JALA HARATI | రాయలసీమకి నిజంగానే గోదావరి నీళ్లొస్తాయా!
x
తెలుగుతల్లికి జలహారతి మ్యాప్ ను పరిశీలిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

JALA HARATI | రాయలసీమకి నిజంగానే గోదావరి నీళ్లొస్తాయా!

చంద్రబాబు కల ఫలిస్తుందా? తెలుగుతల్లికి జలహారతి పట్టే పోలవరం పూర్తి అవుతుందా? రాయలసీమ నీటి కరవు తీరుతుందా!.. ఇలా సవాలక్ష ప్రశ్నలెన్నో?


ఇంతటి ఆధునిక కాలంలోనూ రాయలసీమ జిల్లాలు నీటి కోసం అల్లాడుతూనే ఉన్నాయి. గుక్కెడు నీటి కోసం గుండెగ నెత్తిన పెట్టుకుని మూడు, నాలుగు కోసులు నడుస్తున్న దృశ్యాలనేకం మనకు కనిపిస్తాయి. వేసవి వస్తే తాగు నీటి కళ్లల్లో వత్తులేసుకుని చలాల చుట్టూ తిరిగే చిత్రాలనేకం. అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాయుడు గోదావరి-కృష్ణ నదుల అనుసంధానం, తెలుగు తల్లికి జల హారతి (Telugu Thalli ki JALA HARATI) అంటూ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించారు. ఈ నదుల అనుసంధానానికి ₹80,112 కోట్లు ఖర్చవుతుందన్నారు. రాయలసీమకు నీటి అవసరాలను తీర్చడమే లక్ష్యమని చెప్పారు.

రాయలసీమ వాసులు తమకు జరిగిన ప్రత్యేకించి నీటి ప్రాజెక్టుల్లో అన్యాయంపై కొన్ని దశాబ్దాలుగా గొంతెత్తుతూనే ఉన్నారు. సరిగ్గా ఈనేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ నిజంగా ఆచరణలోకి వస్తే రాయలసీమకు అంతకన్నా మేలుండదు. అయితే, ఈ జలహారతి కూడా పోలవరం ప్రాజెక్టుతో ముడిపడి ఉంది. దశాబ్దాలుగా సాగుతున్న ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేదెప్పుడు, దాని ఆధారంగా నీళ్లను రాయలసీమకు తరలించేదెప్పుడన్నదే ప్రస్తుతం రాయలసీమ నీటి ప్రాజెక్టుల సాధన సమితీని, ఇతర జలరంగ నిపుణులను వేధిస్తోంది. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టని, దాని పూర్తికి తాము పూచి పడ్డామని, 100% ఆర్థిక సాయం చేస్తామని కేంద్రం ప్రకటించినా ప్రాజెక్టు ఒక అడుగు ముందుకీ రెండడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. గడువుల మీద గడువులు విధించుకుంటూ, ఖర్చును పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికి నలుగురు ముఖ్యమంత్రులు మారినా ఇంతవరకు గట్టెక్కలేదు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాయలసీమకు సాగునీరు అందించే నూతన ప్రాజెక్టు అంటూ సరికొత్త పథకాన్ని ప్రకటించారు. గోదావరి నది నీటిని కృష్ణా బేసిన్‌కు తీసుకెళ్లే పథకం అంటున్నారు.
అసలింతకీ ఏమిటీ ప్రాజెక్ట్...
ఈ పథకం పేరు తెలుగుతల్లికి జలహారతి. విలువ ₹80,112 కోట్లు. 80 లక్షల మందికి తాగునీరు, రాయలసీమలో కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లో 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యం. దక్షిణ కోస్తా ఆంధ్రలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కూడా ఈ ప్రాజెక్టు ప్రయోజనకరంగా ఉంటుందని చంద్రబాబు చెబుతున్నారు.
ప్రాజెక్టు సవివర ప్రణాళిక (DPR) మూడు నెలల్లో సిద్ధం అవుతుందని, వెంటనే టెండర్లు పిలుస్తామని, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఇప్పటికే మూడు సార్లు చర్చలు జరిపామని, డబ్బుకు ఏ కొరతా ఉండదన్న నమ్మకంతో చంద్రబాబు ఉన్నారు.
గోదావరి నీళ్లు సీమకు ఎలా వస్తాయంటే...
గోదావరి జలాలను పోలవరం డ్యాం నుంచి బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌ వరకు తరలిస్తారు. ఇతర రాష్ట్రాలతో లింకు ఉండదు. నదుల అనుసంధానం అని కాకుండా రాష్ట్ర అంతర్గత అనుసంధానం ప్రాజెక్టుగా చేపడతామని చంద్రబాబు చెప్పారు. నదుల అనుసంధానం అంటే పొరుగు రాష్ట్రాల అనుమతులు కావాలి. అంతర్గత అనుసంధానానికి ఆ అవసరం లేదు. అందుబాటులో ఉన్న మిగులు జలాలను రాయలసీమకు మళ్లించడం వరకే ఇది పరిమితం. ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌)ను త్వరలో పంపనున్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న ప్రపంచ బ్యాంకు మిగులు నిధులను ఈ ప్రాజెక్టుకు ఇమ్మని చంద్రబాబు కోరుతున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమో చూడాల్సి ఉంది. ప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం ఏ ప్రాజెక్టుకు ఇచ్చిన నిధుల్ని దానికే వినియోగించాల్సి ఉంటుందని వరల్డ్ బ్యాంక్ లావాదేవీలపై అవగాహన ఉన్న సీనియర్ లాయర్ మల్లెల శేషగిరిరావు చెప్పారు.
వివిధ ప్రాజెక్టుల కోసం కేంద్రం ప్రపంచ బ్యాంకు నుంచి సమీకరించిన నిధుల్లో ఖర్చు కాకుండా మిగిలిపోయిన మొత్తం 51,364 కోట్ల రూపాయల వరకూ ఉన్నట్టు సమాచారం. ఏదైనా ప్రాజెక్టు కోసం సేకరించిన రుణంలో ఖర్చుకాకుండా మిగిలే నిధులను మరో ప్రాజెక్టుకు వినియోగించుకోవడానికి ఉన్న చిక్కులేమిటనేది పరిశీలించాల్సి ఉంది.
ఈ పద్దు కింద ఉన్న నిధులను గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు కోసం సంపాయించాలన్నది చంద్రబాబు యోచన. ఈ ప్రాజెక్టు రాష్ట్ర స్వరూపాన్ని మారుస్తుందని చంద్రబాబు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.40 వేల కోట్ల వరకూ కేటాయించడానికి కేంద్రం సుముఖంగా ఉన్నట్టు కూడా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి టీడీపీ కూటమి గట్టి మద్దతుదారుగా ఉంది. టీడీపీ సంఖ్యాబలంతోనే మోదీ ప్రభుత్వ అస్థిత్వం ఆధారపడి ఉందన్న వాదన నేపథ్యంలో చంద్రబాబు అడిగింది కేంద్ర ప్రభుత్వం కాదనకపోవచ్చునన్నది తెలుగుదేశం వర్గాల భావన. కేంద్రం నుంచి కొంత సానుకూలత వ్యక్తమైన తర్వాతే ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు వివరాలను బయటపెట్టారని కూడా చెబుతున్నారు.
మిగతా 40వేల కోట్లు ఎక్కడి నుంచి..
కేంద్రం రూ.40 వేల కోట్లు ఇస్తే మిగిలిన రూ.40 వేల కోట్లు- ప్రాజెక్టుల పనులు చేపట్టే భారీ కాంట్రాక్టు సంస్థల నుంచి- సేకరించి వాటికి పాతికేళ్లపాటు ఏటా కొంత మొత్తం చెల్లించే మోడల్ ను అమలు చేయాలన్నది చంద్రబాబు మదిలో మాటగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య వ్యవహారాలలో చంద్రబాబు అనుభవాన్ని కొట్టిపారవేయలేం.
నీటిని ఎలా తరలిస్తారంటే...
జలహారతి ప్రాజెక్టు తొలిదశలో పోలవరం కుడి కాలువ నుంచి గోదావరి జలాలను విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజీలోకి తరలిస్తారు. అక్కడి నుంచి నాగార్జునసాగర్‌ కుడికాలువకు తీసుకెళ్లి కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయరును నింపాలని తొలుత అనుకున్నారు. అయితే ఇప్పుడు అధికారులు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు. బ్యారేజీలోకి కాకుండా మరో మార్గం ద్వారా నీటిని తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి 60 కిలోమీటర్ల ఎగువన నాగార్జునసాగర్‌ కుడి ప్రధాన కాలువ ఉంది. అందులోకి గోదావరి జలాలను తీసుకెళ్లాలి. ఇప్పుడు సాగర్‌ కాలువ ప్రవాహ సామర్థ్యం పది వేల క్యూసెక్కులు మాత్రమే ఉంది. దీనిని 30 వేల క్యూసెక్కులకు విస్తరించాలని తాజాగా భావిస్తున్నారు. గోదావరి జలాలు కలిసే చోటు నుంచి కాలువను వెడల్పు చేయాలనేది యోచన.
మొదటి దశలో, పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా రోజుకు 2 టిఎంసి నీటిని కృష్ణా నదికి మళ్లిస్తారు. దీని ఖర్చు ₹13,511 కోట్లు.
రెండవ దశలో, పల్నాడు జిల్లాలో బొల్లపల్లి వద్ద ₹28,560 కోట్ల వ్యయంతో ఒక రిజర్వాయర్ నిర్మిస్తారు.
మూడవ దశలో, బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి కర్నూలు జిల్లా బనకచర్ల వరకు ₹38,041 కోట్ల వ్యయంతో నీటిని తీసుకెళతారు.
సాధ్యమయ్యే పనేనా...
ఈ ప్రాజెక్టులో ప్రధాన సవాలు నల్లమల అడవుల కిందుగా 27 కిలోమీటర్ల భూగర్భ సొరంగం తొవ్వాలి. ఈ సొరంగం పూర్తిగా భూగర్భంలో ఉండేలా చూడాలి. అటవీ ప్రాంతం కనుక నిబంధనలు అతిక్రమించకూడదు.
పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 17,800 క్యూసెక్కుల నుంచి 28,000 క్యూసెక్కులకు పెంచాలి. తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాలువలను మరో 108 కిలోమీటర్ల వరకు పొడిగించి, 10,000 క్యూసెక్కుల సామర్థ్యం కల్పించాలి.
ప్రాజెక్టు అమలుకు 48,000 ఎకరాల భూమి సేకరించాలి. ప్రైవేటు కంపెనీల సహకారంతో హైబ్రిడ్ మోడల్ ద్వారా నిధులను సమీకరిస్తారు. రాజస్థాన్‌లో అమలైన మోడల్‌ను అనుసరించి చెల్లింపుల విధానాన్ని చేపట్టవచ్చని నాయుడు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలు...
ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం శ్రద్ధగా గమనిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శికి అభ్యంతరాలు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు వివరణాత్మక నివేదిక (DPR) ఇంకా సమర్పించకపోవడం, కేంద్రం నుండి అనుమతులు లేని అంశాలపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గోదావరి నది యాజమాన్య బోర్డుకు ఈ అంశాన్ని తీసుకెళ్లాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
గోదావరి నది వరద నీటిని ఇతర రాష్ట్రాలకు నష్టం లేకుండా మళ్లించేలా ఈ ప్రాజెక్ట్ ప్రణాళికలు ఉన్నాయి. కేంద్రంలో ఎన్‌డిఎ అధికారంలో ఉండటం వల్ల అనుమతులు చకచకా వస్తాయని అధికారులు భావిస్తున్నారు.
దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయని, పైగా ఇదేమీ కొత్త ప్రాజెక్ట్ కాదని, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన జలయజ్ఞంలో కూడా ఈ స్కీం ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరమే ఇంకా పూర్తి కాకపోతే ఈ జలహారతి ఎప్పటికి సాధ్యపడేను? అని ప్రశ్నించారు ప్రసాద్.
Read More
Next Story