వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ తప్పదా?
x
Midhun Reddy, YCP MP

వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ తప్పదా?

వైసీపీ హయాంలో జరిగిన మద్యం వ్యాపారంలో అవకతవకలు జరిగాయనే కేసులో మిధున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.


చెట్టును కొట్టేయాలనుకున్నప్పుడు ముందు కొమ్మల్ని చెలగడం మామూలు వ్యవహారం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలూ అలాగే సాగుతున్నాయి. వైసీపీ మూలస్తంభంగా ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని చక్రబంధంలోకి లాగడానికి ముందు ఆయన కుమారుడు, రాజంపేట పార్లమెంటు సభ్యుడు పి.వి. మిధున్ రెడ్డిని ముగ్గులోకి దింపే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న 2019-2024 మధ్య మద్యం వ్యాపారంలో అవకతవకలు జరిగాయనే కేసులో మిధున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏపీ సీఐడీ పోలీసులు ఢిల్లీకి చేరడమే ఇందుకు అనుమానాలకు తావిస్తోంది. వైసీపీ విడుదల చేసిన ప్రకటన కూడా ఈ అనుమానాలను బలపరుస్తోంది.
మరోపక్క ఏపీ సి.ఐ.డి నమోదు చేసిన మద్యం కుంభకోణం కేసులో రక్షణ కోరుతూ మిధున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
A.P. స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ పర్యవేక్షణలో జరిగిన మద్యం వ్యాపారంలో భారీ అవకతవకలు జరిగాయంటూ ఏపీ CID కేసు నమోదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన తర్వాత మిధున్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
మిధున్ రెడ్డిని నిందితునిగా లిస్ట్ చేయలేదు. అయినా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు ఏప్రిల్ 5 వరకు ఆయన్ను అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది. 4వ తేదీతో పార్లమెంటు సమావేశాలు ముగిశాయి. 5వ తేదీ వరకు గడువు ఉంది. అది ముగుస్తున్న తరుణంలో ఏపీ సీఐడీ పోలీసులు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో మిధున్ రెడ్డిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయవచ్చునని భావిస్తున్నారు.
సుప్రీంకోర్టులో వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఏప్రిల్ 7న విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈలోపే ఆయన్ను అదుపులోకి తీసుకోవాలన్నది సీఐడీ పోలీసుల వ్యూహం ఉంది.
వైసీపీ విడదల చేసిన ప్రకటన ప్రకారం మిధున్ రెడ్డి ఈ కేసులో నిందితుడు కాదు. అయినప్పటికీ ఆయన్ను పోలీసులు వెంటాడుతున్నారని ఆరోపించింది. ఏప్రిల్ 3న హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. సి.ఐ.డి బృందాలు ఆయనను అరెస్టు చేయడానికి ఢిల్లీకి చేరుకున్నాయి.
సి.ఐ.డి అధికారులు కొందరు వ్యక్తుల్ని బెదిరించి తప్పుడు ప్రకటనలు ఇప్పించి మిధున్ రెడ్డి పేరు చెప్పించారన్నది వైసీపీ ఆరోపణ. ప్రస్తుతం ఆయన ఎంపీ హోదాలో ఉన్నారు. ఆయన్ను అరెస్ట్ చేయాలంటే స్పీకర్ అనుమతి అవసరమని భావిస్తున్నారు. ఈ కుంభకోణంలో మిధున్ రెడ్డి ప్రధాన కుట్రదారుగా సీఐడీ అనుమానిస్తోంది. వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టు అంచనా వేస్తోంది. ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణానికి మించిన వ్యవహారంగా టీడీపీ ఆరోపిస్తోంది.
ఈనేపథ్యంలో ఢిల్లీకి సీఐడీ పోలీసులు రావడం అనుమానాలకు తావిస్తోంది. మిధున్ రెడ్డి నివాసం చుట్టుపక్కల పోలీసులు సివిల్ డ్రెస్ లో కాపలా కాస్తున్నారు. ఆయన కదలికపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది.
Read More
Next Story