![Jagan 2.0 Formula | రాయలసీమ నుంచే జగన్ 2.0 ఫార్ములా Jagan 2.0 Formula | రాయలసీమ నుంచే జగన్ 2.0 ఫార్ములా](https://telangana.thefederal.com/h-upload/2025/02/07/511119-whatsapp-image-2025-02-07-at-115839-am11zon.webp)
Jagan 2.0 Formula | రాయలసీమ నుంచే 'జగన్ 2.0 ఫార్ములా'
పూర్వ వైఎస్ఆర్ విధేయులకు గాలం వేశారు. ఈ వ్యూహం ఎంతమేరకు ఫలిస్తుంది?!
పార్టీ పునర్నిర్మాణానికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. జిల్లాల వారీగా సమీక్షలు పూర్తి చేశారు. అధికారంలో ఉండగా యాక్టివ్ నేతలను జిల్లాలకు అధ్యక్షులుగా నియమించారు. ఇక నుంచి 2.0 ఫార్ములా అమలుతో జగన్ తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభానికి రంగం లోకి దిగారు. ఈ లక్ష్యసాధనలో తన తండ్రి దివంగత సీఎం వైఎస్ఆర్ విధేయవర్గాన్ని పార్టీలోకి తీసుకునే దిశగా అడుగుల వేశారు.
రాయలసీమ నుంచే అస్త్రంగా ఎంచుకున్న 2.0 ఫార్ములాతో వ్యూహం అమలు చేశారు. మొదటగా అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైసీపీలోకి తీసుకున్నారు. తాడేపల్లి వైఎస్ జగన్ నివాసంలో శైలజానాథ్ ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. 2.0 వ్యూహం అమలు చేయడానికి దారి తీసిన పరిస్థితులను ఒకసారి గమనిస్తే..
వైసీపీలో కల్లోలం
వైసీపీలో ట్రబుల్ షూటర్, నంబర్ టు గా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అస్త్ర సన్యాసం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు తెర తీసింది. ఎందుకంటే వైసిపి ప్రారంభానికి ముందే పార్టీలోనే కాకుండా, జగన్ తో పాటు విజయసాయి కూడా అక్రమాస్తుల కేసుల్లో నంబర్-2 నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
2009 ఎన్నికల తర్వాత ప్రధానంగా వైఎస్సార్ మరణం తర్వాత ఆయన కొడుకు జగన్ తో పాటు విజయసాయిరెడ్డి కూడా కేసుల్లో చిక్కుకుని జైలు జీవితం గడిపారు. ఆ కేసులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు వద్ద చౌకబియ్యం అక్రమరవాణా కేసుతో విజయసాయిరెడ్డి రాజకీయ ప్రస్థానానికి బ్రేక్ పడినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.. ఇందులో ఆయన అల్లుడు చిక్కుకోవడం విజయసాయి జీర్ణించుకోలేక, కేసుల భారంతో రాజకీయంగా అస్త్ర సన్యాసం చేశారనేది రాజకీయ వర్గాల్లో వినిపించే మాట. ఇలా ఉంటే, విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వైదొలగడం అనేది వైసీపీకి మేము కూడా పడలేదు. అలా అని ఆయనను బతిమాలే పరిస్థితి కూడా లేదని కూడా జగన్ విధేయవర్గం కుండబద్దలు కొట్టింది. దీంతో, జరిగిన నష్టాన్ని మరో రకంగా పూడ్చుకోవాలని జగన్ తన వ్యూహాన్ని అమలు చేయడానికి రంగంలోకి దిగినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
2.o లక్ష్యం ఏమిటి?
అధికారంలో ఉండగా జెండా మోసిన కార్యకర్తలను అటు ఉంచితే, ద్వితీయ శ్రేణి నేతలను కూడా వైఎస్. జగన్ నిర్లక్ష్యం చేశారు. అనేది ప్రధాన ఆరోపణ. దీనిపై పార్టీలోనే కాకుండా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం అయింది. ఇది వాస్తవమే అనే విషయం వైఎస్ తన మాటల ద్వారా తేటతెల్లం చేశారనడంలో సందేహం లేదు.
"కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తా. వారికి ఏ విధంగా అన్యాయం చేయాలో నాకు తెలుసు" అని చెప్పడం గమనించదగిన విషయం.
2024 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత పదవులు అనుభవించిన వారు చాలా మంది బయటకు వెళ్లిపోయారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్ "నాయకుడికి పోరాట స్ఫూర్తి ఉండాలి. పోరాడి మళ్లీ నిలబడాలి" అని చెప్పడం ద్వారా పార్టీకి పునరుత్తేజం కల్పించి, అధికారంలోకి రావడానికి శ్రమిస్తామని చెప్పకనే చెప్పారు. అందులో భాగంగానే
"వైసీపీ నుంచి వెళ్లిపోయిన నాయకులను ఏమాత్రం పట్టించుకునేది లేదు" అనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు.
ఆ లోటు భర్తీకి
పార్టీలో మళ్లీ ఉత్సాహం నింపడం. పటిష్టం చేయడానికి తన తండ్రి వైఎస్సార్ అభిమానులు పార్టీలోకి తీసుకురావడానికి వ్యూహం అమలుకు స్కెచ్ వేశారు. కాంగ్రెస్ పార్టీలో రాజ్యమేలుతున్న స్తబ్తత. ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో ఉన్న కాంగ్రెస్ నేతలను "వైఎస్ఆర్ సెంటిమెంట్" అస్త్రంతో వైసీపీలోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగానే మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబానికి అండగా నిలిచే రాయలసీమ నుంచే వైయస్ జగన్ తన కార్యాచరణ ప్రారంభించినట్లు కనిపిస్తోంది.
అనంతపురం జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ శుక్రవారం వైసీపీలో చేరారు. గతసార్వత్రిక ఎన్నికల ముందు నుంచి ఆయన వైసీపీలోకి వెళతారు. అనే ప్రచారం ముమ్మరంగా సాగుతున్నప్పటికీ, ఆదిశగా అడుగులు వేయని శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. కానీ, ఆయన జగన్ తో మాత్రం సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారనే విషయం ఇటీవల కర్నూలులో జరిగిన ఓ విహహ వేడుకలో కూడా బహిర్గంమైంది.
కాంగ్రెస్ లో నైరాశ్యం
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన దివంగత సీఎం వైఎస్సార్ కూతురు వైయస్ షర్మిల రెడ్డి ఎన్నికల తర్వాత మీడియాలో మాత్రమే కనిపిస్తున్నారు. కార్యక్రమాలు లేవు. పార్టీ లో నిస్తేజం ఆవరించింది. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ తో తనకు మొదటి నుంచి ఉన్న సంబంధాల నేపథ్యంలోనే శైలజానాథ్ వైసీపీలోకి వెళ్లడానికి అడుగులు వేయించినట్లే కనిపిస్తోంది.
ఇంకొందరు కూడా..
రాయలసీమలో శైలజానాథ్ తర్వాత దివంగత సీఎం వైఎస్సార్ తో పనిచేయడం, ఆయన ఆశీస్సులతో రాజకీయంగా ఎదిగిన నేతలను వైసీపీలోకి తీసుకురావడానికి తీవ్రస్థాయిలో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. అదే పరిస్థితి కోస్తా ప్రాంతంలో కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, వైఎస్ జగన్ తో ప్రయాణం సాగించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంచారు.
వైసిపి వర్గాలు మాత్రం "ఇ కొంతమంది కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు, నిస్తీజంగా ఉన్న సీనియర్ నాయకులు వైసిపిలోకి వస్తారు" అని చెప్పడం ద్వారా మైండ్ గేమ్ ఆడుతున్నారా? అనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది.
తండ్రి సహచరులను చేరదీసి...
అంటే మొత్తం మీద వైయస్ జగన్ 2.0 లో ఒకనాటి వైఎస్సార్ విధేయులు, అనుచరులతో పార్టీని బలోపేతం చేసుకునే దిశగా కార్యాచరణకు సిద్ధమయ్యారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. వైసిపి అధ్యక్షుడు జగన్ త్వరలోనే జిల్లాల పర్యటనకు రానున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమయంలో ప్రతి జిల్లాలో రెండు రోజులు మకాం వేయడం ద్వారా ద్వితీయ శ్రేణి నాయకులతో కూడా నేరుగా మాట్లాడడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తద్వారా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామనే సంకేతాలు ఇచ్చి పూర్వ వైభవాన్ని సాధించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రానున్న కాలంలో వైఎస్ జగన్ 2.0 ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది వేచి చూడాల్సిందే.
Next Story