పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లొంగే అవకాశాలు ఉన్నాయా? పెద్దిరెడ్డి చుట్టూ తిరుగుతున్న కేసులు ఏమవుతాయి? భూ ఆక్రమణ కేసులో ఇరుక్కుంటారా?


మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రభుత్వం ఊపిరి సలపకుండా చేస్తోంది. కూటమి అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డిపై చంద్రబాబు ఎక్కుపెట్టారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసు పెద్దిరెడ్డి చుట్టూ తిరిగింది. అయితే ఆయనను ప్రభుత్వం ఏమీ చెయ్యలేకపోయింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు ఫైల్స్ కాల్చి వేశారని చెప్పేందుకు ఆధారాలు ప్రభుత్వం సంపాదించలేకపోయింది. డీజీ నుంచి సీఎస్ వరకు ప్రభుత్వ పెద్దలంతా అక్కడికి వెళ్లారే కాని ఏమీ సాధించలేదు. తిరిగి ఇప్పుడు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఆక్రమించారనే ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. మరో పక్క అటవీ భూములు పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందనే ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు.

విజిలెన్స్ ఏమి నిగ్గు తేల్చింది?

పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో 45.80 ఎకరాల భూమి రిజిస్టర్ అయిందని గుర్తించింది. ప్రభుత్వ వెబ్ ల్యాండ్ పోర్టల్ లో పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో 77.54 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించింది. మొత్తం 104 ఎకరాల భూమికి ఇనుప కంచె వేసినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. 10-1 అడంగల్ లో 86.65 ఎకరాల భూమి ఉన్నట్లు నమోదైందని తేల్చింది. ఈ భూములన్నీ అనువంశికం, వారసత్వం, పట్టా భూములుగా రికార్డుల్లో నమోదయ్యాయి. గూగుల్ ఎర్త్ మ్యాప్ ద్వారా మొత్తం పెద్దిరెడ్డి అధీనంలో 104 ఎకరాలు ఉన్నట్లు వివిధ సర్వేనెంబర్లు, ఆ నెంబర్లలో ఎవరెవరు ఉన్నారనే పేర్ల వివరాలతో ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం పెద్దిరెడ్డి ఫామ్ హౌస్ గా చెబుతున్న మంగళంపేట ఇలాఖాలో ఉన్న భూములన్నీ ఏదో ఒక రికార్డులో నమోదైనవే కావడం విశేషం.

వెల్లువెత్తుతున్న భూ ఆక్రమణ ఆరోపణలు

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై భూ ఆక్రమణ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పుంగనూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో తన ప్రాజెక్టుల కోసం అనేక మంది వ్యవసాయ భూములు లాక్కున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పలువురు తమ భూములు లాక్కున్నారని ఫిర్యాదు చేశారు. తన మూడెకరాలు భూమిని ప్రాజెక్టు కోసమని లాక్కున్నారని యశోదమ్మ అనే మహిళ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై అధికారులు విచారణలు చేస్తే అవన్నీ చట్ట ప్రకారం వారి నుంచి కొనుగోలు చేసినట్లు రికార్డులు ఉండటంతో ఏమి చేయాలో అధికారులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

విజయసాయిరెడ్డి లా లొంగదీస్తారా?

వైఎస్సార్ సీపీ నుంచి కేంద్ర ప్రభుత్వంలో నెంబరు టూ గా వ్యవహరించిన వి విజయసాయిరెడ్డిని లొంగదీసుకోవడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సక్సెస్ అయ్యారనే ప్రచారం రాష్ట్రంలో జరుగుతోంది. ఉన్నట్లుండి రాజకీయాల నుంచి వైదొలిగేలా విజయసాయిరెడ్డిని చేయటంలో చంద్రబాబు రాజకీయం ఫలించిందని, అలాగే రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్సార్ సీపీలో నెంబరు 2 గా ప్రజలు చెప్పుకుంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లొంగ దీసుకునేందుకు చంద్రబాబు వేస్తున్న పాచికలు పారతాయా? లేదా? అనే సందేహాలు తెలుగుదేశం పార్టీలోని పలువురిలో ఉన్నాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ముందుగా దెబ్బతీయాలనే ఆలోచనలు తెలుగుదేశం వారు చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహాలు ఫలించేట్టయితే ఈ పాటికే వాటి ఎఫెక్ట్ పెద్దిరెడ్డిపై చూపించాలని, ఆ ఎఫెక్ట్ ఎక్కడా ఇంతవరకు కనిపించలేదనే చర్చ కూడా ప్రజల్లో ఉంది.

Next Story