ఉద్యోగుల ఓటు ఏ పార్టీకి. ఏ ఉద్యోగిని కదిలించినా మా ఓటు జగన్‌కు వ్యతిరేకమేనంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది.


ఉద్యోగుల ఓటు వన్‌సైడేనా..రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌పై చర్చ జరుగుతోంది. నేటితో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ పూర్తవుతుంది. ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ను పెట్టడం ఎప్పటి నుంచో జరుగుతోంది. అయితే ఈవీఎంల సిస్టం వచ్చిన తరువాత కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ను నిర్వహించడం ఏమిటనే ప్రశ్న పలువురిలో ఉంది.

జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కేంద్రాలు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో ఉద్యోగులు ఓటు వేస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ శనివారం మొదలైంది. పోస్టల్‌ బ్యాలెట్ల ముద్రణ విషయంలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం, ప్రకాశం జిల్లా మార్కాపురం, ఒంగోలు కేంద్రాల వద్ద శనివారం మధ్యాహ్నం వరకు పోలింగ్‌ ప్రారంభం కాలేదు. బ్యాలెట్‌ పేపర్లు ఆలస్యంగా ఓటింగ్‌ కేంద్రాలకు వచ్చాయి. ఆ తరువాత ఓటు వేసి ఉద్యోగులు వెళ్లారు. అప్పటి వరకు వెయిట్‌ చేయలేని వారు ఆదివారం వచ్చి ఓటు వేశారు. సోమవారంతో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ పూర్తవుతుంది. బ్యాలెట్ల స్థానంలో ఈవీఎంలు పెడితే బాగుండేదని పలువురు ఉద్యోగులు అన్నారు. చాలా మంది ఉద్యోగులకు మే 2వ తేదీన ఎన్నికల విధుల ఆదేశాలు అందాయి. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు ఇచ్చే ఫారం 12ను మే 1లోపు పూర్తి చేసి ఇవ్వాలని, వారికే ఓటు వేసే అవకాశం ఉంటుందన్నారు. మరి రెండో తేదీన ఆదేశాలు అందుకున్న వారి పరిస్థితి ఏమిటని ఉద్యోగ సంఘాల నాయకులు ఈసీ దృష్టికి తీసుకుపోగా నేరుగా ఫారం నెం: 12ను ఓటువేసే ఫెసిలిటేషన్‌ సెంటర్‌లోనే అందించి ఓటు వేయవచ్చని ఆదివారం ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు కోల్పోయిన వారంతా ఓటు వేసేందుకు అవకాశం తీసుకున్నారు.
రాష్ట్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకుంటున్న ఉద్యోగులు సుమారు 3.30 లక్షల మంది ఉన్నారు. వీరందరూ ఎన్నికల విధుల్లో ఉన్నవారు. అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి ఉద్యోగులు ఎన్నికల విధులకు హజరవుతున్నారు. గతంలో పోస్టల్‌ బ్యాలెట్‌లను పోస్టు ద్వారా ఎన్నికల అధికారులకు పంపించే వారు. ఇప్పుడు అలా కాకుండా నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడే ఓటు వేసి వచ్చేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది.
ఉద్యోగులు ఏ పార్టీకి ఎక్కువగా ఓట్లు వేసే అవకాశం ఉందనే దానిపై చర్చ మొదలైంది. నేటితో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ పూర్తవుతున్నందున వీరి ఓట్లు ఎవరివైపు ఉండే అవకాశం ఉందనేదానిపై కూడా చర్చ జరుగుతోంది. ఉద్యోగుల్లో సగం మంది ఉద్యోగులు ఎన్నికల విధులకు హాజరవుతున్నారు. వీరు పోలింగ్‌ కేంద్రాల వద్దకు రాగానే పార్టీల ముఖ్య నాయకులు బయట వారిని కలుస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటే ఎక్కువగా ఉన్నట్లు ఉద్యోగ వర్గాల నుంచి వస్తున్న మాట. చాలా చోట్ల ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడితే ఈ ప్రభుత్వంలో ఉద్యోగులకు అన్యాయం ఎక్కువ జరిగిందే తప్ప సానుకూలత కూడా కనిపించలేదని అంటున్నారు. పిఆర్‌సీ అమలు దగ్గర నుంచి మా కోసం మేము దాచుకున్న డబ్బలు తీసుకోడానికి కూడా నానా తంటాలు పడాల్సిన పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఏర్పడ్డాయని వారు చెబుతున్నారు. రిటైర్డ్‌మెంట్‌కు దగ్గరగా ఉన్న వారు మాట్లాడుతూ తమ సర్వీసులో ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం జగన్‌ ప్రభుత్వమేనని వ్యాఖ్యానించడం విశేషం. తమ పేర్లు వెల్లడించేందుకు వారు అంగీకరించలేదు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నందున తమ పేర్లు చెప్పడం బాగుండదని వారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 5.6 లక్షల మంది రెగ్యులర్‌ ఉద్యోగులు ఉన్నారు. వీరితో పాటు ఈ ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటైన వ్యవస్థ (వార్డు, గ్రామ సచివాలయాలు) ద్వారా నియమితులైన ఉద్యోగులు 1.3లక్షల మంది ఉన్నారు. మరో 2లక్షల మంది కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారు. వీరితో పాటు పలు కార్పొరేషన్‌లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సుమారు 60 వేల మంది ఉన్నారు. ఒక కుటుంబంలో భార్యా భర్తల ఓట్లు లెక్కించినా సుమారు 16 లక్షల ఓట్లు ఉద్యోగుల వైపు నుంచి ఉన్నాయి. వీరి ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయని, సుమారు 80శాతం ఉద్యోగ ఓటర్లు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Next Story