పోలవరమే రాయలసీమకు ఎలా దిక్కవుతుంది?
x

పోలవరమే రాయలసీమకు ఎలా దిక్కవుతుంది?

బొజ్జా దశరథరామిరెడ్డి వాదన: రాయల సీమకు నీళ్లిస్తున్న పద్ధతి చూస్తే ‘టక్కరి నక్క- అమాయపు కొంగ’ కథ గుర్తుకు వస్తుంది.రాయలసీమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అభివృద్ధి చెందిన ప్రాంతాలతో సమానాభివృద్ధి, సమగ్రాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ చేపడుతుందన్న విశ్వాసంతో 2024 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి రాయలసీమ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో విజయాన్ని అందించారు.‌ ఈ విజయాన్ని ఆస్వాదిస్తూనే రాయలసీమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన రాయలసీమ భవిష్యత్తుపై ఆశలను చిగురింపజేసింది.

రాయలసీమలో అనేక సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటికి నీటి హక్కులున్నాయి. మిగులు జలాల మీద అనేక ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటికి రాష్ట్ర విభజన చట్టం హక్కులు కల్పించింది. ఈ ప్రాజెక్టుల పేర్లన్నీ వరుసగా రాస్తే చాంతాడంత అవుతుంది. ఈ ప్రాజెక్టుల అన్నింటి ద్వారా సాగు అవుతున్న ఆయకట్టు కృష్ణా, గుంటూరు జిల్లాలోని కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ ఆయకట్లులో 30 శాతం కూడా లేదు. మరి రాయలసీమలో వ్యవసాయ యోగ్యమైన భూమి కృష్ణా, గుంటూరు జిల్లాల కంటే తక్కువగా ఉందా ? లేదే ! రాయలసీమలో వ్యవసాయ యోగ్యమైన భూమి కృష్ణా, గుంటూరు జిల్లాలతో పోలిస్తే 300 శాతంగా ఉంది.

రాయలసీమలో బోలెడన్ని ప్రాజెక్టులు ఉన్నట్లు కనిపిస్తున్నా, వాటి ద్వారా సాగునీరు పొందలేక పోతున్నాయి. ఈ పరిస్థితి ఎలాంటిదంటే మనం చిన్నప్పుడు చదువుకున్న కథలో “ఓ నక్క విశాలమైన చదును అయిన పళ్లెంలో రకరకాల పాయసాలను వడ్డించి, పొడవైన ముక్కున్న కొంగకు విందు భోజనం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి”.‌ తన పొడవైన ముక్కుతో తినడానికి వీలుగా ఉండే పాత్రలో ఆహారం వడ్డించకపోవడంతో కొంగ ఆహారాన్ని ఆరగించలేని విధంగానే, విధానపరమైన నిర్ణయాల అమలు పరచకపోవడం, సాగునీటి హక్కులున్న నీటిని పొందడానికి తగిన సామర్థ్యంతో కావలసిన కాలువలు, రిజర్వాయర్లు, పంటకాలువలు నిర్మించకపోవడం, రాష్ట్ర విభజన చట్టంలోని నీటి హక్కుల సాధనను విస్మరించడం, రాయలసీమ సాగునీటికి ఆయువు పట్టైన చెరువుల పట్ల నిర్లక్ష్యం తదితర అంశాల కారణాలతో హక్కుగా ఉన్న నీటిని కూడా రాయలసీమ పొందలేక పోతున్నది. ఈ సమస్యలకు పరిష్కారం పోలవరం నిర్మాణంతోనో, నిర్మాణం జరిగిన పట్టిసీమ ఎత్తిపోతలతోనో తీరదు.‌

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతోనే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్న భావన నుండి పాలకులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు ఎంత త్వరగా బయటపడి, రాయలసీమ సాగునీటి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధతో ముందుకుపోతేనే రాయలసీమ కోలుకునే అవకాశం ఉంటుంది‌.

ఆ దిశగా పాలకులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు ఆలోచన చేసి, రాయలసీమను అభివృద్ధికి దోహదపడతారని ఆశిస్తున్నా.


Read More
Next Story