ఇదేం‘బుద్ది’బాబు ?
సీనియర్ నేత మండలి బుద్దప్రసాద్‌కు చంద్రబాబుకు గ్యాప్ పెరిగిందా. ఎందుకు ప్రేయారిటీ కల్పించడం లేదు. ఈక్వేషన్స్ ఏమైనా మారాయా.

Mandali Budda Prasad
జి. విజయ కుమార్
ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే సీనియర్ రాజకీయ నాయకుడిగా మంచి ట్రాక్ రికార్డు కలిగిన మండలి బుద్దప్రసాద్‌కు ఈ సారి ఎన్నికల్లో చంద్రబాబు సీటు ఇవ్వక పోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో ఆకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పేరు ప్రస్తావించకుండా ఉమ్మడి కృష్ణ జిల్లా, అవనిగడ్డ రాజకీయాల గురించి చర్చించ లేరు. అంతగా అవనిగడ్డ రాజకీయాల్లో మండలి కుటుంబం ముద్ర వేసుకుంది. మండలి బుద్దప్రసాద్ ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు ఎమ్మెల్యేగాను, ఒక సారి మంత్రిగా పని చేసి మంచి పేరు గణించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన తొలి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కూడా పని చేసి గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. దీంతో చంద్రబాబు ఆయనను దూరం పెట్టారా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అంతేకాకుండా మండలి బుద్దప్రసాద్ వద్ద ఎన్నికల్లో ఖర్చు పెట్టేంత ఆర్థిక స్థోమత లేదు, ఈ నేపథ్యంలో మండలి కాకుండా వేరే వాళ్లకు టికెట్ కేటాయిస్తే టీడీపీ సులువుగా గెలవచ్చనే అభిప్రాయం కూడా ఆ పార్టీ పెద్దల్లో వ్యక్తం అయినట్లు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
మండలి రాజకీయ ఎంట్రీ
మండలి బుద్దప్రసాద్ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రయాణం మొదలు పెట్టారు. తండ్రి మండలి వెంకటకృష్ణారావు. ప్రముఖ గాంధేయ వాది. కాంగ్రెస్ పార్టీలో తిరుగు లేని నేతగా ఎదిగారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో అవనిగడ్డ నుంచి వరుసగా 1972, 1978, 1983లో ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పని చేశారు. మచిలీపట్నం నుంచి ఎంపిగా కూడా ఎన్నికయ్యారు. ఆయన వారసుడిగా బుద్దప్రసాద్ కాంగ్రెస్‌తో ప్రయాణం సాగించారు. సుమారు 12 ఏళ్ల పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ పార్టీ అభ్యర్థిగా అవనిగడ్డ నుంచి బరీలోకి దిగారు. 1999, 2004లోను గెలుపొందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా అవనిగడ్డ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ఆయనకు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా చంద్రబాబు అవకశాం కల్పించారు. 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు చేతిలో ఓడిపోయారు. మాతృ భాషకు, తెలుగు సంస్క ృతి సంప్రదాయాలకు ఆయన పెద్దపీట వేస్తూ తెలుగు జాతి గౌరవాన్ని నలుదిశలా వ్యాపింప చేయడంలోను మండలి కృషి చేశారు.
2024లో మొండి చేయి
అవనిగడ్డలో మంచి పట్టున్న నేత మండలి బుద్దప్రసాద్. తన ట్రాక్ రికార్డును చూసి 2024 ఎన్నికల్లో కూడా చంద్రబాబు టికెట్ ఇస్తారని ధీమాతో ఉన్నారు. గతంలో ఆయన పార్టీ కోసం చేసిన సేవలు, నిబద్దతల కొలమానంగా సీటు దక్కుతుందని భావించారు. కానీ వీటిని చంద్రబాబు పక్కన పెట్టారని, అవన్నీ ఈ ఎన్నికల్లో పని చేయవనే అంశం తేలిపోయిందని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు ప్రకటించిన మూడు జాబితాల్లో ఆయన పేరు లేదు. అలా అని అవనిగడ్డకు ఇంత వరకు అభ్యర్థిని ప్రకటించ లేదు.
జనసేనకు అవనిగడ్డ
అవనిగడ్డ అసెంబ్లీ నియోజక వర్గం సీటును జనసేనకు కేటాయిస్తారనే టాక్ కూడా నడుస్తోంది. అయితే జనసేన కూడా ఇంత వరకు దీని ప్రస్తావన చేయ లేదు. పొత్తుల్లో జనసేనకు 21 అసెంబ్లీ సీటు దక్కాయి. అయితే ఇటీవల 18 స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇంకా మూడు స్థానాలు ఉన్నాయి. వీటిల్లో అవనిగడ్డ కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అవనిగడ్డ స్థానాన్ని జనసేనకు కేటాయించాలా అనే దానిపై తర్జన భర్జనలు పడుతున్నారు. ఒక వేళ జనసేనకు ఈ స్థానం కేటాయిస్తే మండలి బుద్దప్రసాద్‌కు టికెట్ లేనట్టే ఆని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. జనసేనలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా అవనిగడ్డ నుంచి పోటీ చేయాలని చంద్రబాబు మండలి బుద్దప్రసాద్‌కు సూచించారని, దానిని మండలి బుద్దప్రసాద్ తిరస్కరిస్తూ ఇలా చేయడం మంచిది కాదని, టీడీపీలోనే కొనసాగుతానని చంద్రబాబుకు తెలిపినట్లు స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు.
Next Story