వైసీపీది మేకపోతు గాంభీర్యమేనా!
x
Source: Twitter

వైసీపీది మేకపోతు గాంభీర్యమేనా!

టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఖరారు కాకుండా విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు. వారి విమర్శలు ఓటమి భయాన్ని కప్పిపుచ్చుకోవడానికే అంటున్న విశ్లేషకులు.



టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. పొత్తు ఉందా లేదా అన్న అంశంపై మూడు పార్టీలకు చెందిన ఏ నేత కూడా స్పష్టత ఇవ్వలేదు. ఈ మూడు పార్టీల కూటమి ఇంకా చర్చల దశలోనే ఉంది. ఇదే విషయంపై శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఢిల్లీలో భేటీ కానున్నారు. ఇందులో వీరి పొత్తుపై క్లారిటీ రావొచ్చని అంతా భావిస్తున్నారు. కానీ ఇంతలోనే వీరి పొత్తుపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించడం ప్రారంభించేశారు. ఎంతమంది గుంపులుగుంపులుగా వచ్చినా వైసీపీని ఏమీ చేయలేరని, త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో వైసీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నిరాశ, నిస్పృహలో ఉన్నారని ఎద్దేవా చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలన్నీ తమ ఓటమి భయాన్ని కప్పిపుచ్చునే ప్రయత్నాలేనని, ఈసారి వైసీపీ గెలుపుపై ఆ పార్టీ నేతల్లో కూడా అనేక సందేహాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

బాబు చర్యలతో వైసీపీ బలం తెలుస్తోంది: సజ్జల

బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు ప్రస్తుతం నిరాశ, నిస్ప్రహలో ఉన్నారు. ఒకవైపు బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తూనే మరోవైపు కాంగ్రెస్‌ను కూడా తన చెప్పుచేతల్లో ఉంచుకుంటున్నారు. పొత్తుల కోసం చంద్రబాబు చేస్తున్న విశ్వప్రయత్నాలు రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఎంత బలంగా ఉందో తెలుస్తోంది. జగన్ నాయకత్వంపై రాష్ట్ర ప్రజలకు ఉన్న నమ్మకం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది’’అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఎన్ని పొత్తులు వచ్చినా పటాపంచలే

త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ సింగిల్‌గానే వస్తారని, పొత్తులంటూ గుంపులు గుంపులుగా రారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ‘‘వైసీపీపై పోటీగా ఎన్ని పొత్తులు వచ్చినా అవి పటాపంచలవుతాయి. మూడు పార్టీలు కాదు ముప్పై పార్టీలు కలిసి వచ్చినా వైసీపీని ఏం చేయలేవు. ఈసారి ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో ఫ్యాన్ హవాకు సైకిల్, గ్లాసు ఎగిరిపోతాయి’’అని పేర్కొన్నారు.

మేకపోతు గాంభీర్యమేనా!

జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తుపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు భయానికి నిదర్శనంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొత్తు ఇంకా ఖరారు కాకుండానే బీజేపీ-జనసేన-టీడీపీలపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల్లో ఎన్నికల్లో ఓడిపోతామన్న వారి భయమే కనిపిస్తుందని అంటున్నారు. మూడు పార్టీలు కలిసి వస్తే వైసీపీ మూడు చెరువుల నీళ్లు తాగాల్సి వస్తుందని, అందుకే ఖరారు కాని పొత్తును చూసి భయాందోళనలకు గురవుతూ తీవ్ర విమర్శలకు దిగుతున్నారని, ఈ విమర్శల ద్వారా వైసీపీ.. మేకపోతు గాంభీర్యం కనబరుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలను ఖరారు చేయడంలో వైసీపీ ఆలస్యం చేయడానికి కూడా ఇదే కారణమని, అందుకు మచిలీపట్నం నియోజకవర్గం నిదర్శనమని పేర్కొంటున్నారు.

రాష్ట్రంలో బీజేపీ-జనసేన బలం పుంజుకోవడం, ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుండటం వైసీపీ నేతలను కలవరపెడుతోంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రభుత్వ ప్రాజెక్ట్‌ల విషయంలో భారీ సంఖ్యలో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు జాబ్ క్యాలెండ్ విడుద చేయకపోవడంపై నిరుద్యోగులు, జీతాల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు, బిల్లుల అంశంపై కాంట్రాక్టర్లు కూడా వైసీపీకి వ్యతిరేకులుగా మారుతున్నారు. వాటన్నింటినీ గమనించే వైసీపీ నేతలు ఈ లేని ధైర్యాన్ని కనబరుస్తున్నారని, వైసీసీ హయాంలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాలేదని, పెట్టుబడులు శూన్యంగా ఉన్నాయని, అప్పులు మాత్రం విపరీతంగా పెరిగాయని యువత ప్రశ్నిస్తుండటం ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు పేర్కొన్నారు.


Read More
Next Story