సార్వత్రిక ఎన్నికల కంటే ముందు నుంచి రెడ్ బుక్ చూపిస్తూ, చాలా మంది పేర్లు దీనిలో ఉన్నాయి, అధికారంలోకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ వచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రచారం పొందిన అంశం ఏదైనా ఉందంటే అది రెడ్ బుక్. దీని తర్వాతనే ఇక ఏదైనా అన్నట్లుగా ప్రచారం సాగింది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రెడ్ బుక్ అమలు అనేది ఏపీలో ఎప్పటికి ఎండ్ అవుతుందనేది అంతులేని ప్రశ్నగా మారింది. ఎన్నికల సమయంలో దీని గురించిన ప్రస్తావన తెరపైకి వచ్చింది. దీనికి ఆద్యుడు లోకేషే. కథ..స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మాటలు అన్నీ ఆయనే. పాత్రలు పోలీసులు. విలన్‌లు వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు, జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన కొంత మంది అధికారులు. లోకేష్ తన యువగళం పాదయాత్రలో ఈ రెడ్ బుక్‌ను చూపించే వారు. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా రెడ్ బుక్‌ను అమలు చేస్తామని హెచ్చరిస్తూ వచ్చారు.
ఇటీవల ఆయన అమెరికా పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు రెడ్ బుక్‌లోని మొదటి చాప్టర్ పూర్తి అయిందని, రెండో చాప్టర్ ఓపెన్ అయిందని, అదింకా కొనసాగుతోందని, త్వరలో మూడో చాప్టర్‌ను ప్రారంభిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రెడ్ బుక్‌లో మూడో చాప్టర్ ఏంటి? అందులో ఎవరి పేర్లు ఉన్నాయి? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే దానిపై సర్వత్ర చర్చలు జరిగాయి. తీవ్ర ఉత్కంఠ కూడా నెలకొంది. లోకేష్ అమెరికా నుంచి రాష్ట్రానికి చేరుకోగానే సమయం వృధా చేయకుండా వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన సోషల్ మీడియా విభాగం నేతలపై కేసులు నమోదు చేసే కార్యక్రమం తెరపైకి వచ్చింది. కూటమి ప్రభుత్వంపైన, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపైన సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలను అదుపులోకి తీసుకోవడం మొదలు పెట్టింది. వారిపైన కేసులు నమోదు చేసే పనికి ఉపక్రమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 100 మందికిపైగా వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకేష్ రెడ్ బుక్‌లోని మూడో చాప్టర్ ఇదేననే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. అయితే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన మాజీ సీఎం జగన్ తీవ్రంగానే ఖండించారు. పోలీసు అధికారులను కూడా హెచ్చరించారు. అన్యాయంగా తమ పార్టీ కార్యకర్తలను అరెస్టులకు పాల్పడితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి అధికారులపై చర్యలు తప్పవని పోలీసు అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.
అధికారంలోకి వచ్చీ రాగానే రెడ్ బుక్ అమలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే ప్రతీకార చర్యలకు ఉపక్రమించారు. రెడ్ బుక్ ఆధారంగా కేసుల పర్వాన్ని తెరపైకి తెచ్చారు. మొదటి చాప్టర్ కింద అధికారుల మీద దృష్టి పెట్టారు. జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేసిన పోలీసు ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేసేందుకు తెరలేపారు. సినీ నటి కాందబరీ జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై కేసులు నమోదుకు చర్యలు తీసుకున్నారు. అంతటితో వదలని ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్‌లు పీ సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలను సస్పెండ్ చేసింది. ఒకే కేసులో ఏకంగా ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడం కూడా అప్పట్లో చర్చగా మారింది.
తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడిని తెరపైకి తెచ్చారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులను ముందుకు తెచ్చింది. అందులో భాగంగా వైఎస్‌ఆర్‌సీపీలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్‌ఆర్‌సీసీ ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌తో పాటు ఆ పార్టీ నేత దేవినేని అవినాష్‌లను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. విచారణ పేరుతో వారిని పోలీస్ స్టేషన్‌కు రప్పించారు. సజ్జలకు ఏకంగా లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి ఉక్కిరి బిక్కిరి చేశారు. ఈ కేసులో నందిగం సురేష్ అరెస్టు చేసి జైలు పంపారు. తక్కిన నేతలు కోర్టును ఆశ్రయించి ముందస్త బెయిలు తెచ్చుకొని బయట పడ్డారు. ఇదంతా రెడ్ బుక్ రెండో చాప్టర్‌కు చెందిన వ్యవహారమేననే చర్చ టీడీపీ శ్రేణుల్లో సాగుతోంది. ఇంకా అరెస్టులు కొనసాగుతున్న తరుణంలో రెడ్ బుక్‌లో ఇంకా ఎన్ని చాప్టర్లు ఉన్నాయి.. వాటిని ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎవరిపై కేసులు నమోదు చేస్తారు, ఎవరిని అరెస్టు చేస్తారనేది తాజాగా రాష్ట్రంలో చర్చగా మారింది.
Next Story