ఫ్యాన్‌కు ఎదురు గాలి వీస్తోందా..!?
x

ఫ్యాన్‌కు ఎదురు గాలి వీస్తోందా..!?

ఎన్నికల్లో తుది ఘట్టం ఇంకొన్ని గంటల్లో ప్రారంభం కానున్నది. ప్రస్తుత వాతావరణం గత ఎన్నికలకు భిన్నంగా ఉంది. చిరకాల ప్రత్యర్థులు పట్టు కోసం పాకులాడుతున్నారు.


తిరుపతి: బలమైన కేడర్ ఉంది. నాయకులు సమర్థులే. 2024 ఎన్నికల్లో తుది ఘట్టం పోలింగ్ ఇంకో 24 గంటల్లో ప్రారంభం కానున్నది. అధికార వైఎస్ఆర్సిపికి చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా 11 స్థానాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ఈయన ఆధిపత్యాన్ని కట్టడి చేయాలని చిరకాల రాజకీయ ప్రత్యర్థులు జిల్లాకు చెందిన మాజీ సీఎం, టిడిపి అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు, మరో మాజీ సీఎం, బిజెపి నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్ని అస్త్రాలు ఉపయోగించారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో కుప్పం మినహా మిగతా 13, రెండు ఎంపీ సెగ్మెంట్లో వైఎస్ఆర్సిపి విజయం సాధించింది. " ఒక్క ఛాన్స్ ఇవ్వండి" అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థన, నవరత్న పథకాలు, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దల వేధింపులు, దివంగత సీఎం వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సంఘటనలు సానుకూలంగా పనిచేశాయి.

2024 సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి, అధికార వైఎస్ఆర్సిపి అనేక ఆరోపణలను మూటగట్టుకుంది. అక్రమ కేసులతో వేధింపులు, ల్యాండ్, మైన్, ఇసుక దోపిడీ వంటి అనేక ఆరోపణలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మూటగట్టుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో నిలుపుకోవాలని ఆరాటపడుతోంది. కూటమితో ఏకమైన జిల్లాకు చెందిన మాజీ సీఎంలు ఎన్. చంద్రబాబు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకట్ట వేయగలరా అనేది ఒకసారి పరిశీలిద్దాం.

మూడు సెగ్మెంట్లకు పెద్దన్న దూరం

జిల్లా మొత్తం పెద్దన్న పాత్ర పోషిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నగరి, తిరుపతి, చంద్రగిరి అసెంబ్లీ స్థానాలపై జోక్యం చేసుకోవడం లేదు. ఈ ముగ్గురు అభ్యర్థులు సీఎం వైఎస్ జగన్‌కు ప్రత్యక్ష సంబంధాలు నెరపడమే అనేది ఆ పార్టీ వర్గాల్లో వినిపించే మాటలు. నగరి నుంచి మంత్రి ఆర్కే రోజాతో టిడిపి అభ్యర్థిగా గాలి భానుప్రకాష్ పోటీలో ఉన్నారు. కుటుంబ సభ్యుల అవినీతి అక్రమాలు ఆమెకు ప్రతిపందకంగా మారాయి. ఇక్కడ టిడిపి అభ్యర్థి భాను ప్రకాష్ కు పరిస్థితి సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. తిరుపతిలో సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, పోటీ నుంచి తప్పుకుని ఆయన కుమారుడు భూమన అభినయ రెడ్డిని బరిలో నిలిపారు.

తిరుపతిలో మాస్టర్ ప్లాన్ అవినీతి ఆరోపణలు, నష్టపోయిన పేదలకు న్యాయం చేయడంలో జరిగిన వ్యవహారం వెంటాడుతోంది. ఇక్కడ జనసేన నుంచి పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులుకు కూటమిలోని నాయకులు అందరూ కలిసి పనిచేయడం కలిసి వచ్చేలా ఉంది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్నారంట ఆ స్థానంలో కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోటీ చేస్తున్నారు. మండలాల నాయకులు పార్టీకి దూరం కావడం పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలో టు స్పష్టంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సెగ్మెంట్లో టిడిపి అభ్యర్థిగా పులివర్తి నాని మధ్య గట్టి పోటీ ఉందని భావిస్తున్నారు.

చిత్తూరులో రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి టిడిపి అభ్యర్థి గురజాల జగన్ మోహన్ కు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, ఏఎస్ మనోహర్ అండగా నిలవడం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయానంద రెడ్డికి పరిస్థితి వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్నారు. పూతలపట్టు ఎస్సీ రిజర్వుడు సెగ్మెంట్లు త్రిముఖ పోటీ ఏర్పడింది. టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీనియర్ జర్నలిస్టు డాక్టర్ మురళీమోహన్, వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పోటీ పడుతున్నారు. ఇక్కడి నుంచి మళ్లీ సీటు దక్కక కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు వల్ల అధికార పార్టీకి దెబ్బ తగిలి అవకాశాలను ర పరిశీలకులు తోసిపుచ్చడం లేదు.

ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులు గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. పలమనేరు అసెంబ్లీ సెగ్మెంట్లో టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి ఎన్. అమర్నాథరెడ్డితో వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటే గౌడ తలపడుతున్నారు. ఇక్కడ టీడీపీకి పరిస్థితి అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై టిడిపి అభ్యర్థిగా ఒకనాటి చిరకాల ప్రత్యర్థి చల్లా రామచంద్రారెడ్డితో పాటు, బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పోటీ చేస్తున్నారు. ఫ్రీ పోలింగ్ జరిగితే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని ప్రత్యర్థి పార్టీల నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సవాల్ విసురుతున్నారు.

పదవులతో టిడిపి వ్యూహం ఫలిస్తుందా

మదనపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే షేక్ షాజహాన్ బాషా టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టిడిపిలో కొన్ని వర్గాలు, జనసేన నుంచి ఆయన సహాయ నిరాకరణకు గురవుతున్నారు. టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు నాయకులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ఐక్యంగా పనిచేయాలని ఆయా పార్టీల అధిష్టానం ఆదేశించింది. టిడిపిలో ఓ మాజీ ఎమ్మెల్యేకి సోదరుడు, మరో మాజీ ఎమ్మెల్యే భర్త రాటకొండ రెడ్డెప్ప రెడ్డి (బాబు రెడ్డి), మాజీ ఎమ్మెల్యే దోమ్మలపాటి రమేష్, జనసేన ప్రాంతీయ సమన్వయ కర్త గంగారపు రాందాస్ చౌదరి ప్రచారాల్లో హాజరు వేయించుకుని వెళ్తున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారాలు తమకు లాభించే అంశమే అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చలవతో

వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిసార్ అహ్మద్ ఆశాభావంతో ఉన్నారు. పీలేరు నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన తండ్రి ఎం అమర్నాథరెడ్డి కాలం నుంచి 40 ఏళ్లుగా ఈ నియోజకవర్గంలో అనుబంధం ఉంది. రాజంపేట ఎంపీ స్థానం నుంచి ఆయన సోదరుడు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. (పీలేరు రాజంపేట ఎంపీ పరిధిలో ఉంది) వీరిద్దరి కి పరస్పర సహకారం కలిసి వచ్చే అవకాశం ఉంది. వైయస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఇక్కడ వారితో తలపడుతున్నారు. ఇక్కడ టిడిపికి సానుకూల పరిస్థితులు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

టిడిపి గెలుస్తుందా?

తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కు టికెట్ దక్కలేదు. కొత్తగా ఎన్నారై దాసరపల్లి జయచంద్ర రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయనకు బిజెపి సీనియర్ నేత టికెట్ ఆశించి భంగపడినప్పటికీ చల్లపల్లి నరసింహారెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఈ స్థానంలో టిడిపి విజయం సాధించే అవకాశాలను కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టాయని తెలిసింది.

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా డిప్యూటీ సీఎం కే నారాయణస్వామి కుమార్తె కృపారాణి పోటీ చేస్తున్నారు. కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం, అభివృద్ధి పనులు శిలాఫలకాలకు పరిమితం కావడం అంటే కారణాలతో.. ఇక్కడి టిడిపి అభ్యర్థి థామస్ కు వాతావరణం అనుకూలంగా ఉందని చెబుతున్నారు. సత్యవేడు నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం పోటీ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ఆయనకు టిడిపిలో టికెట్ దక్కిన ఆ పార్టీలోని అనేక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా సీనియర్ మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మకు కొడుకు వరసైన మేకతోటి రాజేష్ బరిలో ఉన్నారు. టిడిపి అభ్యర్థి పై ఉన్న వ్యతిరేకత రాజేష్‌కు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.

సీఎం రాక తప్పలేదు

నగరి నియోజకవర్గంలో మంత్రి ఆర్కే రోజా పోటీ చేస్తున్నారు. ఏమి పై ఉన్న వ్యతిరేకత, సైనికుల్లా పనిచేసిన నేతలు టిడిపి వైపు వెళ్లారు. దీంతో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల కిందట నగరికి అనివార్యంగా రాక తప్పలేదు. సీనియర్లందరూ వైఎస్ఆర్సిపిని వీడడంతో టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్‌కు పరిస్థితి అనుకూలమయ్యే వాతావరణం కనిపిస్తోంది

రాజీవ్ నగర్ దెబ్బతీసిందా!?

శ్రీకాళహస్తి పట్టణంలో అనుచరులు రాజీవ్ నగర్ వద్ద భూ అక్రమాలు సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పుట్టి ముంచేలా ఉన్నాయి. "ఇది నాకు పెద్ద దెబ్బగా ఉందబ్బా" అని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కొందరు వద్ద వ్యాఖ్యానించారు అంటే పరిస్థితి అర్థం అయిపోయిందని భావిస్తున్నారు. శ్రీకాళహస్తిలో రాజ్యమైన అనేక వ్యవహారాలు టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డికి అనుకూలించే వాతావరణం లేకపోలేదని భావన వ్యక్తం అవుతోంది.

పెద్దిరెడ్డి ఆశీస్సులతో..

చిత్తూరు ఎంపీ స్థానం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో ఎన్. రెడ్డప్ప మళ్లీ పోటీ చేస్తున్నారు. టిడిపి అభ్యర్థిగా బాపట్ల నుంచి చిత్తూరుకు వచ్చిన దగుమల్ల ప్రసాదరావు ఆయనతో తలపడుతున్నారు. క్యాడర్ పరంగా టిడిపికి మంచిపట్టు ఉంది. వైఎస్సార్సీపీ అభిమానులు ఉన్నారు. ఇక్కడ పోటీ గట్టిగానే ఉంటుందని భావిస్తున్నారు. టిడిపి అభ్యర్థికి కుప్పం, పలమనేరు, చిత్తూరు, పూతలపట్టు అసెంబ్లీ సెగ్మెంట్లో ఓట్లు కలిసి రాగలరని అంచనా వేస్తున్నారు.

డైరెక్ట్ టు సీఎం...

తిరుపతి ఎంపీ స్థానం నుంచి సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి తో నేరుగా సంబంధాలు కలిగిన సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో పట్టుతోపాటు అందరితో తలలో నాలుగు మెలగడమే ఎంపీ గురుమూర్తికి ఉన్న ప్లస్ పాయింట్. కూటమి నుంచి బిజెపి అభ్యర్థిగా వరప్రసాదరావు పోటీ చేస్తున్నారు. గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఈయనకు వైఎస్ఆర్సిపి మళ్లీ అవకాశం ఇవ్వలేదు. ఈయనపై అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సిపి కి లభిస్తుందని భావిస్తున్నారు.

రాజంపేట ఎంపీ స్థానం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మూడోసారి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వారి కుటుంబానికి చిరకాల ప్రత్యర్థి, బిజెపి అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తలపడుతున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కడప జిల్లాలోని ఎంపీ కేంద్రం రాజంపేట, రైల్వేకోడూరు, చిత్తూరు జిల్లా పీలేరు, మదనపల్లి ఓటర్లపై ఆశలు పెట్టుకున్నారు. ఇంకో 20 గంటల్లో ప్రారంభం కానున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఓటర్లు ఇలాంటి తీర్పు ఇవ్వనున్నారు అనేది వేచి చూద్దాం.

Read More
Next Story