జీవన్ రెడ్డి హిడెన్ అజెండా ఇదేనా ?
x
MLC Jeevan Reddy

జీవన్ రెడ్డి హిడెన్ అజెండా ఇదేనా ?

జగిత్యాల రూరల్ మండలంలోని జాబితాపూర్ లో పార్టీ సీనియర్ నేత గంగారెడ్డి హత్య జరగటం జీవన్ రెడ్డికి పెద్ద షాకనేచెప్పాలి.


కాంగ్రెస్ పార్టీలో ఎన్ని గ్రూపులుంటాయో ఎవరు చెప్పలేరు. నలుగురు నేతల మధ్య పది గ్రూపులుంటాయని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు. ఇపుడు విషయం ఏమిటంటే సడెన్ గా జగిత్యాల ఎంఎల్సీ తటిపర్తి జీవన్ రెడ్డి పార్టీలో టాక్ ఆఫ్ ది డే అయిపోయారు. కారణం ఏమిటంటే ఆయన ప్రధాన మద్దతుదారుడు మారు గంగారెడ్డి మంగళవారం ఉదయం హత్యకు గురయ్యారు. ప్రత్యర్ధులు ఎప్పటినుండో ప్లాన్ చేసి పక్కాగా స్కెచ్ గీసుకున్న తర్వాతే రంగంలోకి దింపి లేపేశారు. జగిత్యాల రూరల్ మండలంలోని జాబితాపూర్ లో పార్టీ సీనియర్ నేత గంగారెడ్డి హత్య జరగటం జీవన్ రెడ్డికి పెద్ద షాకనేచెప్పాలి. అదికూడా తన ప్రత్యర్ధుల నుండి ప్రాణహాని ఉందని గంగారెడ్డి ఎంతమొత్తుకుంటున్నా పోలీసులు పట్టించుకోలేదని ఇపుడు జీవన్ మండిపోతున్నారు. హత్య జరిగిన దగ్గర నుండి తాను కాంగ్రెస్ లో ఉండలేనంటు నానా రచ్చ చేస్తున్నారు.

పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసినపుడు కూడా ఇలాగే మండిపోయారు. పార్టీనేతల్లో ఎవరు ఫోన్ చేసినా జీవన్ చాలా ఆగ్రహంగా మాట్లాడుతున్నారు. ఇదంతా చూసిన తర్వాత జీవన్ అసలు అజెండా ఏమిటనే విషయమై పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ చర్చకు కారణం ఏమిటంటే జగిత్యాల ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ కు ఎంఎల్సీ జీవన్ రెడ్డికి ఏమాత్రం పడకపోవటమే. దశాబ్దాలుగా జగిత్యాలలో పార్టీ అంటే జీవన్ రెడ్డి మాత్రమే అన్నట్లుగా ఉండేది వ్యవహారం. అలాంటిది ఎంఎల్ఏ సంజయ్ వల్ల జీవన్ ఆధిపత్యానికి గండిపడింది. సంజయ్ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీచేసినపుడు కాంగ్రెస్ తరపున జీవన్ పోటీచేశారు. జీవన్ పైన గెలిచిన సంజయ్ తర్వాత పరిణామాల్లో బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లోకి ఫిరాయించారు.

సంజయ్ ను కాంగ్రెస్ లోకి తీసుకునేటపుడు రేవంత్ రెడ్డి ఎంఎల్సీ జీవన్ కు మాటమాత్రంగా కూడా చెప్పలేదు. సంవత్సరాల తరబడి తాను ఎవరిమీదైతే పోరాడుతున్నాడో అదే నేత చివరకు ఎంఎల్ఏ నియోజకవర్గంలో చక్రంతిప్పటం మొదలుపెట్టారన్న విషయాన్ని జీవన్ తట్టుకోలేకపోయారు. అందుకనే అలిగి అప్పుడు కూడా తాను పార్టీలో ఉండలేనని ప్రకటించారు. రెండురోజుల పాటు పార్టీలో సీనియర్లు ఎవరికీ అందుబాటులో కూడా లేకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మొత్తానికి ఎలాగోలా పార్టీ నేతలు జీవన్ను పట్టుకుని బుజ్జగించి శాంతింపచేశారు. మొదటినుండి కూడా సంజయ్ తో జీవన్ కు ఏమాత్రం పడదు. ఉప్పునిప్పులాగుండే ప్రత్యర్ధులు మారిన రాజకీయ పరిణామాల్లో ఒకే పార్టీలో ఉండాల్సొచ్చేటప్పటికి జీవన్ చాలా సఫొకేటింగ్ గా ఫీలవుతున్నారు. సీనియర్ నేతలు ఎన్ని హామీలిచ్చినా జీవన్ మాత్రం బాగా ఉక్కపోతను అనుభవిస్తునే ఉన్నారు.

ఈ నేపధ్యంలోనే తన ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్యకు గురవ్వటాన్ని ఎంఎల్సీ తట్టుకోలేకపోతున్నారు. కారణం ఏమిటంటే సంజయ్ తో పాటు కాంగ్రెస్ లోకి వచ్చిన బీఆర్ఎస్ మద్దతుదారులే తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యకు కారణమన్నది జీవన్ మంటగా ఉంది. ఈ మాటను ఎంఎల్సీ బాహాటంగా ప్రకటించలేదు. గంగారెడ్డిని కత్తితో పొడిచి హత్యచేసిన సంతోష్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సంతోష్ గురించి మాట్లాడటంవాకాబుచేయటం మానేసిన జీవన్ తాను పార్టీలో ఉండలేనంటు నానా గోలచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతల ప్రాణాలకే భరోసాలేదంటు రచ్చరచ్చ చేస్తున్నారు. తాను రాజకీయాలను విరమించుకుని ఏదైనా స్వచ్చంధ సంస్ధ పెట్టుకుంటానని చెబుతున్నారు.

ఎంఎల్సీ ఆరోపణలు, ప్రకటనలు, ఆగ్రహం చూస్తుంటే ఎంఎల్ఏ సంజయ్ ను టార్గెట్ చేస్తున్నట్లే అనుమానంగా ఉంది. ఎంఎల్ఏ సంజయ్ ఎస్సీకి ఫోన్ చేసి హంతకులు ఎంతటి వారైనాసరే వదలిపెట్టద్దని గట్టిగా చెప్పటంతో జీవన్ కు మరింతగా మండిపోతున్నట్లుంది. అయితే ఆ విషయంలో మాత్రం ఎక్కడా డైరెక్టుగా బయటపడలేదు. ఎంఎల్ఏతో సయోధ్య చేయటానికి కొందరు సీనియర్ నేతలు ప్రయత్నాలు చేసినా జీవన్ మాత్రం ఇష్టపడలేదు. జగిత్యాలలో కాంగ్రెస్ రాజ్యం నడుస్తోందా ? లేకపోతే ఇంకా బీఆర్ఎస్ రాజ్యమే నడుస్తోందా అని ఎంఎల్సీ ప్రశ్నించటంలోనే అంతరంగం అర్ధమైపోతోంది. కాకపోతే హత్యకు కారకుడు ఎవరన్న విషయాన్ని బహిరంగంగా చెప్పలేదంతే. మరీ హిడెన్ అజెండాను ఎప్పటికి జీవన్ రెడ్డి బయటపెడతారో చూడాల్సిందే.

Read More
Next Story