లోకేశ్ సీఎం ఎపుడవుతాడు? చంద్రబాబు ముందున్న ఆప్షన్లు ఏమిటి?
మాజీ మంత్రి, సినీనటి, వైసీపీ నాయకురాలు రోజాకు మింగుడు పడకపోవచ్చు గాని 'పప్పు' నిప్పు అయింది. ఆ లోకేశం 'మాలోకం' కాదని, పరాచకం అన్ని వేళలా మంచిది కాదంటోంది.
రాజకీయాలలో ఎప్పుడేం జరుగుతుందో, ఏ పరిణామం ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం అంత సులువేమీ కాదు. "నాయకత్వం అంటే ఓ వ్యక్తి దృష్టిని ఉన్నత శిఖరాల వైపు తీసుకువెళ్లడం, పనితీరును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం. సామాన్యులు దాటలేని పరిమితులను అధిగమించి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం" అంటారు ఆస్ట్రేలియన్ అమెరికన్ విద్యావేత్త, మేనేజ్మెంట్ కన్సల్టెంట్ పీటర్ ఫెర్డినాండ్ డ్రక్కర్ . ఓనాడు ఆంధ్రప్రదేశ్ లో అందరి నోళ్లలో నానిన "నవ్విన నాపచేన్లు" ఈవేళ పండుతున్నాయి.
మాజీ మంత్రి, సినీనటి, వైసీపీ నాయకురాలు రోజాకు (ACTOR ROJA) మింగుడు పడకపోవచ్చు గాని 'పప్పు' నిప్పు అయింది. రోజాతో సహా అనేక మంది రాజకీయ ఉనికికే ముప్పు తెచ్చేలా తయారైంది. ఆ లోకేశం 'మాలోకం' కాదని, లోకం చుట్టే వీరుడేనని, పరాచకం అన్ని వేళలా మంచిది కాదని నిరూపించేలా 'కాకలు' తీరుతోంది. అమెరికా వంటి అగ్రరాజ్యంలో చదివిన ఓ మాజీ విద్యార్థిగా, పలుకుబడిగలిగిన రాజకీయ నాయకుడి కొడుకుగా కాకుండా ఓ రాష్ట్ర మంత్రి హోదాలో యూఎస్ పర్యటనకు వెళ్లిన నారా లోకేశ్ బాబుకి అడుగడుగునా స్వాగతం లభించింది. ప్రొటోకాల్ ప్రకారం జరగాల్సిన మర్యాదలు ఎలాగూ జరుగుతాయి. వందల వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తరలిరానున్నాయని లోకేశ్ చెప్పారు. అంతవరకు బాగానే ఉన్నా కొందరు అత్యుత్సాహ పరులు 'ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి' నారా లోకేశ్ అంటూ బ్యానర్లు కట్టారు. కొందరైతే నారా లోకేశ్ చిత్రపటం ఉన్న బ్యానర్ ను హెలికాఫ్టర్ లో ఎగిరేలా చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 'నారావారి బిడ్డ, ఆంధ్రప్రదేశ్ కే అండ' అంటూ ఇంకొందరు ఫ్లెక్సీలు వేసి సంబరపడ్డారు.
అమెరికాలో ప్రతి దానికీ ఓ రేటు ఉంటుంది. అది కడితే నిర్ణీత ప్రాంతంలో నిబంధనలకు లోబడి నీ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. ఇలాంటివి ఇంకెన్నైనా చేయవచ్చు. లోకేశ్ 'అభిమానులకు' అభిమానంతో పాటు ఆర్ధిక దన్ను ఎక్కువే కావడంతో ఇవేవీ పెద్ద లెక్కలోనివి కావు. అయితే అమెరికాలో చేసిన ఈ హడావిడి ఆంధ్రప్రదేశ్ లో మంటలు రేపుతోంది. లోకేశ్ మనసులో ఏముందీ? వాళ్ల నాన్న మదిలో ఏముందీ? అసలు వాళ్ల ఇంట్లో ఏమి జరుగుతోంది? అనే చర్చతో పాటు ఆకాశమే హద్దుగా ఊహాగానాలు చెలరేగిపోతున్నాయి. ఈ ఉహాగానాలు ఎంతలా ఉన్నాయంటే నారా లోకేశ్ తిరిగి ఏపీలో అడుగుపెట్టేలోగా ఆయన్ని ఏకంగా ముఖ్యమంత్రి చేసేంతలా ఉంటున్నాయి. ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే గనుక ఏమైనా జరగవచ్చు.
టీడీపీ కూడా కుటుంబ పార్టీయేనా...
టీడీపీ ప్రాంతీయ పార్టీ. అధ్యక్షుల పేర్లు మారవచ్చునేమో గాని ఎన్టీఆర్ కుటుంబం చుట్టూనే ఆ పార్టీ తిరుగుతుంది. ఎన్టీఆర్ తర్వాత లక్ష్మీపార్వతీ, హరికృష్ణలాంటి వాళ్లు తెరపైకి వచ్చినా పెద్దగా నిలవలేదు. ఎన్టీఆర్ అల్లుళ్లలో ఒకరైన చంద్రబాబు మాత్రమే నిలిచి గెలిచారు. ఇప్పుడు టీడీపీ అంటే ఆయన పార్టీయే. ఇప్పుడాయన వయసు దాదాపు 75. 40 ఏళ్లకి పైగా రాజకీయ అనుభవం ఉన్నవారు. ఉమ్మడి రాష్ట్రానికి, విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఏపీకి రెండోసారి ముఖ్యమంత్రి.
ఆయన ఇప్పటికిప్పుడు రాజకీయ పదవీ విరమణ చేసినా ఆ తర్వాత చేసినా ఆ పార్టీకి కాబోయే నాయకుడు ఆయన కుమారుడు లోకేశే. అందులో సందేహం లేదు. కానీ ఇప్పటి హడావిడి చూస్తుంటే- సంపూర్ణ మెజారిటీ ఉండగానే అబ్బాయిని ముఖ్యమంత్రి సీట్లో చూడాలని ఆ తల్లిదండ్రులు అనుకుంటున్నట్టు సమాచారం. ఇందుకు అభ్యంతరం చెప్పేవాళ్లు కూడా ఉండకపోవచ్చు కాని తన మిత్రుడు పవన్ కల్యాణ్ ను ఎలా ఒప్పిస్తారన్నదే ప్రశ్న.
2014-2019మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తమ కుమారుణ్ణి శాసనమండలికి పంపి మంత్రి పదవి కట్టబెట్టడం వెనుక కుటుంబ సభ్యుల వత్తిడి ఉందన్నది బహిరంగ రహస్యమే. 2019లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయన్ను ప్రత్యర్థిపార్టీల వాళ్లు "పప్పని", "తుప్పని", "మాలోకమని".. ఇలా ఏవేవో ప్రేలాపనలు చేశారు. తాను "నిప్పే" తప్ప "పప్పు" కాదని నిరూపించేలా పాదయాత్ర చేపట్టి చంద్రబాబు అరెస్ట్ తో మధ్యలో ఆపేసి తండ్రి బెయిల్ కోసం ఢిల్లీలో మకాం వేసి ఎట్టకేలకు సంపాయించారు. 2024లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా భజాయించి ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే అద్భుత మెజారిటీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. తన తండ్రి మంత్రివర్గంలో రెండోసారి మంత్రి అయ్యారు. ఇదీ నడుస్తున్న చరిత్ర.
భవిష్యత్ లో ఏమి జరగవచ్చు...
కొడుకును సీఎం సీట్లో చూడాలని ఏ తల్లిదండ్రులకైనా ఉన్నట్టే చంద్రబాబు, భువనేశ్వరీ (CHANDRABABU, BHUVANESWARI) దంపతులకూ ఉంది. అయితే సమయం, సందర్భం కలిసిరావాలి. ఇప్పుడా అవకాశం వచ్చిందంటున్నారు లోకేశ్ అభిమానులు. అందుకే కాబోయే సీఎం అంటూ హోరెత్తిస్తున్నారు.
ఈ తరుణంలో చంద్రబాబుకున్న ఆప్షన్లు ఏమిటీ? టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న మాజీ ఎమ్మెల్యే ఒకరు ఏమన్నారంటే..
1.రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో ఎమ్మెల్యేలను గెలిచే ఛాన్స్ ఇక ముందు రాకపోవచ్చు. అందువల్ల ఈ టర్మ్ లోనే లోకేశ్ ను ముఖ్యమంత్రిని చేస్తే మంచిదనే ఆలోచన కుటుంబసభ్యుల్లో ఉంది.
2. లోకేశ్ ను సీఎంను చేస్తే చంద్రబాబు పరిస్థితి ఏమిటీ? కుమారుణ్ణి సీఎం చేసిన తర్వాత ఆయన రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి వంటి రాజ్యాంగబద్ధమైన పదవులను అలంకరిస్తారా? లేక సమాజవాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ MULAYAM SINGH తన కుమారుడికి సీఎం పదవిని అప్పగించిన తర్వాత రాజ్యసభకు ఎన్నికై ఢిల్లీలో ఉండి రాష్ట్ర రాజకీయాలను నిర్వహించినట్టు నిర్వహిస్తారా?
3.అలా వద్దనుకునేటట్టయితే శివసేన అధిపతి బాల థాకరే (Bal Thackeray) మాదిరి పార్టీ అధిపతిగా ఉంటూ కుమారుడికి సూచనలు, సలహాలు ఇస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తారా?
4. కేంద్ర ప్రభుత్వం మదిలో ఉన్న జమిలి ఎన్నికలు- అంతసవ్యంగా సాగితే 2027లో జరుగుతాయంటున్నారు. కేంద్ర ప్రతిపాదనకు టీడీపీ ప్రభుత్వం కచ్చితంగా ఆమోదం తెలుపుతుంది. అలా తెలిపిన వెంటనే రాష్ట్ర అసెంబ్లీలు రద్దవుతాయి. చంద్రబాబు కూడా పదవీ త్యాగం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గెలిస్తేనే టీడీపీకి మళ్లీ భవిష్యత్తు. అంత భరోసాతో ఉండే రాజకీయపరిస్థితులు ఇప్పుడు లేవు. రాజకీయ అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు ఆ విషయం తెలియందేమీ కాదు. టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాదిరి ఓడిపోతే లోకేశ్ ను సీఎంగా చూడడం చంద్రబాబుకు సాధ్యం కాదు. అందువల్ల ఈ టర్మ్ లోనే లోకేశ్ ను సీఎంగా చేయాలని కుటుంబ పరంగా ఆయనపై వత్తిడి ఉందన్నది వాస్తవం.
5. ఇంకో రెండు మూడేళ్లలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ అవుతాయి. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం టీడీపీ మద్దతుపై ఆధారపడి ఉంది. చంద్రబాబు ఏమి చెప్పినా సాగుతోంది. ఈ సమయంలోనే రాష్ట్రపతి పదవిని కోరితే బీజేపీ నాయకత్వం తిరస్కరించే అవకాశం ఉండకపోవచ్చు. తన అనుభవం, సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఈ రాజ్యాంగ పదవులకు కలిసొచ్చే అంశాలు. ఈ పేరిట ఇతర పక్షాలనూ ఒప్పించే అవకాశం బీజేపీకి ఉంటుంది. ఆయనైతే ఇండియా కూటమిలోని కొన్ని రాజకీయ పార్టీలు కూడా సుముఖత వ్యక్తం చేయవచ్చు.
6. ఒకవేళ ఆ పదవి కుదరకపోతే రాజ్యసభకు ఎన్నికై ఢిల్లీలో ఎన్డీఏ కన్వీనర్ గా కొనసాగవచ్చు.
7. మోదీ ప్రభుత్వం ఎల్లకాలం చంద్రబాబును విశ్వసిస్తుందని భావించలేం. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న చందాన ఇప్పుడే లోకేశ్ కు సీఎంను చేస్తే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా ఉంటుందని టీడీపీలోని లోకేశ్ అనుకూలురు భావిస్తున్నారు.
8. కేంద్ర ప్రభుత్వానికి ఎదురుతిరిగితే ఏమవుతుందో- తమిళనాడు మాజీ సీఎం జయలలిత అనుభవం- కళ్ల ముందు ఉండనే ఉంది కనుక చంద్రబాబు ఆ సాహసం చేస్తారని అనుకోవాల్సిన పని లేదు, పైగా ఆయనపై కేసులు పెండింగ్ లో ఉండనే ఉన్నాయి. వీటిని ఏ దశలోనైనా బయటకు తీయవచ్చు. ఏ విధంగా చూసినా లోకేశ్ ను ముఖ్యమంత్రిని చేయడానికి ఇదే సరైన అదును అని టీడీపీలోని ఓ వర్గం గట్టిగానే భావిస్తోంది.
మరి పవన్ కల్యాణ్ పరిస్థితి ఏమిటీ?
ఇదే జరిగితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి ఏమిటీ? ఇప్పటికైతే చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య సయోథ్య బాగానే ఉంది. ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో సాగుతోంది. లోకేశ్ ను సీఎంగా చేయాలన్న టీడీపీ ప్రతిపాదనకు పవన్ కల్యాణ్ అంగీకరించినా, లేకున్నా - ఆ పార్టీ సొంత వ్యవహారమనే పేరిట- ముందుకే సాగవచ్చు. లోకేశ్ సీఎంను చేసిన తర్వాత జనసేన తప్పుకుంటామన్న టీడీపీ బెదరకపోవచ్చు. జనసేన మద్దతు లేకపోయినా టీడీపీ సొంతబలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సంఖ్యాబలం ఉంది. రాజకీయాలలో ఏదీ శాశ్వతం కాదు. అవసరాలు తప్ప మరేది శాశ్వతం కాదు. అందువల్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒప్పుకున్నా లేకున్నా చంద్రబాబు తల్చుకుంటే లోకేశ్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టవచ్చు. ప్రస్తుతం ఆ గుంజాటనే చంద్రబాబును వేధిస్తోంది. పవన్ కల్యాణ్- లోకేశ్ నేతృత్వంలో పని చేయడానికి అంగీకరింపజేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నా అది అంత తేలిక కాదు. అందుకని ఈలోపే పవన్ ను కేంద్రానికి పంపి కుమారుణ్ణి సీఎం చేస్తారని భావిస్తున్నారు.
ఇప్పటికైతే ఇవన్నీ ఉహాగానాలే అయినా నిప్పులేనిదే పొగ రాదు కనుక లోకేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నది ఓ వామపక్ష పార్టీ నాయకుని వ్యాఖ్య.