TTD | టీటీడీ లడ్డూల ప్రయోగం అదనపు ఆదాయానికేనా?
x

TTD | టీటీడీ లడ్డూల ప్రయోగం అదనపు ఆదాయానికేనా?

తిరుమలకు యాత్రికుల సంఖ్య పెరుగుతోంది. కార్మికుల సంఖ్య పెంచుతున్నారు. లడ్డూ వల్ల టీటీడీకి ఎంత ఆదాయం వస్తోంది?


తిరుమలలో సామాన్య యాత్రికులకు పెద్దపీట వేయాలనేది టీటీడీ ప్రధాన లక్ష్యం. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ మేరకు ఉత్పత్తి పెంచాలనే నిర్ణయం కూడా టీటీడీకి ఆదాయమే లభిస్తోంది.

తిరుమలలో ప్రస్తుతం పోటు (వంటశాల), ఆలయం వెలుపల బూందీ తయారీకి రెండు సొసైటీల ద్వారా 616 మంది కార్మికులు పనిచేస్తున్నారు. రోజుకు 3.75 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు. ఈ సంఖ్యకు అదనంగా 50 వేల లడ్డూల తయారీకి 115 మంది అవసరం అని టీటీడీ ఆర్థిక విభాగం నుంచి గతంలో అందిన ప్రతిపాదనలకు నాలుగు నెలల కాలపరిమితిలో 84 మందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకోవడానికి గత నెలలో జరగిన టీటీడీ మొదటి పాలక మండలిలోనే నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే, అదనపు లడ్డూలే కాదు. మొత్తం లడ్డూల తయారీకి అయ్యే ఖర్చు, విక్రయాల ద్వారా టీటీడీకి ఆదాయమే ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాలేమిటో పరిశీలిద్దాం.

వందల ఏళ్ల కిందటే
తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో లడ్డు ప్రసాదం ప్రధానమైంది. దీని రుచి, సువాసన అలా ఉంటుంది. అందుకే తిరుమల లడ్డూకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు (Geographical Patent) లభించింది. అంటే దీని తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు. అని అర్ధం. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన లడ్డూ చరిత్ర ఎలాంటిదంటే..
తిరుమల శ్రీవారి ఆలయంలో వడ మినహా మిగతా ప్రసాదాలు దూరప్రాంతాలకు తీసుకుని వెళ్లడానికి లేవు. దీనిని గమనించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం మొదట 1803లో శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. అందులో తీపి బూందీ కూడా ఉండేది. ఈస్టిండియా కంపెనీ ఆధ్యర్యంలో మహంతులు తిరుమల ఆలయ నిర్వహణ పర్యవేక్షించే రోజుల్లో అంటే 19 శతాబ్దం మధ్య కాలంలో తీపి బూందీ ప్రసాదంగా ఇచ్చేవారు. 1940 నాటికి ఇది లడ్డూ ప్రసాదంగా మారింది. ఆ తరువాత వడ కూడా ఆ స్థానాన్ని ఆక్రమించింది.
దిట్టంగా ప్రోక్తం
శ్రీవారి ఆలయంలో లడ్డూల తయారీకి వాడవలసిన సరుకుల మోతాదును ‘దిట్టం’ అంటారు. దీనిని తొలిసారిగా టీటీడీ పాలక మండలి 1950 లో నిర్ణయించింది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. దీనినే పడితరం దిట్టం స్కేలు అని పిలుస్తున్నారు. పడి అంటే 51 వస్తువులు. పడికి కావలసిన వస్తువుల దిట్టం ఉంటుంది. ఆ ప్రకారం ఉగ్రాణం (శ్రీవారి స్టోర్) నుంచి వస్తువులు ఇస్తారు. దీని ప్రకారం 5,100 లడ్డూలు మాత్రమే తయారుచేయడానికి ఇన్నేసి కిలోల ప్రకారం దిట్టాన్ని అనుసరిస్తారు. తిరుమల ఆలయంలోని పోటులో రోజుకు 1000 ప్రోక్తం లడ్డూలు తయారు చేస్తారు అంటే 51 వేల లడ్డూలు అని అర్థం. వాటి తయారీకి 803 కిలోల సరుకులు వినియోగిస్తారు.
లడ్డు తయారీకి వాడే దిట్టం
2000 కిలోల శనగపిండి
4000 కిలోల చక్కెర
1850 కిలోల నెయ్యి
350 కిలోల జీడిపప్పు
87.5 కిలోల ఎండుద్రాక్ష
50 కిలోల యాలకులు
50 కిలోల కలకండ వినియోగిస్తారు.
ఒక లడ్డూ తయారీకి..
ఈ దిట్టంలో ఒక లడ్డూ తయారు చేయడానికి అయ్యే ఖర్చు ద్వారా ఆదాయమే ఉందనే విషయం చాలాసార్లు అధికారులే స్పష్టం చేశారు. అందులో రెండేళ్ల కిందట వేసిన లెక్కల ప్రకారం ఒక లడ్డూ తయారీకి రూ. 42.80 అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం పెరిగిన ధరల నేపథ్యంలో సుమారు రూ. 45 కు లోపే ఉంటుందని చెబుతున్నారు. ఇంకాస్త పెరిగినా, ఒక లడ్డూపై టీటీడీకి కనీసం రూ. ఐదు ఆదాయం ఉంటుంది.
పెరిగిన యాత్రికులు...
తిరుమలకు పెరుగుతున్న యాత్రికుల నేపథ్యంలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కూడా డిమాండ్ పెరిగింది. ఆ మేరకు పోటు (వంటశాల)ను విస్తరించడంతో పాటు, కార్మికుల సంఖ్య కూడా పెంచారు. కాలక్రమంలో టీటీడీ రెగ్యులర్ ఉద్యోగులుగా ఉన్న పోటు కార్మికుల స్థానంలో శ్రీవైష్ణవ కార్మికులను ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ప్రాతిపదికన అది కూడా సొసైటీల ద్వారా విధుల్లోకి తీసుకుంటున్నారు.
2004 వరకు రోజుకు 45 వేల లడ్లు తయారు చేయడానికి పోటు సామర్థ్యం ఉండేది.
వీటి తయారీకి మూడు నుంచి నాలుగు వేల లీటర్ల నెయ్యి అవసరమయ్యేది.
2005లో పోటు సామర్థ్యం పెంచడం ద్వారా పెంచారు. దీనివల్ల ఎనిమిది వేల నుంచి పదివేల లీటర్ల నెయ్యి వినియోగించేవారు.
2009లో మూడు లక్షల లడ్డులు తయారు చేయడానికి అవసరమైన ఏర్పాటు చేశారు దీనికి 15 వేల లీటర్ల నెయ్యి అవసరం అవుతుందని నిర్ధారించారు.
2020 లోని లడ్డు సామర్థ్యాన్ని ఆ రోజుకు ఆరు లక్షల మేరకు తయారీ స్థాయికి పెంచారు. ఈ పోటులో లడ్డు తయారు చేసే శ్రీవైష్ణవ బ్రాహ్మణులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వాస్తవానికి మొదటి నుంచి తిరుమల ఆలయ అంతర్భాగంలోనే ఉన్న పోటులోనే లడ్డులు తయారయ్యేవి. యాత్రికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో లడ్డు తయారీకి అవసరమైన బూందీ తయారు చేయడానికి వీలుగా పోటును ఆలయం వెలుపలికి తరలించారు. ఈ వంటశాలలో వేడి నుంచి కార్మికులు ఇబ్బంది పడకుండా ప్రత్యేకంగా ధర్మోఫ్లూయిడ్ టెక్నాలజీతో (Thermofluid technology ) గ్యాస్ పొయ్యిలు ఏర్పాటు చేశారు. దీనివల్ల వేడి ఎక్కువ తగలకుండా, కార్మికులు ప్రశాంతంగా పలు చేయడానికి అవసరమైన వెసులుబాటు కలిగింది.

పెరిగిన కార్మికుల సంఖ్య
యాత్రికుల డిమాండ్ దృష్టిలో ఉంచుకుని 2006లో పోటు కార్మికుల సంఖ్యను పెంచారు. 2018 లో కూడా ఆ సంఖ్య 415 కు పెరిగింది వారిలో 45 మంది వైష్ణవులు 201 వైష్ణవేతరులు మొత్తంగా 616 మంది పనిచేస్తున్నారు వారందరూ రెండు సొసైటీల ద్వారా తీసుకున్న కార్మికులే కావడం గమనార్హం. వీరి ద్వారా రోజుకు 3.75 లక్షల చిన్న లడ్డూలు, పెద్ద లడ్డూలతో పాటు వడ, అప్పం, దోశ, జిలేబి ఇతర ప్రసాదాలు తయారు చేస్తుంటారు. వారిలో అన్న ప్రసాదాలు తయారీకి వైష్ణవులకు వైష్ణవేతరులు సహాయకులుగా పనిచేస్తున్నారు. టీటీడీ ఉద్యోగులుగా ఉన్న పోటు కార్మికులు పదవీ విరమణ వల్ల ఈ ఖాళీలు ఏర్పడ్డాయి.

తయారీ.. విక్రయాలు
తిరుమల పోటులో ప్రస్తుతం రు. 50 విలువైన చిన్న లడ్డూలు 3.5 లక్షలు తయారవుతున్నాయి. వీటిలో 3.4 లక్షల లడ్డులు అమ్ముడుపోతున్నట్టు టీటీడీ అధికారికంగా పాలక మండలికి సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో అదనపు లడ్డూలు అవసరం అవుతున్న పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. రూ. 200 పెద్ద లడ్లు 6000 తయారు చేస్తున్నారు. రూ. వంద విలువైన వడ 3,500 తయారు చేస్తారు. కళ్యాణోత్సవానికి హాజరైన గృహస్థులకు, విఐపిలకు అందివ్వగా మిగిలిన వడలు, పెద్ద లడ్లు కౌంటర్ల విక్రయాలకు ఉంచుతున్నారు దీంతో మిగులు అనేది లేకుండా పోయింది.
డిమాండ్ ఎందుకంటే...
టీటీడీ సమాచార కేంద్రాలను దశాబ్దాల కాలంగా దేశంలోని ప్రధాన కేంద్రాల్లో నిర్వహిస్తోంది. అందులో ప్రధానంగా చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరులోని సమాచార కేంద్రాలకు కూడా టీటీడీ లడ్డూలు అందుబాటులో ఉంచింది. నెలలో మొదటి శనివారం అక్కడికి ఒకో కేంద్రానికి పది వేల లడ్లూ పంపుతోంది.
వాటికి అదనంగా, రెండేళ్ల నుంచి కడప నగరానికి సమీపంలోని పాత కడప (దేవుని కడప)లోని శ్రీవేంకటేశ్వరస్వామి, కడప జిల్లా శ్రీకోదండరామస్వామి ఆలయం, గండి వీరాంజనేయస్వామి ఆలయంతో పాటు, తిరుపతిలోని కపిలతీర్ధం, గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరులో కూడా అందుబాటులో ఉంచుతోంది. విశిష్ట ఉత్సవాల సందర్బంలో శ్రీనివాసపుంగాపురం ఆలయం వద్ద కూడా పది వేల లడ్డూలు విక్రయిస్తున్నారు. దీంతో తిరుమలలో అదనపు లడ్డూల తయారీకి కార్మికుల అవసరం ఏర్పడింది.
అదనపు కార్మికులు
పోటులో లడ్డూల తయారీకి ప్రస్తుతం ఉన్న కార్మికులకు అదనంగా సిబ్బందిని కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకోవాలని గత పాలక మండలి (YCP)లో ప్రతిపాదించిన 115 మంది అవసరం అనే సంఖ్యను కుదించి, లడ్డు తయారీకి 84 మంది పోటు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించారు.. వారిలో 74 మంది వైష్ణవులు పదిమంది వైష్ణవేతరులను అవుట్సోర్సింగ్, సొసైటీల ద్వారా తీసుకోవాలని నిర్ణయించారు. వీరి ద్వారా రోజుకు 50 వేలు చిన్న లడ్డూలు, 4000 పెద్ద లడ్డూలు, 3500 వడలు బూందీ పోటులో తయారు చేయడానికి వినియోగిస్తారు.
ఒక్కో కార్మికుడు..
తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో ఉన్న పోటులో ఒక కార్మికుడు ఎన్నిలడ్డులు తయారు చేస్తారంటే. ఒక కార్మికుడు 700 చిన్న లడ్డూలు, పెద్ద లడ్డులు 330, వడలు 120 తయారు చేయగలిగిన సామర్థ్యంలో పనిచేస్తారు. ఆ లెక్కన రోజుకు 50 వేల లడ్డూలు తయారీకి 73 మంది కార్మికులు, పెద్ద లడ్డూలు 4,080 తయారీకి 12 మంది, 3,570 వడల తయారీకి 30 మంది కార్మికులు అంటే మొత్తం మీద 115 మంది పనిచేస్తారు.
భారం ఎంత అంటే
తిరుమలలో లడ్డూల విక్రయాల ద్వారా రూ. 11,16, 90, 000 విక్రయాల ద్వారా ఆదాయం లభిస్తుంది. లడ్డూల తయారీ, కార్మికుల వేతనాలు, గ్యాస్ వినియోగం వంటి ఖర్చులన్నీ కలిపితే రు. 8,07,07,771 అవుతుందని టిటిడి అధికారులు అంచనా వేసి పాలకమండలికి నివేదించారు. అంటే ఇక్కడ కూడా, సామాన్య యాత్రికులకు కోసం అదనపు లడ్డూలు తయారు చేయాలని టిటిడి ప్రతిపాదన ద్వారా కూడా లాభమే ఉంది. రు. 3.09,82,229 టిటిడి కి అదనపు ఆదాయమే వస్తుందని ఆ ప్రతిపాదనల్లో వివరించారు.
ప్రతిపాదనలో కుదించి..
2024 ఆగస్టు 25వ తేదీ చేసిన టిటిడి గత పాలకమండలి తీర్మానం మేరకు, ప్రస్తుతం ఉన్న రెండో సొసైటీల ద్వారా పనిచేస్తున్న కార్మికుల కాలపరిమితి 2025 మార్చి వరకు పొడిగించారు. పోటులో పనిచేసే కార్మికుల కొరత సమస్య రాకుండా ముందస్తుగా టిటిడి అధికారులు ప్రతిపాదించిన మేరకు పాలకమండలి నిర్ణయం తీసుకున్నది. కాంట్రాక్టు కాలపరిమితి సమీపిస్తున్న నేపథ్యంలో టిటిడి ఆర్థిక విభాగం అధికారుల ద్వారా సమర్పించిన నివేదిక మేరకు 84 మంది అదనపు కార్మికులను తీసుకోవడానికి ప్రస్తుత టిటిడి పాలకమండలి నిర్ణయం తీసుకుంది అందులో, 74 మంది వైష్ణవులు ( ఒకరి వేతనం రు.42 137.52), పదిమంది వైష్ణవేతరులను (ఒకరి వేతనం రు. 41, 767) తీసుకోవాలని నిర్ణయించారు.
ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగియనున్న నాలుగు నెలల కోసం వారికి వేతనాలుగా రు. 1,41,43,386 ఖర్చవుతుందని కూడా టిటిడి ఆర్థిక విభాగం నిర్ధారించింది. ఈ ప్రతిపాదనను టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు సారధ్యంలోని పాలకమండలి నవంబర్ 18 జరిగిన మొదటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాగా,
ఆలయం వెలుపల తయారీ
లడ్డూల తయారీ సంఖ్యను పెంచిన నేపథ్యంలో ఐదేళ్ల కిందటే బూందీ తయారీకి వంటశాలను ఆలయం వెలుపలికి తరలించారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో ఈఓగా పనిచేసిన ఏవీ. ధర్మారెడ్డి ఈ చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా, కార్మికులను గ్యాస్ పొయ్యి వద్ద అసౌకర్యానికి గురికాకుండా, ధర్మోఫ్లూయిడ్ సాంకేతిక పద్ధతులు ఏర్పాటు చేశారు. నెయ్యి కూడా వేడి అయిన తరువాత ఇబ్బంది లేకుండా ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేయించారు. దీంతో ఇక్కడ పనిచేసే కార్మికులు అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు రోజుకు కనీసంగా ఆరు లక్షల లడ్డూల తయారీకి అవసరమైన మేరకు వసతులు కల్పించారు.
ఈ వంటశాలలో తయారు చేసే బూందీని కన్వేయర్ బెల్టు ద్వారా ఆలయంలోపలి పోటు లోపలికి పంపించి, అడ్డూల తయారీ చేస్తున్నారు. శ్రీవారి ఆలయ మహద్వారం నుంచి నెత్తిబరువుపై లడ్డూ క్రేట్లు తీసుకుని వచ్చే వారు. ప్రస్తుతం ఆ శ్రమ లేకుండా, కన్వేయర్ బెల్టుమీదనే ట్రేలు కౌంటర్ల వద్దకు చేరుతున్నాయి. మారుతున్న కాలం. అవసరాలకు అనుగుణంగా చోటు చేసుకున్న మార్పుల వల్ల ఈ వసతులు అందుబాటులోకి వచ్చాయి.
Read More
Next Story