2025 ప్రారంభంలోనే ఇస్రో చరిత్రలో మూడు రికార్డులు నమోదయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో ప్రయోగించిన మొదటి వాహకనౌక. 'నావిక్' Navigation with Indian Constellation (NavIC) కావడం గమనార్హం. పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో తయారుచేసిన Geosynchronous Satellite Launch Vehicle (GSLV-F-15 NVS-02) రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయింది. శ్రీహరికోట నుంచి 100వ రాకెట్ ప్రయోగంతో ఇస్రో చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. భారత్ ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపింది. అంతేకాకుండా ఇస్రో చైర్మన్ గా నారాయణన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి ప్రయోగం కావడం గమనార్హం.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో తయారు చేసిన 'నావిక్' (NAVIK) GSLV-F-15 NVS-02 రాకెట్ ఉదయం 6.23 గంటల 2,500 కిలోల బరువు ఉన్న వాహకనౌకను విజయవంతంగా నింగిలోకి తీసుకుని వెళ్లింది. నావిక్ విజయవంతంతో అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త అధ్యాయానికి ఇస్రో చెరగని సంతకం చేసింది. ఈ ప్రయోగంతో శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో శాస్త్రవేత్తలతో పాటు వేలాది మంది ఉద్యోగుల్లో ఆనందం కట్టలు తెంచుకుంది. సంబరాలు. పరస్పర అభినందనలతో ఆనందం పంచుకున్నారు.
శ్రీహరికోట, సమీప ప్రాంతాలు. పులికాట్ సరస్సు పొడవునా సీఐఎస్ఎఫ్ జవాన్లు కళ్లలో ఒత్తులు వేసుకుని పహరా కాస్తున్నారు. చీమచిటుక్కుమన్నా అప్రమత్తం అవుతున్నారు. బుధవారం వేకువజామున అతిథులు కంట్రోల్ రూంలో ఉన్నారు. తిరుపతి, నెల్లూరు. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై తోపాటు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన జాతీయ మీడియా ప్రతినిధులు ఇస్రో సెంచురీ కొట్టే తీరును పరిశీలించడానికి వచ్చారు. అందరు ఆతృతగా నిరీక్షిస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది.
బంగాళాఖాతానికి సమీపంలోని దీవి వద్ద ఉన్న శ్రీహరికోటలో సుదూరంగా కనిపించని ప్రదేశం. మీడియా సెంటర్ కు కాస్త దూరంగానే ఉన్న సరుగుడు, యూకలిప్టస్ మొక్కల మధ్య నుంచి ఢమఢమ శబ్దాలు చేసుకుంటూ నింగిలోకి దూసుకుపోయిన వాహకనౌక మూడు స్టేజీలను నిర్ణీయ సమయంలో అధిగమించి, కక్ష్యలోకి ప్రవేశించింది.
100కు చేరిన రాకెట్ల పరుగు
1979 ఆగష్టు 10వ తేదీ శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి SLV 3E-1 రాకెట్ ద్వారా రోహిణి పేలోడ్ ని ప్రయోగించినా, సఫలం కాలేదు. అందులో లోటుపాట్లను సరిదిద్దడం ద్వారా ఆ తరువాత చేసిన రెండు ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. అలా శ్రీహరికోట నుంచి నిర్వహించిన 99 ప్రయోగాల్లో తొమ్మిది మాత్రమే విఫలం అయ్యాయి. తాజాగా బుధవారం ఇస్రో నిర్వహించిన ప్రయోగంలో GSLV-F-15 NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ మిషన్ ఆర్బిట్ (GTO) లోకి విజయవంతంగా పంపించడం ద్వారా సెంచరీ ఖాతాను ఇస్రో నమోదు చేసుకుంది.
ప్రపంచంలో నాలుగో దేశం
2025 డిసెంబర్ 30వ తేదీ ప్రయోగించిన స్పేడెక్స్ మిషన్ లో భాగంగా పీఎస్ఎల్వీ సీ 60 ఉపగ్రహ వాహకనౌకను విజయవంతం చేశారు. ఇది శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి పంపించిన రాకెట్లలో 99వ ప్రయోగం. తద్వారా అందులో పంపించిన ఉపకరణాలతో స్పేస్ స్టేషన్ నిర్మాణానికి మొదటి అడుగు వేసిన ఇస్రో శాస్ర్తవేత్తలు భారత్ ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలపిన విషయం తెలిసింది. అంటే రెండు శాటిలైట్లను డాకింగ్ చేయడం చేయడం ద్వారా రికార్డు సృష్టించారు. ఈ ప్రయోగంతో ప్రపంచంలో భారత్ నాల్గవ దేశంగా చరిత్రపుటల్లో నిలిచే విధంగా ఇస్రో శాస్ర్తవేత్తల కృషి ఫలించింది.
నావిక్ ప్రత్యేకతలు
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జీఎస్ఎల్వీ-ఎఫ్15 రకం 100వ రాకెట్ రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించింది. దీనిద్వారా ఎన్వీఎస్-02 ఉపగ్రహంతో దేశంలోని విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది. నావిక్ స్వదేశీ ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. ఇది 1500 కి.మీ. వరకు భారత భూభాగం వెలుపల కూడా సరిగ్గా, వేగంగా సమాచారా న్ని అందించగలుగుతుంది. "ఈ ప్రయోగంతో ఇస్రో భారత అంతరిక్ష పరిశోధనలో ప్రధానంగా నావిగేషన్, భద్రతా వ్యవస్థలకు కీలకంగా మారింది.
పూర్తి స్వదేశీ పరికరాలు..
దేశీయంగా ఇప్పటి వరకు నావిక్ వ్యవస్థ కోసం అనేక శాటిలైట్లను శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించింది. తాజాగా అంతరిక్షంలోకి పంపిన పాత పద్ధతులు అనుసరించినా, GSLV-F-15 NVS-02 నావిగేషన్ ఉపగ్రహంలో స్వదేశీ అటామిక్ క్లాక్ అమర్చడం ప్రత్యేకత అని ఇస్రో శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. గతంలో ఆ సాంకేతిక కోసం భారత్ రష్యాపై ఆధారపడేది. ప్రస్తుతం ఆ అవసరం లేకుండానే స్వదేశీయంగా అభివృద్ధి చేశారు. అంతేకాకుండా, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంలో నావిక్ రిసీవర్లు పెద్దవి కాకుండా, చాలా చిన్న చిప్ కార్డు సైజు పరికరాలు కూడా సిగ్నల్స్ అందుకోగలవని చెబుతున్నారు.