విశాఖ సిటీకి నీటి కష్టాలు తప్పవా?
x
Source: Twitter

విశాఖ సిటీకి నీటి కష్టాలు తప్పవా?

ఎండల తీవ్రత పెరగడంతో నీటి కష్టాలు తప్పవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన నగరాల్లో ఒకటైన విశాఖ పరిస్థితి ఏమిటి...?


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: సుందర నగరంగా, పారిశ్రామికవాడగా పేరొందిన విశాఖ నగరంలో నీటి ఎద్దడి ఛాయలు కనిపిస్తున్నాయి. వేసవి తొలినాళ్లలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జలాశయాల్లో నీటి శాతం తగ్గుతూ వస్తుంది. దీంతో నగర ప్రజలకు నీటి కష్టాలు తప్పవని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం నీటి ఎద్దడి ఉండబోదని చెబుతున్నారు. నగర పరిధిలో ఉన్న 22 లక్షల మంది ప్రజల నీటి అవసరాలతో పాటు పరిశ్రమల నీటి అవసరాలను తీర్చాల్సి ఉంది. ఈ నీటి నిర్వహణ బాధ్యత గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(GVMC) పైనే ఉంది.

నగరానికి ఎంత నీరు అవసరం...?

విశాఖ నగరంలోని ప్రజలు, పరిశ్రమల రోజువారి అవసరాలకు సరిపడా నీటిని జీవీఎంసీయే సరఫరా చేస్తోంది. నగరంలో మున్సిపల్ కుళాయిల ద్వారా ప్రజలకు తాగు నీటిని అందిస్తుండగా.... నగర శివారు ప్రాంత ప్రజలకు మంచినీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తోంది. నగరానికి ప్రధానంగా ఏడు రిజర్వాయర్ల ద్వారా నీరు సరఫరా అవుతుంది. మేఘాద్రి గడ్డ, ఏలేరు, రైవాడ, తాటిపూడి, ముడసర్లోవ, గోస్తని, గంభీరం జలాశయాల నుంచి నీరు సరఫరా అవుతుంది. ప్రజల తాగునీటి అవసరాలకు, పరిశ్రమల అవసరాలకు కలిపి సుమారుగా రోజుకు 85 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం కాగా.. ఇందులో 15 ఎంజీడిల నీరు పరిశ్రమలకు వెళ్తుంది. ఏలేరు నుంచి 42.65 మిలియన్ గ్యాలన్లు, రైవాడ నుంచి 13.20, తాటిపూడి నుంచి 10.01, మేఘాద్రిగడ్డ నుంచి 8.01, గోస్తని నుంచి 5, గంభీరం నుంచి 1.10, ముడసర్లోవ నుంచి 1.01 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా అవుతుంది. వీటికి అదనంగా బోర్లు, బావుల నుంచి 5.45 మిలియన్ గ్యాలన్ల నీరు వినియోగంలోకి వస్తోంది. విశాఖ నగరానికి వివిధ రిజర్వాయర్ల నుంచి వచ్చే నీటిని నగర పరిధిలో గల 11 ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి సరఫరా చేస్తారు. ప్రస్తుతం మంచినీటి అవసరాలతో పాటు పరిశ్రమల అవసరాలకు ఏలేరు నీటిని వాడుతున్నారు.

‘‘నగర ప్రజల తాగునీటి అవసరాలను తీరుస్తున్నాం. గంగవరం పోర్ట్, విశాఖపట్నం పోర్ట్, హెచ్పిసిఎల్, ఎన్ఎస్టిఎల్, స్టీల్ ప్లాంట్ వంటి భారీ పరిశ్రమలతో సహా చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు నీరు సరఫరా చేస్తున్నాం. దీంతోపాటు వ్యవసాయానికి కూడా నీటిని విడుదల చేస్తున్నాం' అని జీవీఎంసీ నీటి విభాగం సూపరిండెంట్ ఇంజనీర్ కెవిఎన్ రవి.. ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి తెలిపారు.

నీటి నిల్వలు సరిపోతాయా...

కేంద్ర జల శక్తి శాఖ అంచనాల ప్రకారం ఒక వ్యక్తికి రోజుకు 135 లీటర్లు నీరు అవసరం అవుతుంది. అయితే ప్రస్తుతం జీవీఎంసీ 110 నుంచి 115 లీటర్ల నీటిని సరఫరా చేస్తుంది. ఎండలు ముదిరి నీటి లభ్యత తగ్గితే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. నీటి లభ్యత తగ్గితే నీటి సరఫరా ఎంత మేర తగ్గుతుందో అధికారులకే తెలియాలి. ప్రస్తుతానికి ప్రజల మంచినీటి అవసరాలకు, పరిశ్రమల అవసరాలకు నీరు సరఫరా చేస్తున్నామని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. రిజర్వాయర్లలో నీటి మట్టం తగ్గినా నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు జూలై నెల వరకు సరిపోతాయని చెబుతున్నారు. ‘‘తాగునీరు వృధా కాకుండా చూస్తున్నాం. నీటి వనరుల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఏలేరు మంచి మెగాద్రిగడ్డకు నీటిని పంపింగ్ చేయిస్తున్నాము. విశాఖ నగరంలో నీటి ఎద్దడి రాకుండా అన్ని చర్యలు చేపట్టాం’’ అని జీవీఎంసీ కమిషనర్ సాయి శ్రీకాంత్ వర్మ.. ది ఫెడరల్ న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధికి తెలిపారు.

అడుగంటుతున్న భూగర్భ జలాలు..

భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. కాలువలు కుదించుకుపోవడం, చెరువులు కబ్జాలకు గురి కావడం, నగరంలో నిర్మాణాలు పెరిగి కాంక్రీట్ జంగిల్‌గా మారిపోవడం.. వెరసి పట్టణాల్లో నీటి ఎద్దడి ఏర్పడుతుంది. చెట్ల నరికి వేతతో వర్షాలు కురిసినప్పుడు నీరు భూమిలో ఇంకటం లేదు. మరోపక్క హై పవర్ మోటారు బోర్లతో భూగర్భ జలాలను తోడైయడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నీటి వృధాను అరికట్టి, భూగర్భ జలాల పరిరక్షణకు చర్యలు చేపట్టకపోతే విశాఖ నగరానికి ఈ వేసవిలో నీటి కష్టాలు తప్పవని భూగర్భ జల శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

భూగర్భ జలాలను విపరీతంగా తోడేయడంతో భూమి పొరలు చీలుతున్నాయని... దీని ద్వారా సముద్రపు నీరు చొచ్చుకు వచ్చి విశాఖ తీర ప్రాంతాలు ఉప్పునీటి బుగ్గలుగా మారుతున్నాయని జియాలజీ నిపుణులు చెబుతున్నారు. ‘విశాఖలో రాతి నేలలు అధికంగా ఉండటంతో, వర్షం కురిసిన నీరు 7 నుంచి 10 శాతం మాత్రమే భూగర్భ జలాలుగా మారుతుంది. ఇది 15 శాతం ఉండాలి. కనుక విశాఖ వాసులు నీటి వనరులను వృధా చేయకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’అని జియాలజీ ప్రొఫెసర్ ఆనంద్ చెప్పారు.



Read More
Next Story