
వంశీకి గంజాయి రవణాతో సంబంధం ఉందా?
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ తో ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతన్నాయి. పూటకో ఆరోపణ తెరపైకి వస్తోంది.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ తో ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతన్నాయి. పూటకో ఆరోపణ తెరపైకి వస్తోంది. ఇప్పటి వరకు భూఆక్రమణలు, మట్టి దందా, దాడులే అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఆయనకు రేషన్ బియ్యం, గుట్కా, గంజాయితోనూ సంబంధాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గన్నవరం సెంటర్ ను గుట్కా, గంజాయి అక్రమ రవాణాకు కేంద్రంగా మార్చారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి వెంచర్లు వేశారని కూడా అంటున్నారు. ఒక్కో దందాకు ఒక్కొక్కర్నీ బాధ్యుణ్ణి పెట్టి వ్యవహారం నడిపించేవారట. అయితే ఈ ఆరోపణలను వంశీ వర్గీయులు, ఆయన అనుచరులు ఖండిస్తున్నారు. అధికార టీడీపీ నేతలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, వంశీ అమాయకుడని, ఆయనకు ఎటువంటి దందాలతో సంబంధం లేదని చెబుతున్నారు.
వంశీపై టీడీపీ వాళ్ల ఆరోపణలు ఇవీ...
కోడూరుపాడులో వంశీ అనుచరులు పెద్దఎత్తున ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక స్వాధీనం చేసుకుని, బోర్డు పెట్టిందని తెలుగుదేశం నాయకులు వాదిస్తున్నారు. వంశీ, ఆయన అనుచరులపై తాజాగా వచ్చిన ఆరోపణలు ఇలా ఉన్నాయి..
"గన్నవరం నియోజకవర్గంలోని గ్రామపంచాయతీ నిధులను వంశీ అనుచరులు స్వాహా చేశారు. గన్నవరంలో రూ.కోటిన్నర నిధులు దారి మళ్లాయి. సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో అధికారులు పంచాయతీ కార్యదర్శిపై క్రమశిక్షణ చర్యలతో సరిపెట్టారు. కానీ ఈ నిధులు ఎక్కడికి చేరాయనేది తేల్చలేదు.
బాపులపాడు పంచాయతీలోనూ రూ.కోటి నిధులు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. జరిమానా కట్టాలని గత పాలకవర్గానికి నోటీసులు ఇచ్చినా పట్టించుకున్న దాఖలాలు లేవు" అని టీడీపీ గన్నవరం నియోజకవర్గ నాయకులు ఆరోపించారు.
"2019 నుంచి 2024 ఏప్రిల్ మధ్య గన్నవరం, విజయవాడ గ్రామీణ మండలాల్లో ప్రభుత్వ భూములు, వాగులు, చెరువులను కలిపేసుకుని.. వంశీ అనుచరులు పలు స్థిరాస్తి వెంచర్లను వేసి.. రూ.కోట్లలో అమ్ముకున్నారు.
బాపులపాడు మండలం కోడూరుపాడులో ఆర్.ఎస్.నంబరు 171-1లో రూ.కోటి విలువైన ఎకరన్నర భూమి, అంపాపురంలో ఆర్.ఎస్.నంబరు 224లో వివిధ సబ్ డివిజన్ల కింద రూ.3 కోట్ల విలువైన 2.50 ఎకరాలను వంశీ అనుచరులు కబ్జా చేశారు.
కోడూరుపాడులో ఆర్.ఎస్.నంబరు 111లో కోదండరామస్వామి ఆలయ ఎకరం భూమిని వంశీ అనుచరులు దొంగ దస్త్రాలతో సొంతం చేసుకున్నారు. మొత్తంగా ఇలాంటి అక్రమాలు రూ.వందల కోట్లలో జరిగాయి" అని ఆరోపించారు.
రేషన్ బియ్యం దందాలోనూ...
గన్నవరంలో అక్రమ రేషన్ బియ్యం లావాదేవీలు, గంజాయి రవాణా, గుట్కా అమ్మకాలు విచ్చలవిడిగా సాగాయి. రేషన్ బియ్యం దందా కోసం కొన్ని రైస్ మిల్లులను వంశీ అనుచరులు తమ ఆధీనంలో ఉంచుకుని మరీ దందాను నడిపించి రూ.కోట్లలో కొల్లగొట్టారు. అడ్డదారిలో గంజాయి తెచ్చి అమ్మే ముఠాలకూ వంశీ, అతని అనుచరులు సహకరించేవాళ్లు. నిషేధిత గుట్కా అమ్మకాలు సాగించే హోల్‌సేల్ వ్యాపారులతోనూ కొందరు వంశీ అనుచరులు ఒప్పందాలు కుదుర్చుకుని నెలవారీ మామూళ్లు తీసుకొని వారి వ్యాపారానికి అండగా నిలిచారనే ఆరోపణలున్నాయి" వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం వంశీ జైల్లో ఉన్నారు. బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి.
Next Story