రైల్వే కోడూరు జనసేనాని సీఎం జగన్ మనిషా?
జనానికి తెలియని జన సైనికుడు, వైఎస్ఆర్‌సీపీ జడ్పీటీసీ మేనల్లుడు తెరపైకి వచ్చారు. కంచుకోటలో టీడీపీ సైకిల్ గుర్తు కనిపించకుండా పోతోందా..
(ఎస్.ఎస్.వి..భాస్కర్ రావ్)
తిరుపతి: నాయుడు గారు.. ఓ చౌదరి గారు.. రెడ్డి గారు.. ఓ రాజు గారు .. అనే ఓ రాములమ్మ సినిమాలోని పాటతో దాసరి నారాయణరావు ప్రశ్నించిన తీరుకు.. కడప జిల్లా రైల్వే కోడూరు అసెంబ్లీ సెగ్మెంట్‌కు కూటమి అభ్యర్థిని ఎంపిక చేసిన తీరుకు సరిగ్గా సరిపోతుంది! రైల్వే కోడూరు నియోజకవర్గానికి ఏమైంది? టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ సెగ్మెంట్‌లో మొదటిసారి సైకిల్ గుర్తు కనిపించని పరిస్థితి ఏర్పడింది. అనూహ్యంగా, జనానికి తెలియని వ్యక్తి జనసేన పార్టీ అభ్యర్థిగా ఎలా తెరమీదకి వచ్చారు? రెండుసార్లు ఓటమి చెందిన పంతగాని నరసింహ ప్రసాద్‌ను ఎందుకు పక్కన పెట్టారు? స్వయానా తన స్నేహితుడు మాజీ మంత్రి సినీ నిర్మాత డాక్టర్ శివప్రసాద్ అల్లుడుని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ ఎందుకు ఉపేక్షించారు?
ఆ పుకారు నిజమేనా??
అన్నమయ్య జిల్లాలో రెండేళ్ల కిందట లోపాయికారి ఒప్పందం జరిగిందనేది నిజమా,,? కోవర్ట్ ఆపరేషన్ ఏమైనా జరిగిందా?! టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వైఖరి ఏంటి? ఈ వ్యవహారం టీడీపీలోనే కాదు జన సైనికులను కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆదివారం సాయంత్రం వరకు టీడీపీ నుంచి ఆశలతో ఉన్న మహిళా నేతలు దిమ్మెర పోయారా? అసలు ఏం జరిగింది? బలిజ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ ఏ. సాయి ప్రతాప్ మామ పీవీఎస్ మూర్తి జోక్యంతో జనసేన టికెట్ దక్కిందా? ఇది సమాధానం లేని మిలియన్ డాలర్ల ప్రశ్న!?
ఆశావహులు గల్లంతు
రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి ఇద్దరు మహిళలు టికెట్ ఆశించారు. అనడం కంటే తెరమీదకి తీసుకోవచ్చా రు. మాల సామాజిక వర్గానికి చెందిన ఎన్నారై నగిరిపాటి రేవతి, పుల్లంపేట మండలంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన షాప్ మాజీ డైరెక్టర్ దుద్యాల జయచంద్ర సతీమణి దుద్యాల అనితి దీప్తి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఆదివారం సాయంత్రానికి జనసేన పార్టీ నుంచి ఓబులవారిపల్లె మండలం ముక్క వారి పల్లి సర్పంచ్ అరవ శ్రీధర్ పేరు ప్రముఖంగా వినిపించింది. రాత్రికి సీన్ మారిపోయి, పెనగలూరు మండలం ఎన్ ఆర్ పురం దళితవాడకు చెందిన ఎనమల భాస్కరరావును జనసేన పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో రైల్వే కోడూరు నియోజకవర్గంలో కూటమి పార్టీల నాయకులు శ్రేణులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఎందుకు ఇలా జరిగింది
ఈ వ్యవహారం వెనుక పెద్ద కథ ఉంది. 2014 ఎన్నికలకు ముందు టీడీపీ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్చార్జిగా చిట్వేలి మండలం ఎగువపల్లికు చెందిన కస్తూరి విశ్వనాథం నాయుడును టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు ఇన్చార్జిగా నియమించారు. రెండు ఎన్నికల్లో ఆయన సారథ్యంలో జరిగాయి. తిరుపతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడిన విశ్వనాథ నాయుడు ఇటీవల కాలంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి టచ్‌లోకి వెళ్లారని తెలిసింది.
బత్యాలను కాదని..
మొదటి నుంచి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గ పెత్తనం సాగేది. కట్టా నారాయణయ్య మరణం ఆ తర్వాత ఆయన కుమారులు సత్తా చాటలేని స్థితిలో.. 20 నుంచి 25 వేల ఓట్లను ప్రభావితం చేయగలిగిన సత్తా ఉన్న బలిజ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయులుకు కూడా ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వలేదు. ఆయన రాజంపేట నుంచి టీడీపీ టికెట్ రేసులో ఉన్నారు. దీంతో రైల్వే కోడూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులతో విభేదించి బయటికి వచ్చిన వైఎస్ఆర్‌సీపీ నాయకుడు ముక్క రూపానంద రెడ్డికి టీడీపీ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు రైల్వే కోడూరులో ఆ బాధ్యతలు చేపట్టడం మొదటిసారి. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అన్నీ తానే వ్యవహరిస్తూ అభ్యర్థులను తీసుకొచ్చారని తెలిసింది. తర్వాత ఏమైంది అంటే..
జన సైనికుడిగా వైఎస్ఆర్‌సీపీ జడ్పీటీసీ మేనల్లుడు
పెనగలూరు మండల వైఎస్ఆర్‌సీపీ జడ్పీటీసీ సభ్యుడు ఉదయగిరి సుబ్బరాయుడుకు స్వయాన చెల్లెలి కొడుకు అయిన పెనగలూరు మండలానికి చెందిన ఎనమల భాస్కర రావును జనసేన అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ఈయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు కుటుంబీకుల ద్వారా తెలిసిన సమాచారం. భాస్కర్ రావు తెరపైకి రావడంలో రావడంలో కూడా ముక్క రూపానంద రెడ్డి సహకారం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. బీటెక్ చదివిన జనసేన అభ్యర్థి భాస్కరరావు మొదటి నుంచి వైఎస్ఆర్‌సీపీ నాయకుల కనుసనల్లో ఉంటున్నారని స్థానికులు చెబుతారు.
ప్రస్తుతం ఆయన టీసీఎస్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాల ఆన్‌లైన్ జాయింట్ వెంచర్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అది కూడా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం వల్లే వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. మొదటి నుంచి జనసేన అభ్యర్థి భాస్కరరావు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు వైఎస్ఆర్‌సీపీ నాయకుల కనుసనల్లో మెలుగుతుంటారని చెబుతున్నారు. ఇటీవల రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పెనగలూరు మండలానికి వెళ్లిన ఏర్పాట్లను ఎనమల భాస్కర్ రావే పర్యవేక్షించారని స్థానికుల నుంచి సమాచారం.
జనసేన అభ్యర్థి స్వగ్రామమైన ఎన్‌ఆర్ పురం దళిత వాడలో కూడా సఖ్యత లేదనేది సమాచారం. సొంత మండలం పెనగలూరులో కూడా ఇతని పేరు చెబితే రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఒక విషయం మాత్రం స్పష్టం. రాజంపేట మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ ఉన్న మండలంలో యనమల భాస్కరరావు అభ్యర్థిగా రావడం మాత్రం గొప్ప విషయమే అంటున్నారు. రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నాలుగుసార్లు, టీడీపీ ఐదు సార్లు, వైఎస్ఆర్‌సీపీ మూడు ఎన్నికల్లో విజయం సాధించింది. 1983 నుంచి 1999 వరకు టీడీపీ కంచుకోటగా ఉన్న రైల్వే కోడూరులో ఆ పార్టీ గెలిచి 25 ఏళ్లు కావస్తోంది.
ఆనాటి... కట్టా వ్యూహమే వేరు
మాజీ స్పిన్ ఫెడ్ చైర్మన్, రైల్వే కోడూరు సమితి మాజీ అధ్యక్షుడు కట్టా నారాయణయ్య టీడీపీకి కంచుకోటగా మార్చారు. ఆయన మరణం తర్వాత ఇన్చార్జి బాధితులు తీసుకున్న కుమారులు కట్టా బాలాజీ, ఇందీవర్ నాయుడు తండ్రి వ్యూహాలు అమలు చేయడంలో వైఫల్యం చెందారు. పార్టీ శ్రేణుల్లో లోపించిన అనైక్యత తదితర కారణాలతో 2004 ఎన్నికల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవాలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ద్వారా టీడీపీకి బ్రేక్ పడింది.
నియోజకవర్గంలోని రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, పెనగలూరు, మండల పరిధిలో 1,82,655 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో దళిత, గిరిజన ఓటర్లు 50వేల మందికి పైగానే ఉన్నారు. దాదాపు 35 నుంచి 40 వేల మంది ఓటర్లు బలిజ సామాజిక వర్గం ఓటర్లు ఉంటే, కమ్మ, రెడ్డి, ముస్లిం ఓటర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు.
నాలుగోసారి కొరముట్ల
2024 ఎన్నికలకు కూడా వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా కొరముట్ల శ్రీనివాసులు పోటీలో ఉన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో... వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా కొరముట్ల శ్రీనివాసులు 2009లో 39,359 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 2012 ఉప ఎన్నికల్లో 34,465 ఓట్లు, 2014లో 64, 848 ఓట్లు, 2019 ఎన్నికల్లో ఆయన వరుసగా గెలిచారు. ఈసారి ఎన్నికల్లో ఆయన విజయం నల్లేరు మీద నడకే అని భావిస్తున్నారు.
అంచనాలు తలకిందులు..
టీడీపీ అభ్యర్థిగా రెండుసార్లు ఓటమి చెందిన పంతగాని నరసింహ ప్రసాద్‌కు టికెట్ ఇచ్చి ఉంటే.. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎన్నికల తీరు విభిన్నంగా ఉందేదని భావించారు. టీడీపీ కూటమికి వల్ల, కమ్మ, క్షత్రియ రాజులకు తోడుగా బలిజ సామాజిక వర్గం బలంగా నిలిచేదని భావించారు. దీనివల్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, పెనగలూరు మండలాల్లో కూటమికి మంచి మెజారిటీ లభించే అవకాశం ఉండేదని భావించారు. పంతగాని నరసింహ ప్రసాద్ మాజీ మంత్రి, నటుడు, నిర్మాత డాక్టర్ ఎన్ శివప్రసాద్ స్వయానా అల్లుడు. ఈయన చంద్రబాబు నాయుడుకి సహ విద్యార్థి. అయినా.. నరసింహ ప్రసాద్‌కు టికెట్ ఇస్తే సహకరించబోననే ఓ టీడీపీ మాజీ ఇంచార్జ్ మాటకు విలువ ఇచ్చిన టీడీపీ చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు చేతులు కాల్చుకున్నారని మాటలు వినిపిస్తున్నాయి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు.. జనసేన అభ్యర్థిగా తెరపైకి వచ్చిన భాస్కర్ రావును కూటమి పార్టీ నేతలు, ఓటర్లు ఎలా ఆదరిస్తారనేదే కాకుండా, సిట్టింగ్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుకు నల్లేరుపై నడక అవుతుందా? పోరాటం సున్నితంగానే ఉంటుందా అనేది పోలింగ్ జరిగే వరకు వేచి చూడాలి.