జగన్‌ని అసెంబ్లీలోకి లాగి ఉతకాలన్నదే టిడిపి గేమ్ ప్లాన్....
x

జగన్‌ని అసెంబ్లీలోకి లాగి ఉతకాలన్నదే టిడిపి గేమ్ ప్లాన్....

ఇది పసిగట్టే జగన్ వీధి పోరాటానికి సిద్ధమవుతున్నాడు... ప్రెస్ కాన్షరెన్స్ లు, టిడిపి బాధితుల పరామర్శపేరుతో యాత్రలు చేస్తున్నాడు


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పస పోయిందా? చప్పగా సాగుతున్నాయా? అంటే అవుననే చెప్పాలి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో అత్యంత రంజుగా సాగిన ఆంధ్ర రాజకీయాలు ఆ తర్వాత చాలా చప్పగా తయారయ్యాయి. ఎన్నికల ఫలితాలు ఆఖరు ఆ తర్వాత ఆంధ్ర రాజకీయాల్లో అంతగా చెప్పుకోదగ్గ పరిణామం ఏమీ లేదు. అధికార పక్షం చేపడుతున్న పనులు కానీ, విపక్షం చేస్తున్న ఆరోపణలు కానీ ఏవీ కూడా పెద్దగా ప్రజల నోళ్లలో నానిన దాఖలాలు లేవు. ఆఖరికి వైసీపీ పాల్పడిన అవినీతిని బహిర్గతం చేస్తామని టీడీపీ విడుదల చేసిన ఏడు శ్వేత పత్రాలు, పెంచిన ఫించన్లు ఏదీ కూడా నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించలేకపోయింది. మరోవైపు రాష్ట్రంలో రాజకీయ హత్యలు పెరిగిపోయాయంటూ ఢిల్లీలో జగన్ చేసిన నిరసన జాతీయ మీడియాను ఆకర్షించినా జగన్ కోరినట్లు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మాత్రం పట్టించుకోనట్లే వ్యవహరించారు. దీంతో ఏ అజెండాతో జగన్ నిరసన చేశారో అది నెరవేరలేదు.

టీడీపీ పడిన కష్టాలు..

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ చేపట్టిన అతిపెద్ద పని.. వైసీపీని టార్గెట్ చేయడమే. తొలి రోజు నుంచీ కూడా ఏ విషయంపై ప్రశ్నించినా గత ప్రభుత్వం అలా చేసింది అందుకే మేము ఇలా చేయలేకపోతున్నాం అన్న సమాధానమే వినిపిస్తోంది. నేషనల్ స్థాయిలో ఏపీ పేరు వినిపించేలా చేయడానికి టీడీపీ ప్రభుత్వం పడిన ప్రయాసల్లో శ్వేతపత్రాలు మరి ప్రధానంగా కనిపిస్తాయి. అధికారంలోకి వచ్చిన రెండు నెలల కాలంలోనే ఏడు శ్వేతపత్రాలను విడుదల చేశారు. పోలవరం, అమరావతి, విద్యుత్, ఆర్థిక శాఖ, సహజవనరుల దోపిడీ వంటి వాటిపై శ్వేపత్రాలు విడుదల చేశారు. వైసీపీ దోపిడీకి పాల్పడిందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని స్వయంగా సీఎం చంద్రబాబే చెప్పారు. అన్ని శాఖల వారితో సమీక్షలు, వ్యవస్థలను గాడిలో పెట్టడానికి తీసుకుంటున్న కీలక నిర్ణయాలు, అధికారులకు ఇస్తున్న సూచనలు ఇలా ఏ ఒక్కటి కూడా ఏపీని జాతీయ స్థాయి వార్తల్లో నిలుపలేక పోయింది. అందుకే ఇప్పుడు జగన్‌ను అసెంబ్లీకి రావాలని టీడీపీ క్యాడర్ ఆహ్వానిస్తుందని టాక్ నడుస్తోంది.

టీడీపీ ప్లాన్ ఇదేనా..

ఎక్కడకు వెళ్లినా వైసీపీ, జగన్‌పై విమర్శలే తప్ప తాము చేస్తున్నదేంటో చెప్పుకోలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందనడంలో సందేహం లేదు. ఆఖరికి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కూడా గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిదంటూనే సీఎం ప్రసంగించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు గురించి అడిగా వైసీపీ అక్రమ పాలన అన్న సమాధానమే వినిపిస్తుంది. ఇలా తాము చేసిన ప్రతి ప్రయత్నం నీళ్లపాలు కావడంతో ఆఖరుగా జగన్‌ను అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తుంది. జగన్‌ అసెంబ్లీకి వచ్చేలా చేసి సభాముఖంగా వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై నిలదీయాలని, అప్పుడు జగన్ ఇచ్చే సమాధానాలకు అధికారంలో ఉన్న 164 మంది ముక్తకంఠంతో సమాధానాలు చెప్పడం, ఆ కోపంలో జగన్ ఏదో ఒకటి అనడం, దాంతో జగన్‌ను స్పీకర్ సస్పెండ్ చేయడమో జరగాలని, తద్వారా తాము కోరుకున్నట్లే జాతీయ మీడియాలో ఏపీని తలుక్కుమనిపించాలని టీడీపీ ప్లాన్ చేస్తున్నట్లు అనుమానంగా ఉంది.

జగన్ అందుకే వెళ్లట్లేదా..

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి చేస్తున్న ఈ ప్లానింగ్ అర్థమయ్యే జగన్ కూడా అసెంబ్లీ అంటే ఆమడ దూరంలో ఉంటున్నట్లు పరిస్థితులు చెప్పకనే చెప్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అన్నప్పుడే.. రాష్ట్రంలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయని, కక్ష పూరితంగానే టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడి హత్యలు చేస్తున్నారంటూ జగన్ ఢిల్లీలో నిరసన చేపట్టారు. ఫొటో, వీడియో గ్యాలరీ పెట్టి మరీ రెండు రోజుల పాటు నిరసనల తెలిపారు. ఆ తర్వాత ఆంధ్రకు తిరిగి వచ్చినా.. అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడకుండా.. దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించడమే పరమావధిగా తిరిగారు. ఏమైనా.. జగన్‌ను అసెంబ్లీకి వచ్చేలా చేయాలన్న కూటమి నేతల ప్రయత్నాలు మాత్రం తగ్గడం లేదు.

రారామంటున్న స్పీకర్

తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ జగన్ రాసిన లేఖను తప్పుబట్టి అది బెదిరిస్తున్న ధోరణిలో ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఇటీవల తన స్వరం మార్చారు. జగన్ అసెంబ్లీకి వచ్చి పులివెందుల ప్రజల సమస్యలపై చర్చించాలని, వారికి న్యాయం చేయాలని కోరారు. ‘‘పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలి. అందుకు ఒక్కసారి అసెంబ్లీకి వస్తే మాట్లాడటానికి జగన్‌కు నేను అవకాశం కల్పిస్తా. నేను అవకాశం ఇవ్వనని జగన్ ఎందుకు అనుకుంటున్నారు. అన్ని పార్టీల నేతలకు ఇచ్చిన విధంగానే జగన్‌కు కూడా మాట్లాడటానికి అవకాశం ఇస్తాను. సభలో మాట్లాడటానికి ప్రతి ఒక్కరికీ అవకాశం ఇస్తా. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అడిగినా మైక్ ఇస్తాం. వైసీపీకి వచ్చిన సీట్లకు అనుగుణంగా సమయం కేటాయిస్తాం. అదే విధంగా అసెంబ్లీకి వస్తే జగన్‌కు కూడా మాట్లాడే స్వేచ్ఛను ఇస్తా’’ అని చెప్పారు.

పదేళ్లయినా ప్రతిపక్ష హోదా రాదు: పయ్యావుల

ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా జగన్ అసెంబ్లీకి వచ్చి పులివెందుల సమస్యలపై మాట్లాడాలని కోరారు. ‘‘జగన్‌కు ప్రతిపక్ష హోదా రావాలంటే మరో పదేళ్లయినా పడుతుంది. జగన్‌కు ప్రజలు ఓటేసి 11 స్థానాల్లో గెలిపించారు. అంటే దానర్థం ఢిల్లీ వెళ్లి ధర్నా చేయమని కాదు. అసెంబ్లీకి వచ్చి ప్రజల కష్టాలపై చర్చించమని. కానీ అది మానుకుని సింగిల్ కెమెరాతో ప్రెస్‌మీట్లు పెట్టమని కాదు. అభిమానించినా, అవమానించినా నిలదొక్కుకుని నిలబడిన వాళ్లే రాజకీయాల్లో ఉండగలరని జగన్ గ్రహించాలి. అధికారం పోగానే అసెంబ్లీకి కూడా రాకుండా ఎటెటో తిరిగితే ఎలా. ఇలాగే ప్రవర్తిస్తే ఉన్న 11 స్థానాలు కూడా 1 సీటుకు వచ్చే అవకాశం ఉందని జగన్ గ్రహించాలి’’ అని సూచించారు పయ్యావుల.

నాగబాబు కూడా..

ఆఖరిని కూటమి నేతలే కాకుండా ఏ పదవిలో లేని జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు కూడా జగన్ అసెంబ్లీకి రావాలని కోరుతున్నారు. ఆయనను ఏమీ అనొద్దని తాను కూటమి నేతలను రిక్వెస్ట్ చేస్తానని, కాబట్టి జగన్ భయపడకుండా సభకు హాజరుకావాలంటూ సోషల్ మీడయాలో పోస్ట్ పెట్టారు. అదే విధంగా షర్మిల కూడా.. జగన్ అసెంబ్లీకి వెళ్లాలని, పులివెందుల ప్రజల సమస్యలను వివరించాలని కోరారు.

జగన్ అసెంబ్లీకి రావాలా వద్దా అన్న విషయంలో కూటమి నేతల మంకుపట్టు పట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్లు సెటైర్లు వేశారని, సభలోనే అవమానకరంగా మాట్లాడారన్న వాటికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని కూటమి ప్లాన్ చేస్తోందా.. లేదంటే ఇంకా పెద్దగానే ఏమైనా ఆలోచిస్తుందా అని చర్చ జరుగుతోంది.

Read More
Next Story