ఆ దేవుడి స్క్రిప్ట్ ఇలా ఉందా..?  జగన్ వ్యూహం ఏమిటి?
x

ఆ దేవుడి స్క్రిప్ట్ ఇలా ఉందా..? జగన్ వ్యూహం ఏమిటి?

అసెంబ్లీ సమావేశాలు 11 నుంచి ప్రారంభమవుతాయి. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వెళతారా? లేదా? అనేదే చర్చ.


ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారు, సభ ప్రారంభమయ్యే సమయం "దేవుడు స్క్రిప్ట్" మాట గుర్తుకు తెప్పించడమే కాదు. వైసీపీకి చురుక్కుమనిపించేలా ఉందంటున్నారు. ఈసారి అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా? లేదా?? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు అంశాలపై మాట్లాడేందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.

2024 ఎన్నికల్లో "175కు అన్ని సీట్లు గెలుస్తాం" అని మాజీ సీఎం వైఎస్ జగన్ తో పాటు ఆ పార్టీ నాయకులు మితిమీరిన విశ్వాసాన్ని ప్రదర్శించారు. కాలం గడిచే కొద్దీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అర్థం చేసుకున్న పార్టీ శ్రేణులు 151 గెలవడం తధ్యమని ఢంకా బజాయించి చెప్పారు. ఎన్నికల ఫలితాలతో వైసీపీ ఆశించిన సంఖ్య మధ్య నుంచి "5" ఎగిరిపోయింది. అధికారంలో ఉండి ఎన్నికలు ఎదుర్కొన్న వైసీపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తో సహా 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. ఇలా ఉంటే..
ఆ సంఖ్యే ట్రోల్..
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోషల్ మీడియాలో 11, 11, 11 ఈ అంకెలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అందుకు ప్రధాన కారణం..
శాసనసభ సమావేశాలు ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించాలని షెడ్యూల్ ఖరారు చేశారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఈ సభకు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా? లేదా?? అనే విషయాన్ని చర్చించుకుంటున్నారు. దీంతో 11 అంకె వైరల్ అవుతోంది.
"దేవుడి స్క్రిప్ట్" పదం ప్రాచుర్యం
2014 లో రాష్ట్ర విభజన తర్వాత 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన మొదటి ఎన్నికల్లో వైసీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. వైసీపీకి 67 అసెంబ్లీ సీట్లు వస్తే, టీడీపీ, బీజేపీ కూటమికి 102 స్థానాలు దక్కాయి. అందులో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇతరులు గెలిచారు. జనసేన ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత వచ్చే చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. కాగా,
2019 ఎన్నికల్లో వైసీపీ 151 కైవసం చేసుకొని, వైఎస్. జగన్ సీఎం అయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. జనసేన అభ్యర్థి ఒకచోట గెలిచారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, అసెంబ్లీలో "చంద్రబాబును మాటలతో ర్యాగింగ్" చేశారు.
"వైసీపీ నుంచి గెలుపొందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుక్కున్నారు. ఇప్పుడేమైంది ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు దక్కాయి. దేవుడు స్క్రిప్ట్ అలా రాశారు" అని మాజీ సీఎం వైఎస్. జగన్ హేళన చేస్తే, మాజీ మంత్రి కొడాలి నాని సభలో "ఎన్. చంద్రబాబును పరుష పదజాలంతో తూలనాడిన విషయం" తెలిసిందే. ఈ పరిస్థితుల్లో..
11వ తేదీ 11 మంది..
వైసీపీ నుంచి ఎన్నికైన 11 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం రోజు మాత్రమే సభకు హాజరయ్యారు. ఆ తర్వాత విపక్ష నేత హోదా కూడా కోల్పోయిన పులివెందుల ఎమ్మెల్యే, మాజీ సీఎం వైఎస్. జగన్ సహా మిగతా ఎమ్మెల్యేలు సభలో కనిపించలేదు. వారి లేని సమయంలో కూడా.. ఎమ్మెల్యే రఘురామ కృష్ణమరాజు తోపాటు కొందరు "వైఎస్. జగన్ పై తీవ్రస్థాయిలోనే సెటైర్లు" వేశారు. "మిమ్మల్ని (స్పీకర్ అయ్యన్నపాత్రుడు) సీట్లో చూడగానే జగన్ కు మాటలు కూడా సరిగా రాక తడబడ్డాడు అధ్యక్ష. "బె బెబ్బె, పెప్పెప్ప అంటూ తన పేరు (జగన్) కూడా సరిగా పలకలేకపోయారు" అని గోదారి ఎటకారం మాటలతో రఘురామకృష్ణంరాజు హాస్యం ఆడారు. కాగా, 11వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి ముందే, స్పీకర్ అయ్యన్నపాత్రుడు మీడియా ముఖంగా ఆహ్వానం పలికారు. " జగన్ అసెంబ్లీకి రావయ్యా. మాట్లాడుకుందాం" అని పిలవడం గమనార్హం.
సభకు వెళతారా?
నాలుగు నెలల తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో జరిగిన సంఘటనలపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. గుంటూరు, బద్వేలు, కర్నూలు జిల్లాలో హత్యలు, లైంగిక దాడితో మరణించిన వారి కుటుంబాలను జగన్ పరామర్శించారు. "రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి" అనే ఘాటుగా స్పందించారు. "రాష్ట్రంలో మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది" అపి కూడా జగన్ విరుచుకుపడుతున్నారు. పాత కేసులను కూడా తిరగదోడడంతో పాటు అక్రమ కేసులు బనాయిస్తున్నారని జగన్ మండిపడుతున్నారు.
శ్వేతపత్రాలతో ఇరకాటం
వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన వ్యవహారాలపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసింది. సహజ వనరుల దోపిడీ, నిధుల వినియోగంలో జరిగిన అవినీతి ఆరోపణలు కూడా చేయడంతో పాటు విచారణ కూడా ఆదేశించింది. కాగా, వైసీపీకి వారి సొంతమీడియాలో మాత్రమే ప్రచారం లభించింది. మినహా మిగతా పత్రికలు, మీడియా అంతంతమాత్రంగానే ప్రాధాన్యత ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో
వ్యూహం ఏమిటి?
బడ్జెట్ సమావేశాలకు వైసీపీ వ్యూహం ఏమిటి? శాసనసభను వేదికగా చేసుకొని ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిగ్గదీయడంతోపాటు, తమపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలు వివరించడానికి ఎందుకు ఆలోచించడం లేదని విషయంపై చర్చ జరుగుతోంది. "అసెంబ్లీకి వెళితే టీడీపీ కూటమిలోని పార్టీలతో ర్యాగింగ్ కు గురికావాల్సి వస్తుందేమో" అనే భావనలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. దీనిపై వైసీపీ నేత ఒకరు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ,
అజెండా అదేనంట
ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు నెలల కాలంలో జరిగిన సంఘటలతో శాంతిభద్రతలు సమస్య ఏర్పడిండనే విషయంలో ఆ పార్టీ శ్రేణులు నినదిస్తున్నాయి. దీనితో పాటు, ఉచిత ఇసుక విధానం పేరుకు మాత్రమే. ఈభారం సామాన్యులు భరించలేకున్నారు. ఈ రెండు అంశాలపై నిగ్గదీయడానికి 11 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉందని ఓ నేత అంటున్నారు.
Read More
Next Story