తరం మారింది.. మనుషులు మారారు..  సీమపై పట్టు మారుతోందా..!?
x

తరం మారింది.. మనుషులు మారారు.. " సీమ"పై పట్టు మారుతోందా..!?

రాయలసీమలో దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా వైయస్సార్ కుటుంబానిదే హవా. ఆ పరిస్థితి మారబోతోందా..?! తాత, తండ్రి కొనసాగించిన పట్టును జగన్ సడలించారా..


( ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: కాలం మారింది.. పరిస్థితులు మారాయి. స్వరాలు కూడా మారాయి. కొత్తాదేవుళ్ళు రాయలసీమ రాజకీయ తెరపై పట్టు బిగిస్తున్నారు. ఈ ప్రాంతంలో నాలుగు దశాబ్దాలకు పైగానే ఆధిపత్యం చెలాయించిన వైయస్సార్, ఆయన తండ్రి చరిత్ర మసకబారుతున్నట్లు కనిపిస్తోంది. ఇది భవిష్యత్తులో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముల్లులా గుచ్చుకునే పరిస్థితి లేకపోలేదన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.


ప్రస్తుతం రాజకీయ వాతావరణం..

" పులివెందుల పెద్దల" నుంచి .. "పుంగనూరు పెద్దన్న" చేతుల్లోకి వెళ్ళినట్లు కనిపిస్తోంది. కుమారుడు వైయస్సార్ రాజకీయ వ్యవహారాలను హత్యకు గురయ్యే ముందు వరకు వైయస్. రాజారెడ్డి చక్కదిద్దేవారు. పొరుగు ప్రాంతాల్లో రాజకీయ కార్యకలాపాలను గాడిలో పెట్టేవారు. అందుకే.. " పులివెందుల పంచాయతీ".. " రాజారెడ్డి రాజ్యాంగం" అని ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తుంటారు. దీనిని ఆయన మనవడు, సీఎం వైయస్. జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయారనే అభిప్రాయం కూడా లేకపోలేదు.

తన ప్రతినిధులుగా ఇటీవల కాలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ట్రబుల్ షూటర్స్‌గా రంగంలోకి దించారు. ఈ పరిణామాలపై వైయస్ రాజారెడ్డి, దివంగత సీఎం డాక్టర్ వైయస్సార్‌తో దగ్గర సంబంధాలు కలిగిన కడప జిల్లా రైల్వే కోడూరు సెగ్మెంట్ పెనగలూరు మండలానికి చెందిన బొజ్జిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏమంటున్నారంటే..

"వైయస్ రాజారెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డి. వీరిద్దరూ గ్రౌండ్ లెవెల్ లీడర్స్" అని ఫెడరల్ ప్రతినిధితో చెప్పారు. ఇంకా ఓ సంఘటన ఆయన గుర్తు చేసుకున్నారు. "డాక్టర్ వైయస్సార్ పర్యటన నెల్లూరులో ఉందంటే.. పది రోజులు ముందుగానే వైయస్ రాజారెడ్డి రంగంలోకి దిగుతారు. పులివెందుల నుంచి నెల్లూరు వరకు మార్గమధ్యంలో ఉన్న అన్ని గ్రామాలు పట్టణాలు సందర్శిస్తారు. ఆయా ప్రాంతాల్లో పద్ధతిగా ఉన్న నాయకులు, అలిగిన వారిని బుజ్జగించి, పరిస్థితి చక్కదిద్దడం ద్వారా వైఎస్. రాజశేఖర్ రెడ్డి పర్యటనకు బాట చక్కదిద్దేవారు" అని బొజ్జిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గతాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇదిలా ఉంటే..

వైయస్ రాజారెడ్డి ప్రభావం కడప జిల్లాలోనే కాకుండా పొరుగునే ఉన్న అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కనిపించేది. ఆయన కుమారుడు, దివంగత సీఎం వైయస్. రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాజకీయ వ్యవహారాల్లో.. బిజీగా ఉంటే.. ఈ ప్రాంతంలో ఆయన తండ్రి వైయస్ రాజారెడ్డి అన్ని తానై వ్యవహరించేవారు. ఏదో ఒక వ్యాపకంపై నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వైయస్సార్ అభిమాన శ్రేణులతో మమేకం అయ్యేవారు. ఆ కోవలో కడప జిల్లా రాజంపేట ఆ తరువాత వెరైటీస్ ద్వారా ఆర్థిక స్థిరత్వానిన్ని అందించిన రైల్వే కోడూరు నియోజకవర్గంలో నిత్యం అందుబాటులో ఉండే వారు. ఎక్కాల స్వరంతో, దూకుడుగా వ్యవహరించే యువకులు అంటే బాగా ఇష్టపడే వ్యక్తి వైయస్ రాజారెడ్డి. చాలా సందర్భాల్లో ఆయన తరచూ చెప్పిన మాట గుర్తు చేసుకోవచ్చు. "నేను పులివెందులలో వద్దంటబ్బా. మీ అన్న (వైయస్ రాజశేఖర్ రెడ్డి) చెప్పినాడు. నువ్వు పోయి కోడూరు, వెంకటగిరి ఆపక్క వాళ్ళతోనే ఉండుపో అన్నాడని సరదాగా వ్యాఖ్యానించిన సందర్భాలు చాలా ఉన్నాయి’’ అని చిట్వేలి మండలానికి చెందిన మైనారిటీ నాయకుడు గుర్తు చేసుకున్నారు.

దళితులు అంటే ప్రాణం..

వాస్తవానికి రెడ్డి సామాజిక వర్గం కంటే.. వైయస్ రాజారెడ్డి "దళితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. మీరు లేకుంటే మేము లేము. మమ్మల్ని వదిలి మీరు ఉండలేరు. చివరి వరకు ఆయన నోట ఇదే మాట వినిపించేది’’. ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారిలో ఒకరైన రైల్వే కోడూరు మండలానికి చెందిన దళిత నాయకుడు మారే వెంకటయ్య ఏమంటున్నారంటే... "వైయస్ రాజారెడ్డి పక్కన కుర్చీలో కూర్చుని హాయిగా మాట్లాడేవాళ్ళం. ఆయన మాతో కూడా అలాగే ఉండేవారు. వైయస్సార్ తరంలో ఆదిపత్య పోరు కాదు. దగ్గర చేర్చుకునే మనస్తత్వం. ఇప్పుడు ఆదిపత్య పోరు పెరిగింది. కుర్చీలో కూర్చుని మాట్లాడిన చోట దండాలు పెట్టి, నిలబడుకోలెం’’ అని గతాన్ని ప్రస్తుత పరిస్థితిని వివరించారు.

అన్నీ.. తానై...

తండ్రి వైయస్ రాజారెడ్డి మరణం తర్వాత... వైఎస్. రాజశేఖర్ రెడ్డి కి సోదరుడు వైఎస్. వివేకానందరెడ్డి, వారి కుటుంబానికి ఆత్మీయంగా మెలిగిన అభిమాన శ్రేణులు అండగా ఉండేవారు. డాక్టర్ వైయస్సార్ సీఎం అయిన తర్వాత కూడా కీలక నేతలు, తనను అభిమానించే వారికి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, వారి మాటలకు ఆయన విలువ ఇచ్చేవారు. సమస్యలు పరిష్కరించడం, పనులు చేసి పెట్టడం, తన వద్దకు వచ్చిన వారిలో ప్రతి ఒక్కరిని భుజంపై చెయ్యేసి మాట్లాడి, " రైట్ మా.. రైట్" అని పలకరింతను ఆక్సిజన్‌గా భావించేవారు. ఆనాటి సంఘటనను అనేక మంది ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఎల్పీ లీడర్‌గా ఉన్నా, ఎంపీగా పనిచేసినా, సీఎం హోదాలో కూడా ఎప్పుడూ ఆయన రాష్ట్రంలో అభిమానులకు, ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంత ప్రజలకు దూరం కాలేదు. ఆయన హైదరాబాదులో ఉన్నా, వైయస్ వివేకానంద రెడ్డి బయటి ప్రాంతాల్లో పనులు చూసుకునేవారు. వైయస్. భాస్కర్ రెడ్డి పులివెందుల ప్రాంతం చూసుకునేవారు.

వీటన్నిటికంటే ప్రధానంగా.. జిల్లాల్లో నాయకులకు విలువ ఇస్తూనే, వైఎస్ఆర్ తన ప్రాధాన్యతకు ఎక్కడా భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పైకి అది కనిపించకున్నా.. నాయకులు, శ్రేణుల అభిమానాన్ని, తన నాయకత్వ లక్షణాలను ద్విగుణికృతం చేసుకున్నారు. చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతిలో డాక్టర్ చింతామోహన్, గుంటూరులో రాయపాటి సాంబశివరావు, అమలాపురం ప్రాంతంలో హర్ష కుమార్ వంటి వారు మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావుతో స్వరాలు కలిపిన తనకు ధీటుగా ఎదిగే పరిస్థితి లేకుండా డాక్టర్ వైయస్సార్ నివారించుకోగలిగారు. ఇది గత చరిత్ర.

వారసుడికి అవకాశం..

సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో వైయస్సార్ అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తన నాయకత్వం, పార్టీపై పట్టు సడలకుండా మెలిగిన తీరు విమర్శకులను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది. అదే సమయంలో వారసుడిగా తన కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కడప ఎంపీగా ప్రజాజీవితంలోకి తీసుకువచ్చారు. కొంతకాలం తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం, వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విడవడం, సొంతంగా వైఎస్ఆర్సిపి ఏర్పాటు చేసి 2014 ఎన్నికల్లో పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీకి వెళ్లి అధికారానికి దూరమై, 2019 ఎన్నికల్లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన మోనార్క్ రాజకీయాలు సాగిస్తున్నారు. ఆలస్యంగా అయినా సరే వైయస్ వెంట నడిచిన సీనియర్లు అభిమాన శ్రేణులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచాయి. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్‌కు అండగా నిలిచిన మాజీ మంత్రి, బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన తర్వాత, రాజకీయ పరిస్థితులు మారిపోయాయి.

ఇప్పుడు సొంత చెల్లెలు వైయస్ షర్మిల రెడ్డి, బాబాయ్ కూతురు వయసు సునీత రెడ్డి వ్యతిరేకంగా మారారు. వాళ్లు ప్రస్తుతం సీఎం జగన్‌కు భారీ అడ్డుగా ఉన్నారు. వైయస్ వివేక హత్య కేసులో సీఎం వైఎస్ జగన్‌తో పాటు ఆయన బాబాయి కుమారుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై విమర్శనాస్త్రలు ఎక్కువ అయ్యాయి. వీటన్నిటిని పక్కకు ఉంచితే....

సీమపై పట్టు సడలుతోందా..?

2014 ఎన్నికల తర్వాత, అంతకుముందు రాయలసీమ ప్రధానంగా కడప జిల్లాలో వైఎస్ఆర్ కుటుంబం ఆధిపత్యమే ఎక్కువ ఉండేది. రాజకీయంగా విస్తృతం కావడం, సీట్ల కోసం మంత్రి పెద్దిరెడ్డి కి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. దివంగత సీఎం వైఎస్సార్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దన్న పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన పరిధిలో కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాతో పాటు ఉమ్మడి కడప జిల్లాలో కూడా ప్రభావం చూపుతున్నారు. రాజంపేట నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా ఈ ప్రాంతంలో ట్రబుల్ షూటర్‌గా మారారు. 2024 ఎన్నికల కోసం వైయస్సార్సీపీ రాయలసీమ ప్రాంత సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ జిల్లాలోని అనేక నియోజకవర్గం పార్టీల లోటుపాట్లను కూడా ఆయనే చక్కటి ద్వారా తన ఆధిపత్యాన్ని పెంచుకుంటున్నారని మాటలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గాల్లో నాయకులు అభ్యర్థుల మధ్య సమన్వయం కుదరచడం, జిల్లాస్థాయిలో పార్టీ వ్యవహారాలను చర్చించడానికి ఏం చేయాలనేది కూడా ఆయనే సూచనలు జారీ చేస్తున్నారని చెబుతున్నారు. అది కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి అందే సందేశాలతో..!

రాయలసీమలోని ప్రతి నియోజకవర్గాన్ని సందర్శించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీకి గతంలో మాదిరే అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే దిశగా వ్యూహం సిద్ధం చేయడంతో పాటు, యంత్రాంగాన్ని కూడా ఆయనే నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల ఆయనే అభ్యర్థులను శాసించే స్థాయికి వెళ్లినట్లు కూడా వినిపిస్తోంది. పెద్దిరెడ్డికి తోడుగా కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా చిత్తూరు జిల్లా తరహాలోనే కడప జిల్లాలో కూడా.. మండల స్థాయి నాయకులతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య కూడా సమన్వయం కుదరచడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మిథున్ రెడ్డి చొరవ తీసుకోవడం వల్లనే కడప జిల్లా రాయచోటిలో పరిస్థితి అనుకూలంగా మార్చుకున్నట్లు సమాచారం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఈ తరహాలో అనేక నియోజకవర్గాల్లో ఇదే వ్యూహం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కోస్తా ప్రాంతంలో ప్రధానంగా గోదావరి జిల్లాల్లో ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా వైఎస్ఆర్సిపిలో చక్రం తిప్పుతున్నట్లు భావిస్తున్నారు.

ఆనాటి నుంచి.. ఇప్పటివరకు పరిస్థితులు గమనిస్తుంటే...

" గతంలో అభిమానంతో వైఎస్ఆర్ కుటుంబం నాయకులను చేరదీసింది. ఆ కథ వేరు. ఇప్పుడు వైయస్సార్ కుటుంబ నేపథ్యం పక్కదారి పట్టించారు. పెద్దిరెడ్డి కుటుంబం గుత్తాధిపత్యం ప్రారంభమైంది" అని రైల్వే కోడూరు ప్రాంతానికి చెందిన బొజ్జిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. "స్వతహాగా సీఎం వైఎస్ జగన్ వ్యాపారవేత్త. ఆ ధోరణి ఇంకా పోలేదు. ఎన్నికలు ముగిశాక మళ్ళీ పాతలోకి రావచ్చేమో! భవిష్యత్తులో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో చూడాలి’’ అని అన్నారు.

Read More
Next Story