పులిలా బతికిన జేసీ దివాకర్ రెడ్డి ఇలా అయిపోయారేంటి?
x

పులిలా బతికిన జేసీ దివాకర్ రెడ్డి ఇలా అయిపోయారేంటి?

ప్రజాజీవితానికి దూరమవటంవలనో ఏమో ఆయనలో ఠీవి, గాంభీర్యం తగ్గాయి. అయితే ఇటీవలి ఎన్నికల సమయంలో ఆయన ఇంటర్వ్యూలు చూస్తే ఆయన మైండ్ చురుకుగానే ఉన్నట్లు అనిపించింది.


ఒకనాడు ఠీవిగా, హుందాగా కనిపిస్తూ, నిర్భయంగా, నిర్మొహమాటంగా మనసులో మాట చెప్పటానికి జేసీ దివాకర్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్‌లాగా ఉండేవారు. అలాంటి దివాకర్ రెడ్డి తాజా ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది. ఆ ఫోటోలో ఆయన గుర్తుపట్టలేనివిధంగా కనిపిస్తున్నారు.

జూటూరు చిన దివాకర్ రెడ్డి అంటే ముక్కుసూటితనానికి, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటానికి మారుపేరు. ఆ రోజుల్లో ఆయన మీడియాతో మాట్లాడారంటే ఏదో ఒక సెన్సేషన్ ఉండేది. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటా తూటాలా పేలుతుండేది. వైఎస్ కుటుంబంలోనివారు అసలు ఒరిజినల్ రెడ్లే కాదని, తాము రాయలసీమ పెద్ద రెడ్లమని అనగలిగిన దమ్ము, ధైర్యం ఒక్క దివాకర్ రెడ్డి సొంతం.

దాదాపు నలభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా చేశారు. వైఎస్ మొదటి విడత ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఆయన క్యాబినెట్‌లో మంత్రిగా చేశారు. అయితే వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దివాకర్‌కు క్యాబినెట్‌లో చోటు ఇవ్వలేదు. అప్పటికే వైఎస్‌కు కాంగ్రెస్ హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయటంతో తమ ఫ్యామిలీకి చిరకాల శత్రువైన దివాకర్‌ను ఆయన పక్కకు పెట్టేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి తన వ్యాపారాలను, రాజకీయాలను కడపనుంచి అనంతపురానికి విస్తరించాలని ప్రయత్నించినప్పుడు జేసీ బ్రదర్స్ ఆయన ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఆ కారణంతోనే వైఎస్ తనకు అవకాశం వచ్చినప్పుడు జేసీ బ్రదర్స్‌ను నొక్కేశారు. అయితే ఆ తర్వాత కొద్ది కాలానికే వైఎస్ మరణించారు.

విభజన తర్వాత, 2014 ఎన్నికలకు ముందు జేసీ బ్రదర్స్ జగన్ పార్టీలో చేరదామని చూసినా, అతను అవకాశం ఇవ్వలేదు. దానితో వారు ఇద్దరూ తెలుగుదేశంలో చేరారు. దివాకర్ అనంతపురంనుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో టీడీపీతో పాటు జేసీ కుటుంబానికి కూడా భంగపాటు తప్పలేదు. అప్పటినుంచి జేసీ రాజకీయాలనుంచి కనుమరుగయ్యారు. ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

ప్రజాజీవితానికి దూరమవటంవలనో, రాజకీయాలలో చురుకుగా లేకపోవటంవలనో ఆయనలో గతంనాటి ఠీవి, గాంభీర్యం తగ్గాయి. అయితే ఇటీవలి ఎన్నికల సందర్భంగా ఒకటి రెండు టీవీ ఛానల్స్‌వారికి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఆయన మైండ్ చురుకుగానే ఉన్నట్లు అనిపించింది. కాబట్టి శారీరకంగా ఆరోగ్యం కొద్దిగా మందగించిఉండొచ్చుననిపిస్తోంది. ఏది ఏమైనా ఆయన వయస్సు ఇప్పుడు 79 సంవత్సరాలు. కాబట్టి ఆ మాత్రం ఆరోగ్యంగానైనా ఉండటం మంచి విషయమేనని చెప్పుకోవాలి. పైగా ఇటీవలి ఎన్నికల్లో ఆయన సోదరుడి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రిలో టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించటం, టీడీపీ అధికారంలోకి రావటంతో ఆయన ఫ్యామిలీకి తిరిగి మంచి రోజులు వచ్చాయి కనుక ఆరోగ్యం తిరిగి పుంజుకోవచ్చుకూడా.

Read More
Next Story