పవన్ కల్యాణ్ తిరుపతి నుంచే, లేదంటే తానేనంటున్న సుగుణమ్మ
x
సుగుణమ్మ

పవన్ కల్యాణ్ తిరుపతి నుంచే, లేదంటే తానేనంటున్న సుగుణమ్మ

టికెట్ కోసం టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పార్టీ మారడానికి సిద్ధం అయ్యారా? జనసేన నుంచి పోటీ చేస్తా అంటున్న ఆమె.. మాటల వెనుక మర్మం ఏమిటి..?


ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్ - తిరుపతి



పొత్తుకు ముందు నుంచి తిరుపతి అసెంబ్లీ సీటుపై కన్నేసిన జనసేన పార్టీ నేతలు పట్టుబట్టి సాధించుకున్నారు. అంతేకాదు, టిడిపి నుంచి వలస వస్తారనే జనసేన నేతల మాటలకు టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వ్యాఖ్యలు ఊతమిస్తున్నట్లు కనిపిస్తోంది. "తిరుపతి నుంచి జనసేన చీఫ్ కొణిదెల పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే.. గెలిపించుకుంటాం. లేదంటే.. ఆ సీటు నాకే" ఇవ్వండని టిడిపి మాజీ ఎమ్మెల్యే ఎం. సుగుణమ్మ చెబుతున్న మాటల వెనక.. మర్మం ఏమిటి? టిడిపి నుంచి జనసేనకు వెళ్లడానికి ఆమె మానసికంగా సిద్ధం అయినట్లు కనిపిస్తోంది.
"తెలుగుదేశం పార్టీ పుట్టిన తిరుపతిలో.. సైకిల్ గుర్తు లేకుండా ఈసారి ఎన్నికలకు వెళ్లాలంటే చాలా బాధగా ఉంది" అని టికెట్ ఆశించి భంగపడిన టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మధన పడిపోతున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోనే టిడిపికి పురుడు పోసిన ఎన్‌టీ రామారావు, ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ప్రజారాజ్యం పార్టీకి తిరుపతిలో ఊపిరి పోసిన సినీ నటుడు చిరంజీవి కూడా ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అని ఆమె గత చరిత్రను గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో...
రానున్న ఎన్నికల్లో టిడిపి- జనసేన పొత్తు వల్ల తిరుపతిలో జరిగే ఎన్నికలకు ఈవీఎంలో సైకిల్ గుర్తు కనిపించదు. అని ఆమె అంటున్నారు. టికెట్ లభించలేదనే బాధే ఆమెలో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక అడుగు ముందుకు వేసిన ఆమె, టిడిపి అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు అనుమతిస్తే, జనసేన నుంచి ఎమ్మెల్యేగా తిరుపతి నుంచి పోటీ చేస్తానని ఆమె తన మనసులోని మాట బయటపెట్టారు. అంటే పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చినట్లు భావిస్తున్నారు. తిరుపతి శాసనసభ స్థానాన్ని జనసేనకు కేటాయించిన నేపథ్యంలో టిడిపి నియోజకవర్గ నేతలు, శ్రేణుల ఆత్మీయ సమావేశంలో ఆ మాటలు అన్నారు.
"ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంలో ఎక్కడ రాజీపడలేదు. అధికార వైయస్సార్సీపీని కట్టడి చేయడంలో ఆవిశ్రాంతంగా పని చేశాం" అని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ చెప్పుకొచ్చారు. సైకో పోవాలంటే సైకిల్ త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు తనతోపాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి. నరసింహ యాదవ్ ను కూడా విజయవాడకు పిలిపించి అన్ని విషయాలు వివరించారని గుర్తు చేశారు.

తిరుపతి బలిజలకే టికెట్ ఇవ్వాలి..
ఇక్కడ ఇంకో విషయం కూడా ప్రస్తావించాలి. తిరుపతిలో బలిజ సంఘం నాయకుల ఆత్మీయ సమావేశం ఇటీవల జరిగింది. అందులో ఒకటే తీర్మానించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేయడానికి సాదర స్వాగతం పలుకుతామని స్పష్టం చేశారు. ఆయన కాకుంటే.. తిరుపతి నియోజకవర్గంలోని బలిజలకు మాత్రమే టికెట్ ఇవ్వాలి. అని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.

ఆశావహులకు లేనట్టే..
గ్రేటర్ రాయలసీమ మొత్తానికి చూస్తే, చిత్తూరు శాసనసభ నియోజకవర్గం నుంచి మాత్రమే బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆరణి శ్రీనివాసులు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈసారి ఆయనకు చిత్తూరులో ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. కినుకు వహించిన ఆర ణి శ్రీనివాసులు వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసి ముందుచూపుతో జనసేన పార్టీలో చేరినట్లు భావిస్తున్నారు. ఈయన తోపాటు చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ కూడా తిరుపతి అసెంబ్లీ స్థానంపై ఆశలు పెట్టుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. తిరుపతి అసెంబ్లీ సీటు తిరుపతి బలిజలకే ఇవ్వాలంటున్న పరిస్థితుల్లో... అటు ఆర ణి శ్రీనివాసులు, ఇటు ఏఎస్ మనోహర్ వ్యూహం ఫలించేటట్లు కనిపించడం లేదు.

వ్యూహాత్మకంగానే ఆలోచన..
వీటన్నిటిని బెరీజు వేసిన టిడిపి మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ ఎలాగైనా సరే పోటీ చేయాలనే తలంపుతో.. తన మనసులోని మాటను బయట పెట్టారని భావిస్తున్నారు. ప్రస్తుతం జనసేన నుంచి తిరుపతిలో టికెట్ ఆశిస్తున్న వారిలో ఇద్దరి ముగ్గురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ, వారి శక్తి సామర్థ్యాలు చాలు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చిక్కుముడి వీడాలి అంటే.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది. ఆ చిక్కుముడి కూడా మరో రెండు రోజుల్లో వీడే అవకాశం ఉందని టిడిపి నాయకులు భావిస్తున్నారు.


Read More
Next Story