జిల్లాల విభజన.. ఓటు మాటేనా.. !
x
చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి

జిల్లాల విభజన.. "ఓటు" మాటేనా.. !

ఎన్నికల వేళ జిల్లాల విభజన అంశం ప్రకంపనలు రేపింది. ఇది ఎన్నికల కోసం ఓటు మాట..? అనే చర్చకు ఆస్కారం కల్పించింది.


(ఎస్.ఎస్.వి భాస్కర్ రావ్)

తిరుపతి: " రాష్ట్రంలో జిల్లాలను ఇష్టానుసారంగా పునర్విభజన చేశారు. శాస్త్రీయత లోపించింది. అధికారంలోకి రాగానే, సమీక్షిస్తా మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయిస్తా" అని అన్నారు టీడీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడు ఎన్ చంద్రబాబు నాయుడు.

" జిల్లాల ఏర్పాటు అనేది పద్ధతిగా లేదు. ఇవి మార్చాల్సిన అవసరం ఉంది. పాలనాపరంగా ఇబ్బందులు లేకుండా చూడాలి" అని చెప్పారు బీజేపీ జాతీయ కార్యదర్శి, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.

పార్టీలు వేరు... పాట ఒకటే

ఎన్నికల సంఘ గ్రామం ప్రారంభమైన నేపథ్యంలో మాజీ సీఎంలు ఎన్ చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వేర్వేరు సందర్భాల్లో ఇటీవల "మదనపల్లి జిల్లాగా ఏర్పాటు చేయాలని ఒకరు, రాజంపేట జిల్లా ఏర్పాటు చేయాలని మరొకరు" చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాయలసీమలో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా, ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు టిడిపి అభ్యర్థి పాశం సునీల్ కుమార్ కూడా ఇదే పాట అందుకున్నారు. "మా పార్టీ అధికారంలోకి రాగానే గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేయడంపై దృష్టి పెడతాం" అనేది ఆయన మాట.


ప్రకంపనలు

ఎన్నికల సమరం జరుగుతున్న వేళ వీరిద్దరి మాటలు ప్రకంపనలు సృష్టించాయి. వీరిద్దరూ చేసింది ఓట్ల కోసమా? ప్రాంతీయ అసమానతలు సృష్టించి లబ్ధి పొందాలనే ఎత్తుగడ? వాస్తవంగా వారిద్దరూ సంధించిన ఆరోపణలకు కట్టుబడి.. మళ్లీ పునర్‌వ్యవస్థీకరణకు చొరవ తీసుకుంటారా? ఒకవేళ.. తీసుకుంటే అది సాధ్యమా? ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యమైన సందర్భం ఇక్కడ ప్రస్తావించాలి..

ముగ్గురు మిత్రులు ఏం చేశారు

కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఆ పార్టీకే మిత్రుడుగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పార్టీ కూడా ఉంది. వీరిద్దరికీ తోడు, ఆ పార్టీతో ‘టచ్ మీ నాట్’గా ఉన్న ఎన్ చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ జరిగి రెండేళ్లు పూర్తయ్యాయి. ఇంతకాలం వీరిద్దరూ.. లేదా ముగ్గురు కేంద్రం నుంచి ఎలాంటి ఒత్తిడి తీసుకువచ్చారు? భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది విడమరచి చెప్పాల్సిన అవసరాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. దీనిపై ఓ సామాజిక ఉద్యమకారుడు ఏమంటున్నారంటే..

" జిల్లాల విభజన సమస్యపై ప్రధానంగా.. కేంద్రంగా ఏర్పాటు చేయాలని 633 రోజులు పోరాటాలు సాగించాం" వీసీకే పార్టీ (విడుదలై చిరుతయిగలు కచ్చి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భారతీయ అంబేద్కర్ సేన (బిఏఎస్ఎస్) స్థాపక అధ్యక్షుడు పేటీఎం శివప్రసాద్ గుర్తు చేశారు. ‘‘మేము వినతి పత్రం ఇస్తే, విపక్ష నేత ఎన్ చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చారు. ఆయన స్థాయిలోనే సీఎంగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేశారు. ఆయన మాటలకు విశ్వసనీయత లేదు" అని శివప్రసాద్.. ఫెడరల్ ప్రతినిధి వద్ద వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్‌లో 2022 సంవత్సరంలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. 13 ఉమ్మడి జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి విపక్షాలే కాదు అధికారపక్షంలోని నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా.. నిరసన గళం వినిపించడమే కాదు. ప్రదర్శనలు, దీక్షలు కూడా చేశారు.

బ్రిటిష్ కాలంలో... దూరదృష్టి

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 13 జిల్లాలు ఉన్నాయి. ఇందులో ప్రకాశం, విజయనగరం జిల్లాల మినహా మిగతావన్నీ బ్రిటిష్ వారి కాలంలో ఏర్పాటు చేసిన పరిపాలనా కార్యాలయాలు. రెవెన్యూ డివిజనల్ కేంద్రాలు కూడా అలాగే ఏర్పాటు చేశారు. ఉదాహరణకు రైల్వే లైన్ల నిర్మాణం పరిశీలిస్తే 100 సంవత్సరాల భవిష్యత్తు కార్యాచరణ దృష్టిలో ఉంచుకుని నిర్మాణం సాగించే వారని చెబుతారు. కోవలోనే రెవెన్యూ డివిజన్ కేంద్రాలు జిల్లాలను కూడా ఏర్పాటు చేశారు అనే విషయం భౌతికంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు జిల్లాలు ఏర్పడ్డాయి. వాటిలో పరిపాలన సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గుంటూరు నెల్లూరు కర్నూలు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలను వేరుచేసి 1970లో ప్రకాశం జిల్లా, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలోని కొన్ని ప్రాంతాలను విడదీసి 1979లో విజయనగరం జిల్లాను ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లా చిన్నది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక జిల్లాల విభజన తర్వాత విశాఖపట్నం జిల్లా పరిధి చిన్నదిగా మారింది. ఈ విషయాన్ని ఇలా ఉంచితే...


ఇది సమస్య

వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు డ్రాఫ్ట్ నోట్ తయారు చేశారు. దీనిపై అనేక ప్రాంతాల్లో ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా మారింది. అయినా అనుకున్నదే చేస్తా.. అన్నట్టు జిల్లాల పునర్విజన జరిగింది.

దేశంలోనే పెద్ద డివిజన్

మిగతా ప్రాంతాల సమస్యలు పక్కకు ఉంచితే రాయలసీమలోని మదనపల్లి దేశంలోనే అత్యంత పెద్ద డివిజన్. ఆ తర్వాత కడప జిల్లా రాజంపేట డివిజన్ పెద్దది. జమ్మలమడుగు, అనంతపురం జిల్లాలో అనంతపురం కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్ కేంద్రాలను సబ్ కలెక్టర్ కార్యాలయాలు గానే పరిగణిస్తారు. ఐఏఎస్ అధికారులను ఇక్కడ నియమించేవారు. కార్యక్రమంలో వీటిని ఆర్‌డిఓ స్థాయి అధికారులను నియమిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే..

ఈ రెండు జిల్లాల్లో రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ ఆందోళనకు దారి తీసింది. ఈ పట్టణంలో బ్రిటిష్ వారి కాలం నాటి భవనాలు ఇంకా చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇప్పటికే కార్యాలయాలు అందులోని నిర్వహిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో రాజకీయ ప్రభావం ఎక్కువగా కనిపించినట్లు స్పష్టమవుతుంది.

అన్నమయ్య పుట్టింది ఎక్కడ..

ఆ పేరు పెట్టింది ఎక్కడ

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి కీర్తించిన అన్నమాచార్యులు జన్మించిన స్థలం తాళ్ళపాక గ్రామం. ఇది రాజంపేట డివిజన్ కేంద్రానికి నడిచి వెళ్లే అంత దగ్గరగా ఉంటుంది. సబ్ కలెక్టర్ స్థాయి అధికారి పరిపాలించే స్థాయి కలిగిన దేశంలోనే అత్యంత పెద్ద రెవెన్యూ డివిజన్ అయిన మదనపల్లిను జిల్లాగా ఏర్పాటు చేయడానికి సానుకూలత ఉంది. ఈ రెండిటిని పక్కకు ఉంచిన రాష్ట్ర ప్రభుత్వం... మదనపల్లి- రాజంపేటకు మధ్యలో ఉన్న గుక్కెడు ఎన్నిటికి కష్టపడే రాయచోటికి జిల్లా హోదా కల్పించి అన్నమయ్య జిల్లాగా నామకరణం చేశారు. దీని వెనుక చిత్తూరు, కడప జిల్లా నాయకుల రాజకీయ ప్రయోజనాలే ఎక్కువ ఉన్నాయనే ఆరోపణలు బహిరంగంగా ఉన్నాయి.

దీనిపై నాయకులు ఇచ్చిన వివరణ ఎలా ఉందంటే.. " అభివృద్ధి చెందిన ప్రాంతాలు కాకుండా... వెనుకబడిన ప్రాంతాల్లో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేస్తే మేలు జరుగుతుందని" సన్నాయి నొక్కులు నొక్కారు. ఇదే వాస్తవం అనుకుంటే.. " అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది" హిందూపురం వెనుకబడి ఉంది. పట్టుగూళ్ళు వ్యాపార కేంద్రంగా ఉన్న హిందూపురంపై వివక్ష చూపించారనేది ఆరోపణ.

కడప జిల్లాలో చూపించిన ప్రేమ.. అనంతపురం జిల్లాకు వచ్చేసరికి ఎందుకు దారి తప్పిందని ప్రశ్నకు సమాధానం లేదు. ఏ విధంగా కనిపించే సాక్ష్యం ఒకటే. హిందూపురం నియోజకవర్గం ఆవిర్భావం నుంచి టిడిపికి కంచుకోటగా ఉంది. అక్కడ ఎమ్మెల్యే కూడా మాజీ సీఎం, టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టి రామారావు కుమారుడు నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందువల్లే హిందూపురం జిల్లా కేంద్రం కాకుండా రాజకీయ వివక్షకు గురైందని ఆరోపణ లేకపోలేదు.


నిరసనలు... ఆపై ఒత్తిళ్లు

జిల్లాల ఏర్పాటుకు ముందు ఆ తర్వాత రాజంపేట, కోడూరు, మదనపల్లి పట్టణాల్లో రాజకీయేతర పక్షాలే కాకుండా అధికార పక్షానికి చెందిన నాయకులు కూడా నిరసన గళం వినిపించారు. దీక్షలు ధర్నాలు కూడా నిర్వహించారు. పరిస్థితిని గమనించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడారు. మీ ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకులు పాల్గొనకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.

అశాస్త్రీయం...

జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా లేదు అని బిజెపి జాతీయ కార్యదర్శి, సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రెండు రోజుల క్రితం ఓ సభలో వ్యాఖ్యానించారు. ‘‘మదనపల్లెకు ఆనుకుని ఉన్న పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరులో కలపడం ఏంటి? మదనపల్లికి సమీపంలోనే ఉన్న తంబళ్లపల్లి, పీలేరు నియోజకవర్గాలను, రాజంపేటను కాదని ఆ పట్టణం, రైల్వే కోడూరు, బద్వేలులోని కొంత భాగాన్ని తీసి, రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయడం సబబుగా లేదు’’ అని కిరణ్ కుమార్ రెడ్డి ఆక్షేపణ వ్యక్తం చేశారు. దీనిని సమగ్రంగా అధ్యాయం చేయించడం ద్వారా, జిల్లా కేంద్రాలను పునర్‌వ్యవస్థీకరించడానికి అవసరమైన చర్యలను తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.

అంతకుముందు కూడా మాజీ సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు మదనపల్లెలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ... " మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం’’ అని ప్రకటించారు. వీరి ప్రకటనపై కడప జిల్లాకు చెందిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి ఈశ్వరయ్య ఏమంటున్నారంటే... " అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని మాట టిడిపి మేనిఫెస్టో ప్రకటించింది. కానీ, బిజెపి నాయకుడుగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి మాటలే హాస్యాస్పదంగా వున్నాయి" అని ఈశ్వరయ్య.. ఫెడరల్ ప్రతినిధితో అన్నారు.

అమరావతి రాజధానికి పునాది రాయి వేసింది ప్రధాని మోదీ కాదా? ఒకే రాజధాని పేరుతో మాటల్లో పలికి.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటనపై ఎందుకు స్పందించలేదు" అని బిజెపి నాయకులను సూటిగా ప్రశ్నించారు. "ఇది కేవలం దోబూచులాట మాత్రమే. స్వార్థ ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉన్నాయి" అని ఈశ్వరయ్య వ్యాఖ్యానించారు. మదనపల్లితో పాటు మార్కాపురం జిల్లా కూడా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుందని, దీనివల్ల ఇప్పుడున్న జిల్లాల అస్తిత్వానికి ప్రమాదం ఉండబోదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఈ రెండు జిల్లాలను మాత్రమే మార్చడానికి చర్యలు తీసుకుంటే ఈ ప్రభావం.. మొత్తం మీద కనిపించదా? అంటే మళ్ళీ సమస్య మొదటికి వస్తుందా అనే భావన వ్యక్తం అవుతుంది. ఎన్నికల నాటి మాటగానే మిగిలిపోతుందా? కార్యాచరణలోకి దిగుతారా అనేది కాలమే నిర్ణయించాలి.



Read More
Next Story