ప్రతిపక్ష హోదాపై జగన్‌ చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్‌గా మారాయి. 18 మంది సభ్యులున్నా ప్రతిపక్ష హోదా టీడీపీకి దక్కదన్నజగన్‌ నేడు 11 సభ్యులున్నతనకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు.


వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో తమ పార్టీకి ప్రతిపక్ష హోదాను కల్పించాలని ఇటీవల అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడుకి లేఖ రాసిన నేపథ్యంలో.. ఇది వరకు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టీడీపీకి ప్రతిపక్ష హాదాపై సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో తాజాగా చర్చ నీయాంశంగా మారాయి. అంతేకాకుండా జగన్‌ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో జగన్‌ ఏమి మాట్లాడారంటే.. చంద్రబాబు నాయుడుకు 23 మంది శాసన సభ్యులు ఉన్నారు. వారిలో ఒక ఐదుగురిని లాగేస్తే ఆయనకు 17 మందో.. 18 మందో శాసన సభ్యులు ఉంటారు. అప్పుడు చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు.. అలా టీడీపీ శాసన సభ్యులను లాగేద్దామని తన పార్టీకి చెందిన కొందరు నేతలు అన్నారని, అలా ఐదుగురు టీడీపీ సభ్యులను లాగేసి ఉంటే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండేది కాదు.. దీంతో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఆ సీట్లో కూర్చుని ఉండే వారు కాదు అని అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన నేతగా, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నేతగా పేరున్న చంద్రబాబు నాయుడుని, టీడీపీని కావాలనే అసెంబ్లీలో అవమాన పరిచే విధంగా జగన్‌ వ్యాఖ్యలు చేశారనే విమర్శలు అటు టీడీపీ శ్రేణుల్లోను, ఇతర రాజకీయ వర్గాల్లోను వెల్లువెత్తాయి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుని, టీడీపీని నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవమానపరచడం అటుంచితే ప్రతిపక్ష హోదా అంశం గురించి జగన్‌ చెప్పిన లెక్కల అంశం తాజాగా చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిండు సభలో చెప్పిన ప్రకారం చూస్తే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 అసెంబ్లీ స్థానాల్లో నెగ్గింది. అంటే 23 మంది టీడీపీ శాసన సభ్యులు ఉన్నారు. అంటే అసెంబ్లీలో టీడీపీ సంఖ్యా బలం 23. వీరిలో ఐదుగురు టీడీపీ సభ్యులను నాటి అధికార పక్షం వైఎస్‌ఆర్‌సీపీ జగన్‌ ప్రభుత్వం లాగేసుకుంటే ఇక తెలుగుదేశం పార్టీకి కానీ, చంద్రబాబుకు కానీ మిగిలేది 18 మంది శాసన సభ్యులు. అంటే ఐదుగురు పోతే తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా ఉండదు అనేది నాడు అసెంబ్లీలో సీఎం హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి చెప్పకనే చెప్పారు. అసెంబ్లీలో 18 మంది ఉన్న తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా ఉండదని, ఆ పార్టీ నేత చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష నేత హోదా ఉండదని కాస్త బలంగానే నాడు అసెంబ్లీలో సీఎం హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.
అంటే శాసనసభలోని మొత్తం సీట్లలో 10 శాతం సీట్లు వచ్చి ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది వస్తుందనేది జగన్‌మోహన్‌రెడ్డి ఉద్దేశం. ఇదే సూత్రం ప్రకారం.. నాడు జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన లెక్కల ప్రకారం ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, ఆ పార్టీ నేత జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎలా వస్తుందనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌సీపీకి 11 మంది మాత్రమే సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ విషయంలో జగన్‌ చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే జగన్‌కు ప్రస్తుతం సంఖ్యా బలం ఇంకా తక్కువ ఉంది. నాడు 18 మంది సభ్యులు ఉన్నా టీడీపీకీ ప్రతిపక్ష హోదా దక్కదని చెప్పిన జగన్, నేడు 11 మంది సభ్యులు కలిగి ఉన్న వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని అనుకుంటున్నారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది.
మంగళవారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాశారు.
ప్రతిపక్ష హోదా కల్పించాలని స్పీకర్‌ను కోరారు. ప్రధాన పతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు సాధించాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. విపక్ష పార్టీల్లో ఎవరికి ఎక్కువ సీట్లుంటే వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదాపై వైఎస్‌ జగన్‌ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడుకు రాసిన లేఖలోని అంశాలు, ప్రతిపక్ష హోదాపై గతంలో గన్‌మోహన్‌రెడ్డి చెప్పిన అంశాలను పోల్చుతూ రాజకీయ వర్గాల్లో వాడీ వేడీ చర్చలు సాగుతున్నాయి.
Next Story