
జగన్.. అమ్మనని కూడా చూడకుండా కోర్టుకు లాగావా?
వైఎస్ విజయమ్మ ఆవేదన ఇది. ఆస్తుల కొట్లాటలో తనను కోర్టుకు లాగడం సరికాదన్నారు. ఈమేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కి ఆమె అఫిడవిట్ ఇచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఆయన సోదరి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వ్యవహారం ముదిరిపాకాన పడింది. సరస్వతి పవర్ కార్పొరేషన్ లో వాటాలు (షేర్లు) అన్నీ తనవేనంటూ వైఎస్ విజయమ్మ వాదిస్తున్నారు. ఈమేరకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్‌కు నివేదించారు. ఈ ఆస్తుల వివాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి భార్య విజయమ్మ కూడా కుమార్తె షర్మిల వైపే నిలిచినట్టు తెలుస్తోంది. "జగన్, భారతిలకు సరస్వతిలో ఉన్న వాటాలన్నీ నా పేరిట బదిలీ అయ్యాయి. ప్రస్తుతం వారికి వాటాలేవీ లేవు. అందువల్ల ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేసే అర్హత వారికి లేదు"అంటున్నారు వైఎస్ విజయమ్మ.
అసలేమిటీ వివాదం...
వైఎస్ కుటుంబానికి సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో వైఎస్ కుటుంబసభ్యులందరికీ వాటాలు ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ కంపెనీ షేర్లన్నీ తనవేనంటూ వైఎస్ జగన్, ఆయన భార్య భారతీ వాదిస్తున్నారు. ఇది సమంజసం కాదు. వారికి ఈ ఆస్తులతో సంబంధం లేదు' అన్నారు విజయమ్మ. ఈమేరకు జాతీయ కంపెనీ లా ట్రెబ్యునల్ (ఎన్సీఎల్టీ)కి లేఖ రాశారు. దీనిపై 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు అన్నా, చెల్లెళ్ల మధ్య పెద్ద గొడవే సాగింది. ఇప్పుడు తాజాగా వైఎస్ విజయమ్మ ట్రెబ్యునల్ కి ఓ అఫిడవిట్ ఇచ్చారు.
దాని ప్రకారం..
'సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల బదలాయింపులోకి షర్మిలను అనవసరంగా లాగుతున్నారు. జగన్, భారతిరెడ్డి ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్‌కు వైఎస్ విజయమ్మ నివేదించారు. సరస్వతి లిమిటెడ్‌తో గానీ, గిఫ్ట్‌డీడ్‌తో గానీ షర్మిలకు సంబంధం లేదని, అయినా తన కుమారుడు జగన్, కోడలు భారతిరెడ్డి.. షర్మిలను వాటాల బదలాయింపు వివాదంలోకి లాగుతున్నారన్నారు. జగన్‌కు, షర్మిలకు ఉన్న ఆస్తి వివాదాలను ఇక్కడ తీసుకురావడం ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టించడానికేనన్నారు. సరస్వతి వాటాలపై సర్వహక్కులు తనవేనని, వారిద్దరి ఆస్తి వివాదాలతో నన్ను కోర్టులో నిలబెట్టారని పేర్కొన్నారు. పిల్లల మధ్య వివాదంతో ఏ తల్లీ కోరుకోని విధంగా నిస్సహాయంగా కోర్టులో నిలబడాల్సి వచ్చిందని.. తనను ఇంత ఆవేదనకు గురిచేయడం జగన్, భారతిలకు సరికాదన్నారు.
సరస్వతి వాటాల కొనుగోలు, గిఫ్ట్‌డీడ్ ద్వారా వచ్చిన వాటాలన్నీ చట్టప్రకారం తన పేరిట బదలాయించారని, షర్మిల భవిష్యత్తు ప్రయోజనాల కోసం గిఫ్ట్‌డీడ్‌ను తనపై విశ్వాసంతో చేసి ఇచ్చాననడం అవాస్తవమని పేర్కొన్నారు. ప్రస్తుతం సరస్వతిలో జగన్, భారతిలకు వాటాలేమీ లేవని, ఇందులో 99.75% వాటాలు తనవేనని విజయమ్మ స్పష్టం చేశారు. కుటుంబవివాద అవగాహన పత్రం ఆధారంగా కంపెనీ చట్టం కింద జగన్, భారతిరెడ్డి, క్లాసిక్ రియాల్టీలు వేసిన పిటిషన్లు చెల్లుబాటు కావని, భారీ జరిమానాతో కొట్టేయాలని కోరారు. సరస్వతిలో అనుమతి లేకుండా జరిగిన వాటాల బదలాయింపును నిలిపివేయాలని, వాటాదారుల రిజిస్టర్‌లో పేర్లను మార్చి తన వాటాను పునరుద్ధరించాలని కోరుతూ జగన్, భారతిరెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌లో ప్రతివాదిగా ఉన్న విజయమ్మ కౌంటరు దాఖలు చేశారు.
ఇతర వివరాలు...
జగన్‌కు, షర్మిలకు మధ్య ఉన్న రాజకీయ, వ్యక్తిగత వివాదాల కారణంగానే ఈ పిటిషన్ దాఖలుచేశారని విజయమ్మ పేర్కొన్నారు. ఇందులో భాగంగా సెక్షన్ 59ను తప్పుగా అన్వయిస్తున్నారని తెలిపారు. జగన్‌కు, షర్మిలకు విభేదాలున్నా ఈ కంపెనీ పిటిషన్‌కు దాంతో సంబంధం లేదన్నారు. 'చట్టప్రకారం కార్పొరేట్, వాటాదారుల హక్కులకు సంబంధించిన సెక్షన్ 59ను వ్యక్తిగత కక్ష సాధింపులకు వినియోగించరాదు. సరస్వతి సంస్థలోని 46.71 లక్షల వాటాలను సండూర్ కంపెనీ, 71.50 లక్షల వాటాలను క్లాసిక్ రియాల్టీ తనకు విక్రయించడంతో మొత్తం 1.21 కోట్ల ఈక్విటీ వాటాలతో 48.99% దక్కించుకున్నాను. 2021 జులై 26న జగన్, భారతి రెండు గిఫ్ట్‌డీడ్‌లు తనకు ఇచ్చారు. వీటి ప్రకారం సరస్వతిలో జగన్‌కు చెందిన 74.26లక్షల వాటాలు, భారతికి చెందిన 40.50 లక్షల వాటాలను తనకు బదిలీచేసింది. గిఫ్ట్‌డీడ్‌లో వాటా సర్టిఫికెట్ల ఫోలియో నంబర్లను కూడా పేర్కొన్నారు' అని చెప్పారు.
తనతో క్లాసిక్ రియాల్టీ 2021 జులై 23న వాటా కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఈ వ్యవహారంలో క్లాసిక్ రియాల్టీ, సరస్వతి పవర్, తాను మాత్రమే పార్టీలుగా ఉంటామన్నారు. సరస్వతి పవర్‌లోని 11.37 లక్షల వాటాలను రూ.3.07 కోట్లకు క్లాసిక్ రియాల్టీ తనకు బదిలీ చేసిందన్నారు. వాటాలను తన పేరుతో బదలాయించాలంటూ గత ఏడాది జూన్ 14న సరస్వతి కంపెనీకి రాసిన లేఖ ఆధారంగా అన్ని అంశాలనూ పరిశీలించి తనపేరుతో బదలాయించిందని తెలిపారు. ఈ విషయాన్ని గత ఏడాది జులై 2న బోర్డు సమావేశంలో ఉంచగా డైరెక్టర్లు బదలాయింపునకు ఆమోదం తెలిపారన్నారు. దీంతో కంపెనీ సభ్యుల జాబితాలో తన పేరు నమోదైందని చెప్పారు. వాటాల బదలాయింపు, తన హక్కుల గురించి ప్రశ్నించడానికి కారణాలు లేవన్నారు. ఇప్పుడు కంపెనీలో 99.75% వాటా పొందానని స్పష్టం చేశారు. చట్టబద్ధంగా బదలాయింపు జరిగిన వాటాలపై ప్రస్తుత పిటిషన్ చట్టప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని.. వ్యక్తిగత, రాజకీయ వివాదాలను కార్పొరేట్ వ్యవహారాల్లోకి లాగడం చట్టవిరుద్ధమే కాకుండా సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు.
పిటిషన్ వేసే అర్హత జగన్‌కు లేదు...
జగన్, భారతిలకు సరస్వతిలో ఉన్న వాటాలన్నీ తన పేర బదిలీ కావడంతో ప్రస్తుతం వారికి వాటాలేవీ లేవని పేర్కొన్నారు. అందువల్ల ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేసే అర్హత వారికి లేదని పేర్కొన్నారు. జగన్‌కు, షర్మిలకు చెందిన ఆస్తి వివాదాలతో ఈ పిటిషన్‌కు సంబంధం లేదన్నారు. వారిద్దరి మధ్య విభేదాలు తన హక్కులపై ప్రభావం చూపవని స్పష్టం చేశారు. షర్మిల ప్రయోజనాల కోసం వాటాలను తన వద్ద ఉంచానని జగన్ చెప్పడం అవాస్తవమని తెలిపారు. గిఫ్ట్‌డీడ్‌లో షర్మిల ప్రయోజనాల కోసం అంటూ ఎలాంటి షరతులు లేవని, అవాస్తవాలతో ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
కోర్టులో తేలిన తర్వాత గిఫ్ట్‌డీడ్ అమల్లోకి వస్తుందనడమూ అవాస్తవమేనని, దీనికి సంబంధించి తమ మధ్య ఎలాంటి అవగాహన లేదన్నారు. స్వచ్ఛందంగా గిఫ్ట్‌డీడ్‌లు అమలుచేసి ఇప్పుడు లేని షరతులు పెట్టడం చెల్లుబాటు కాదన్నారు. భవిష్యత్తు తేదీల్లో షర్మిల కోసం వాటాలను బదిలీ చేశామనడం, వాటాల పత్రాలను ఇవ్వలేదనడం కూడా వాస్తవం కాదని తెలిపారు. వాటాపత్రాలు కనిపించకపోవడంతో కంపెనీకి బాండ్ సమర్పించి చట్టప్రకారం తన పేర బదలాయించుకున్నానని చెప్పారు. సంబంధం లేని అవగాహన ఒప్పందాన్ని తెరపైకి తీసుకువచ్చి ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
గుంటూరు జిల్లాలోని ఆస్తులపైనా...
ఆస్తుల కేసుల్లో వాటాలపై యథాతథస్థితి ఉందని జగన్ చెబుతున్నారని, అది అవాస్తవమని.. గుంటూరు జిల్లాలోని ఆస్తులపై ఆ ఉత్తర్వులున్నాయని చెప్పారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసులో గుంటూరులో సరస్వతి ఆస్తుల జప్తు జరిగిందని, అంతేగానీ వాటాలను ఈడీ జప్తు చేయలేదన్నారు. జగన్ చెబుతున్నట్లు యథాతథస్థితి ఉత్తర్వులుంటే తనకు గిఫ్ట్‌డీడ్ ఎలా చేసి ఇస్తారు, వాటాల విక్రయ ఒప్పందం ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. అప్పుడు లేని కోర్టు ఉత్తర్వులను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి వాటాల బదలాయింపును రద్దు చేయాలనడం సరికాదన్నారు.
పిటిషన్ విచారణార్హం కాదు...
వాటాల బదలాయింపు వ్యవహారంలో జగన్, భారతి దాఖలుచేసిన పిటిషన్ విచారణార్హం కాదని తెలిపారు. జగన్ తన కుటుంబ వివాదాల పరిష్కారంలో భాగంగా కంపెనీ చట్టంలోని సెక్షన్ 59 కింద పిటిషన్ దాఖలుచేశారని, కుటుంబ వివాదాల పరిష్కారానికి ఈ సెక్షన్ పరిధిని విస్తరించరాదన్నారు. 2019 ఆగస్టు 31న కుదిరిన అవగాహన ఒప్పందం ఆధారంగా జగన్ పిటిషన్ దాఖలుచేశారని, కుటుంబ వివాదం పరిష్కారంలో భాగంగా అవగాహన ఒప్పందం కుదిరిందని తెలిపారు. కుటుంబ వివాదంలో ఏదైనా భిన్నాభిప్రాయం వ్యక్తమైతే కంపెనీ చట్టం కింద పరిష్కరించే పరిధి ట్రైబ్యునల్‌కు ఉండదన్నారు. 2021 జులై 26 నాటి దానపత్రం ప్రకారం సరస్వతి వాటాలకు పూర్తిస్థాయి యజమాని తానేనని పేర్కొన్నారు. జగన్ పిటిషన్ నిబంధనలకు విరుద్ధమని విజయమ్మ ట్రిబ్యునల్ కి తెలిపారు. జగన్‌కు చట్టపరమైన హక్కులు ఉన్నప్పుడే సెక్షన్ 59 ప్రకారం వాటాలను సవరించాలని కోరవచ్చని, ఒక్కసారి వాటాలపై యాజమాన్య హక్కులను బదిలీ చేశాక జగన్‌కు చట్టపరమైన హక్కులేవీ ఉండవన్నారు. వాస్తవ యజమానికి వ్యతిరేకంగా సెక్షన్ 59ను చట్టవిరుద్ధంగా వినియోగించలేరని, అందువల్ల ఈ పిటిషన్ విచారణార్హం కాదని, జరిమానాతో కొట్టేయాలని విజయమ్మ కోరారు.
Next Story