ఒక యుతిని ఇద్దరు యువకులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఏమీ తెలియనట్లు ఉన్నారు. వారు ఇంట్లో విడిసిన బట్టలు వారిని పోలీసులకు పట్టించాయి.


తెల్లవారు ఝామున 5.45 గంటలు. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంకు చెందిన పౌజుల సుచరిత (21) ఇంటి పక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌ పక్కన బహిర్భూమికి వెళ్లింది. మత్తు పదార్థాలు తీసుకుంటూ రైల్వే ట్రాక్‌పై నిత్యం తిరుగుతుండే జులాయిలు ఈ యువతిని చూశారు. ఒక్కతే రావడం, తెల్లవారు ఝాము కావడంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంది. ఇద్దరు యువకులు యువతిని పట్టుకుని చెట్లలోకి లాక్కెళ్లారు. ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చేశారు. ఆ తరువాత రాయితో తలపై మోది తల పగుల గొట్టారు. అనంతరం నోరు, ముక్కుపై చేతులు వేసి గట్టిగా నొక్కి పట్టి ఊరిరాడకుండా చేసి చంపారు. ఆ యువతి చనిపోయిందని నిర్థారించుకున్న ఈ యువకులు అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లారు. ఎవరి ఇంటి వద్ద వారు బట్టలు విడిచేసి ఒక స్నేహితుని సాయంతో చీరాలలోని ఒక లాడ్జిలో రూము అద్దెకు తీసుకుని మద్యం సేవిస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఈపూరుపాలెంకు చెందిన దేవరకొండ విజయ్, కారంకి మహేష్‌లు యువతిపై అత్యాచారం చేసి చంపగా దేవరకొండ శ్రీకాంత్‌ అనే మరో యువకుడు వారికి ఆశ్రయం ఇచ్చారు. శుక్రవారం తెల్లవారు ఝామున సంఘటన జరిగితే శనివారం పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. హత్యచేసిన ఇరువురు హంతకులు రైల్వే ట్రాక్‌ వద్దకు ఏమీ తెలియనట్లు వచ్చి.. పోలీసులు ఏమి చేస్తున్నరో చూశారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా తిరిగి వెళ్లిపోయారు.
హత్య సంఘటన ఎలా బయటకు వచ్చింది...
చీరాల రూరల్‌ మండలం ఈపూరుపాలెంలోని సీతారామపురానికి చెందిన పి వెంకటేశ్వర్లు, కామాక్షి దంపతులు నెల్లూరు జిల్లా గూడూరు నుంచి కొన్ని ఏళ్ల క్రితం ఈపూరుపాలెం వచ్చారు. చేనేత మగ్గం పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె సుచిరిత ఇంటర్మీడియట్‌ పూర్తి చేసింది. రెండేళ్లుగా ఇంటి వద్దనే టైలరింగ్‌ పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచింది. శుక్రవారం ఉదయం (తెల్లవారితే శనివారం) 5.45 గంటల సమయంలో ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్ద బహిర్భూమికి వెళ్లింది. సమయం గడుస్తున్నా కుమార్తె ఇంటికి రాకపోవడంతో అనుమానంతో తండ్రి వెంకటేశ్వర్లు అటు వెళ్లి చూడగా శరీరంపై దుస్తులు లేకుండా నిర్జీవంగా పడి ఉన్న కుమార్తె కనిపించింది. ఒక్కసారిగా భీతిల్లిపోయాడు. వెంటనే ఇంటికొచ్చి చూసిన సంఘటన భార్యతో పాటు కుటుంబ సభ్యులకు చెప్పారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయాన్ని పోలీసులకు చెప్పడంతో సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. యువతిని పాశవికంగా హతమార్చడంతో జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాచారం, హత్యగా కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని క్లూస్‌ టీం, డాగ్‌ స్వా్కడ్‌ బృందాలు పరిశీలించి పలు నమూనాలు సేకరించారు. క్లూస్‌ టీం యువతి చెప్పులు, వెంట తెచ్చుకున్న వాటర్‌ బాటిల్, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. అదే ప్రాంతంలో కొంత మంది యువకులు మద్యం సేవిస్తుంటారని, బహీర్భూమికి వెళ్లే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తింస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. గతంలో నేరచరిత్ర ఉన్న వారు, గంజాయి సేవించే వారు ఈ అఘాత్యానికి పాల్పడి ఉంటారనే కోణంలో పోలీసు దర్యాప్తు మొదలైంది.
స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
సంఘటన జరిగిందని పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. హోం మంత్రి వంగలపూడి అనితను వెంటనే సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులకు భరోసా ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. సీఎం ఆదేశం మేరకు అనిత శనివారం మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిసరాలు పరిశీలించారు. పోలీసుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. నిందితులను 48 గంటల్లో అరెస్ట్‌ చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియో చెక్‌ను హతురాలు తల్లిదండ్రులకు అందజేశారు. హోం మంత్రి ఆదేశాలతో మొత్తం పది ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.
హంతకులను ఎలా గుర్తించారు..
హత్యకు పాల్పడిన వారిని పోలీసులు గుర్తించడం సవాల్‌గా తీసుకున్నారు. ఎవరు చేసారో కనీసం క్లూ కూడా అక్కడ దొరకలేదు. ముందుగా పాత నేరస్తుల వివరాలు సేకరించారు. ఈపురుపాలెం సెంటర్స్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో వారు ఎవరైనా తిరిగినట్లు నమోదైందేమోనని పరిశీలించారు. ఒకటికి రెండు సార్లు ఇరువురు పాత నేరస్తులు తిరగటాన్ని గుర్తించిన పోలీసులు నేరుగా వారి ఇండ్ల వద్దకు వెళ్లారు. డాగ్‌ స్క్వాడ్‌ ద్వారా ఇంట్లో వారు విడిసి పక్కన పడేసిన బట్టలను గుర్తించారు. ఆ బట్టలపై మట్టి మరకలు, చిన్న రక్తపు మరకలు ఉండటంతో బట్టలను స్వాధీనం చేసుకున్నారు. వీరి రువురూ ఎక్కడున్నరని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దేవరకొండ విజయ్, కారంకి మహేష్‌లను ఏ1, ఏ2లుగా, వారికి ఆశ్రయమిచ్చిన దేవరకొండ శ్రీకాంత్‌ను ఏ3గా కేసు నమోదు చేసి శనివారం సాయంత్రం చీరాల బైపాస్‌ రోడ్డు వద్ద గల హాయ్‌ రెస్టారెంట్‌ సమీపంలోని వాడరేవు వెళ్లే రోడ్డులో ఉండటాన్ని గుర్తించి అరెస్ట్‌ చేశారు. సంఘటన జరిగిన 36 గంటల్లోనే వీరిని గుర్తించి అరెస్ట్‌ చేయడంతో పోలీసులు ప్రభుత్వ ప్రశంసలు అందుకున్నారు.
Next Story