![PCC Chief Sharmila | కాంగ్రెస్ లో షర్మిల ఒంటరి అయ్యారా? PCC Chief Sharmila | కాంగ్రెస్ లో షర్మిల ఒంటరి అయ్యారా?](https://telangana.thefederal.com/h-upload/2025/02/08/511440-whatsapp-image-2025-02-08-at-32700-pm.webp)
PCC Chief Sharmila | కాంగ్రెస్ లో షర్మిల ఒంటరి అయ్యారా?
సీనియర్ల మౌనంతో కాంగ్రెస్ మళ్లీ నిస్తేజం ఏర్పడింది. వైసీపీ దెబ్బను ఎలా ఎదుర్కొంటారు? ఒంటరి కాకుండా నిలబడతారా?
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మొదటికి వచ్చింది. ఆ పార్టీలో సీనియర్లు సైలెంట్ అయ్యారు.
"పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏకపక్ష నిర్ణయాలే ఈ పరిస్థితి కారణం" అనేది సీనియర్ల అభియోగం. కూటమి ప్రభుత్వంపై విమర్శలు మీడియాకు మాత్రమే పరిమితం అయ్యాయి. మినహా పార్టీ శ్రేణులను సమీకరించడం, కార్యరంగంలోకి రావడంలో స్తబ్దత ఏర్పడింది. ఇదే అదునుగా వైఎస్ జగన్ తనకు రాజకీయ ప్రత్యర్థిగా మారిన చెల్లెలు షర్మిలపై బాణం సంధించారు. ఆమెను ఏకాకిని చేసే దిశగానే మరోసారి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన జగన్ సీనియర్లకు గాలం వేశారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు సమాయత్తం కావాలనే లక్ష్యంలో ఓట్ల చీలికకు ఆస్కారం లేకుండా వైసీపీ అధ్యక్షుడు జగన్ 2.0 ఫార్ములా ఫలిస్తుందా? లేదా? అనే విషయం పక్కన ఉంచితే, కాంగ్రెస్ పార్టీని మరోసారి దెబ్బకొట్టడానికే అడుగు వేసినట్లు కనిపిస్తోంది.
విభజనతో పాతర.. షర్మిలతో ఊపిరి
2014లో రాష్ట్ర విభజన తరువాత ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఓటర్లు పాతర వేశారు. అంతకుముందే ఊపిరి పోసుకున్న వైఎస్. జగన్ సారధ్యంలోని వైసీపీలో చేరడం వల్ల కాంగ్రెస్ శిబిరం బోసిపోయింది.
2019 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి నామమాత్రపు ఓట్లు కూడా దక్కడం కష్టమైంది. ఈ ఎన్నికలకు ముందే మాజీ మంత్రి వైఎస్. వివేకానందరెడ్డి హత్యోదంతం వైసీపీకి ఓట్ల వర్షం కురిపించినా, ఆ తరువాతి పరిణామాలు వైఎస్ఆర్ కుటుంబంలో కలతలు రావడానికి ఆస్కారం కల్పించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే..
2024 ఎన్నికలకు ఏడాది ముందు నాటకీయ పరిణామాల మధ్య షర్మిల పీసీపీ సారధిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటివరకు కొనఊపిరితో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జవజ్జీవాలు పోశారు. వైఎస్ఆర్ అభిమానులతో పాటు, రాష్ట్రంలో కాంగ్రెస్ వాదులను ఏకం చేయడంలో సపలం అయ్యారని అనిపించుకున్నారు. అప్పటి వరకు సైలెంట్ గా మారిన పార్టీ శ్రేణుల్లో కదలిక వచ్చింది.
వైఎస్ఆర్ విధేయులుగా వ్యవహరించిన సీనియర్లు ఆ సమయంలో మూకుమ్మడిగా కదలారు. అందులో రాయలసీమ నుంచి కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్, డాక్టర్ సాకే శైలజానాథ్, ఎన్. రఘువీరారెడ్డితో పాటు కోస్తా ప్రాంతం నుంచి జేడీ. శీలం, పల్లంరాజు, సీనియర్ నేత జీవీ. హర్షకుమార్, కడప నుంచి ఎన్. తులసీరెడ్డి, మొదటి నుంచి కాంగ్రెస్ లో కొనసాగుతున్న డాక్టర్ కేవీపీ. రామచంద్రరావు వంటి వారందరూ వైఎస్. షర్మిలకు అండగా నిలిచారు.
వైసీపీని వీడి... కాంగ్రెస్ లోకి
ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని సాకుగా చూపి, టికెట్లు ఇవ్వడానికి వైఎస్. జగన్ గత ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడానికి నిరాకరించారు. ఆ కోవలో ఉన్న వారందరూ ఎస్సీ, బీసీ రిజర్వుడు స్థానాలు కావడమే గమనించతగిన విషయం. వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మార్గం ఏర్పడింది. దీంతో ఆ పార్టీకి ఇంకాస్త ఊపిరి పోశారని భావించారు. అయితే, అధికారంలో ఉండగా, సొంతంగా పనిచేసి, ప్రజల మన్ననలు పొందే అవకాశం వారికి లేకపోవడం, వైసీపీలో పెద్దల కనుసన్నల్లోనే పనిచేయాల్సిన పరిస్థితుల్లో వైసీపీలో టిక్కెట్లు దక్కని నేతల పరపతి కూడా పరిమితం అనే విషయం ఎన్నికల ఫలితాలతో తేటతెల్లమైంది. ఇదిలాఉంటే...
2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడం, వారికి బీ.ఫాం ఇవ్వడంలో పీసీసీ చీఫ్ వైఎస్. షర్మిలపై సీనియర్ నేతలు గొంతు విప్పారు. "టికెట్లు విక్రయానికి ఉంచారు" అనే అపవాదును షర్మిల భరించకతప్పని పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఏఐసీసీకి కూడా ఫిర్యాదులు వెళ్లడం గమనార్హం. ఇదే సమయంలో తిరుపతి ఎంపీగా అనేక ధపాలు విజయం సాధించిన కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ కూడా పీసీసీ చీఫ్ షర్మిలపై వచ్చిన ఆరోపణలను సమర్థించారు. దీనిపై విచారణ జరపాలని కూడా ఆయన డిమాండ్ చేయడం గమనించదగిన విషయం.
ఆ తరువాత ఏమైంది?
కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చిందని అందరూ భావించారు. అది పాల పొంగులా మారిందనేది పరిశీలకుల అభిప్రాయం. చివరాఖరికి కడప పార్లమెంట్ నుంచి తమ్ముడు వైఎస్. అవినాష్ పైపీసీసీ చీఫ్ షర్మిల ఎంపీగా పోటీ చేశారు. ఇది కాస్తా అవినాష్ రెడ్డి విజయానికి సోపానంగా మారింది. ఈ సీట్ తో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఓట్ల శాతం కూడా లభించకపోవడం కూడా గమనార్హం. ఇదిలావుంటే.. ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు సాగడం లేదు. నాయకులు ప్రధానంగా పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న షర్మిల మీడియా ద్వారా విమర్శలకు మాత్రమే పరిమితం అయ్యారు. మినహా, ప్రత్యక్ష కార్యక్రమాలు, జిల్లాల పర్యటనలు లేకపోవడంపై ఓ సీనియర్ నేత ఏమంటున్నారంటే..
"ఆమె ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోరు. ఎవరితో మాట్లాడరు. ఒంటెత్తు పోకడలే దెబ్బతీశాయి" అని 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో వ్యాఖ్యానించారు. అందుకే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు సైలంట్ అయ్యారనేది ఆయన మనసులోని మాట.
ఇదే అదునుగా...
అధికారం కోల్పోయిన తరువాత కూడా వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ మాటతీరులో పెద్ద తేడా లేదనే విషయం చాలా సందర్భాల్లో చాటుకున్నారు. "నాయకుడు అంతే జనంలో నుంచి పుడతారు" అది తానే మాత్రమే అనే మాటను చెప్పకనే చెప్పారు. ఓటమి నేర్పని పాఠాలు అనుకున్నారో ఏమో కానీ, వైసీపీలో కార్యకర్తలను, కింది స్థాయి నేతలను సముదాయించే రీతిలో మాటలతో పాటు, మరోసారి కాంగ్రెస్ పై అస్త్రం ప్రయోగించారు. "అక్కడి మిగిలిన నాయకులను కూడా లాక్కోవడం. పార్టీని బలోపేతం చేసుకోవాలి" అనే వ్యూహం అమలుకు శ్రీకారం చుట్టారు. అందుకు ప్రధానంగా..
చెల్లిని ఒంటరి చేయడానికే..?
ఆస్తి గొడవల నేపథ్యంలో అన్నచెల్లెలి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రాష్ట్ర రాజకీయాల్లో చెల్లెలు షర్మిల తనకు పంటికింద రాయిలా మారినట్లు జగన్ భావిస్తున్నట్లు ఉంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు 2.0 ఫార్ములాను ఆయన ప్రకటించారు. అంటే కాంగ్రెస్ లో మిగిలిన నాయకులను తనవైపు తిప్పుకోవడం, భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు కాంగ్రెస్ వల్ల ఓట్లు చీలకుండా చేసుకోవడం, రాజకీయ ప్రత్యర్థిగా మారిన చెల్లెలు షర్మిలను ఒంటరి చేయాలనే ఆలోచనతో తన కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో...
వైసీపీలోకే ఎందుకు?
సాధారణంగా అధికార పార్టీలోకి వెళ్లడానికే ప్రతపక్ష నేతలు కుతూహలం చూపిస్తారు. కానీ, రాష్ట్రంలో అందుకు విరుద్ధమైన పరిస్థితి. కాంగ్రెస్ ను వీడుతున్న నేతలు, రానున్న కాలంలో భవిష్యత్తు ఎలా ఉంటుందనేది తెలియని స్థితిలో వైసీపీలోకి వెళ్లడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది పెద్దగా ఆసక్తిలేని అంశమే అని చెప్పవచ్చు. అధికార టీడీపీలో బెర్తులు ఖాళీ లేకపోవడం, గతంలో అక్కడికి వెళ్లి, టికెట్లు లభించని స్థితిలో మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరిన సీనియర్లు చాలా మంది ఉన్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వైసీపీలోకి వెళ్లడానికే మొగ్గు చూపడానికి కారణంగా భావిస్తున్నారు.
షర్మిల పరిస్థితి ఏమిటి?
ఇంట్లో షర్మిల ఒంటరి అయ్యారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమెకు ఆమె సెల్ఫ్ గోల్ వేసుకున్నారనేది సీనియర్ల మాటగా ఉంది. అంటే, పార్టీలో మొదట అందరినీ సమన్వయం చేసినట్లు, ఇటీవలి కాలంలో లేకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. సీనియర్ల మౌనం, ప్రత్యర్థి పార్టీ నుంచి సవాళ్లు మరో పక్క. సీనియర్ గా ఉన్న మాజీ మంత్రి శైలజానాథ్ పార్టీని వీడడం, కోస్తా ప్రాంతం నుంచి ఒకరిద్దరు వైసీపీకి వెళతారనే ప్రచారం నేపథ్యంలో పీసీసీ చీఫ్ గా షర్మిల వీటన్నింటిని ఎలా ఎదుర్కొంటారనేది చర్చనీయాంశంగా మారింది.
Next Story