టు డెడ్ లైన్ పెట్టి మరీ లక్షల్లో వసూలు చేసినట్టు ఆయన సామాజికవర్గం నేతలే మంత్రి లోకేశ్, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. కొందరైతే మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుకు వచ్చి ఫిర్యాదులు చేసి వెళ్లారు. దయచేసి తమ పేర్లు బయటకు రానివ్వకండని కూడా ఫిర్యాదులు స్వీకరించిన వారిని అభ్యర్ధించిన ఘటనలూ ఉన్నాయి.
ఇసుక, మట్టి, మైనింగ్, మద్యం వంటివన్నీ ఈ ఎమ్మెల్యే కనుసన్నలలోనే జరగాలని పట్టుబట్టినట్టు సమాచారం. తాను చెప్పినట్టు వినని వారిని పిలిపించి భయపెట్టడమే పనిగా పెట్టుకుని డబ్బు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎవరైనా మాట వినకపోతే ఎస్పీ, కలెక్టర్ వంటి వారికి ఫోన్లు చేసి పలానా వాళ్ల పని పట్టండని హుకుం జారీ చేస్తున్నట్టు ఓ బాధితుడు మంత్రి నారా లోకేశ్ కి స్వయంగా ఫిర్యాదు చేశారని తెలిసింది.
అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ అనేక అరాచకాలకు పాల్పడుతున్నారని, పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు స్వయంగా ఫిర్యాదు చేశారు.
దగ్గుపాటి ప్రజల ఆస్తులు కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రభాకర్‌ చౌదరి వెంట వచ్చిన పలువురు తమ ఆస్తుల్ని ఎమ్మెల్యే అనుచరులు లాక్కున్నారని చెబుతూ కొన్ని డాక్యుమెంట్లు చూపించారు.
60-70 కుటుంబాలకు ఆధారమైన రూ.100 కోట్ల విలువైన ఏడెకరాల ఆస్తిని దగ్గుపాటి తన బంధువుల పేరిట రిజిస్టర్‌ చేసుకున్నారని, బాధితులంతా టీడీపీ మద్దతుదారులేనని ప్రభాకర్‌ చౌదరి పేర్కొన్నారు. ఒక నేత్రవైద్యురాలికి చెందిన రూ.3 కోట్ల విలువైన ఆస్తులను లాగేసుకున్నారని చెప్పారు.

ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా మీద దుర్భాషలాడడనే కారణంతో ఈ ఎమ్మెల్యే దగ్గుబాటి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 సినిమా బెనిఫిట్ షోలకు సంబంధించిన అంశం ఇది. దీనిపై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కి జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు ధనుంజయ నాయుడుకి మధ్య జరిగిన సంభాషణలో జూనియర్ ఎన్టీఆర్ తల్లి ప్రస్తావన, ఇతరత్రా అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయి. అటువంటి వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. అయితే, ఈ ఆడియో క్లిప్‌లోని వాయిస్‌ తనది కాదని ఎమ్మెల్యే ఆ తర్వాత వివరణ ఇచ్చారు.
సోషల్ మీడియాలో ఈ ఆడియో విన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో ఎమ్మెల్యే ప్రసాద్‌ క్యాంపు కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. విజయవాడ, తిరుపతి, నెల్లూరు నగరాల్లో ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ వ్యవహారం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లింది. ఆయన సమాచారం తెప్పించుకున్న తర్వాతే ఆయన్ను మందలించాలని నిర్ణయించారు. అయితే ఈ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మంత్రి నారా లోకేశ్ కి బాగా సన్నిహితుడు కావడం వల్ల కాస్త జాప్యం జరిగింది. లోకేశ్ ఉన్నాడన్న అండతోనే ఈ ఎమ్మెల్యే బాగా రెచ్చిపోయినట్టు సమాచారం.
ఈనేపథ్యంలో గురువారం మంత్రివర్గ సమావేశం ముగిశాక.. దగ్గుపాటిని సీఎం తన ఛాంబర్‌కు పిలిపించారు. ఎమ్మెల్యేపై తీవ్రంగా మండిపడినట్లు సమాచారం. ఎమ్మెల్యే వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా వినేందుకు కూడా సీఎం ఇష్టపడలేదని తెలిసింది.
తనకు అన్నీ తెలుసునని, ఏమీ చెప్పాల్సిన అవసరం లేదని, పద్ధతి మార్చుకోకపోతే ఉపేక్షించబోనని తీవ్ర స్వరంతో హెచ్చరించినట్టు సమాచారం. ఎంతో మంది సీనియర్లు పోటీ పడ్డా, వారిని కాదని ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చామని, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఎంతో బాధ్యతగా ఉండాల్సిందిపోయి, తరచూ వివాదాల్లో చిక్కుకోవడం ఏమిటని సీఎం మండిపడ్డారు. ఇకపై ఎలాంటి ఫిర్యాదులూ రావడానికి వీల్లేదని, పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే సహించబోనని స్పష్టంచేశారు.
‘రాష్ట్రంలో క్రిమినల్‌ మాఫియా తయారైంది. మనం మంచి చేసినా చెడుగా జనంలోకి తీసుకెళ్లడం వారి ప్రత్యేకత. ప్రభుత్వం చేసిన ఏ కార్యక్రమంపైనైనా బురదజల్లడమే ఆ మాఫియా పని. ఈ విషయంలో మనం అప్రమత్తంగా లేకుంటే చాలా నష్టపోతాం’ అని మంత్రివర్గ సహచరులను హెచ్చరించారు. మనం చేసిన మంచిపై చర్చ జరగాల్సి ఉండగా.. ఎమ్మెల్యేల వివాదాలపై జరుగుతోందని.. ఇది మంచి పరిణామం కాదని స్పష్టంచేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావొద్దని హెచ్చరించారు. జరిగిన దానికి ప్రజల ముందు విచారం వ్యక్తం చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.
Read More
Next Story