ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదని స్పష్టమైంది. తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వైఎస్సార్‌సీపీని ఓటర్లు చావు దెబ్బకొట్టారు. కేవలం 11 సీట్లు మాత్రమే వైఎస్సార్‌సీపీకి ఇచ్చారు. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అయితే తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి వైఎస్సార్‌సీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే లేఖ రాశారు. ఆ లేఖపై తెలుగుదేశం పార్టీ కానీ, స్పీకర్ కానీ స్పందించలేదు.
హోదా ఇచ్చే అవకాశం లేదు
నేను అనుకుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. అంటూ గత అసెంబ్లీలో మాజీ సీఎం వైఎస్ జగన్ చాలా సార్లు తెలుగుదేశం పార్టీని హేళన చేశారు. అది వారు మరిచి పోయినట్లు లేదు. అందుకే ప్రతిపక్ష హోదా విషయంలో ఏ విషయం చెప్పలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? వద్దా? అనే విషయమై తెలుగుదేశం పార్టీలో ఏకపక్ష నిర్ణయం వెలుబుచ్చినట్లు సమాచారం. జగన్‌ను అలా ఉంచితేనే మంచిదని, జనం ఏ తీర్పు ఇచ్చారో ఈ తీర్పు ప్రకారం ప్రతిపక్ష హోదా లేకుండా ఉంటేనే మంచిదనే అభిప్రాయాన్ని పార్టీ నాయకులంతా వ్యక్తం చేసినట్లు సమాచారం. అందువల్ల వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదు.
రెండో పెద్ద పార్టీని ప్రతిపక్షంగా గుర్తించ వచ్చు..
అసెంబ్లీలో రెండో పెద్ద పార్టీగా జనసేన ఉంది. అధికార పక్ష కూటమిలో ఉండటం వల్ల ప్రతిపక్షం కిందకు జనసేన వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వంలో మంత్రులు, ఉపముఖ్యమంత్రిగా జనసేన వారు ఉన్నారు. కేంద్రంలోని ఎన్‌డీఏ కూటమిలో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో కూడా కూటమిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అందువల్ల వైఎస్సార్‌సీపీ మాత్రమే ప్రతిపక్షంగా చెప్పాల్సి ఉంటుంది. అందుకే వైఎస్ జగన్ తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే...
ప్రతిపక్ష హోదా వైఎస్సార్‌సీపీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనుకుకంటే ఇవ్వొచ్చు. చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షం ఎన్ని సీట్లు గెలిచినా సీట్ల సంఖ్యతో సంబంధం లేకుండా ఇవ్వొచ్చని, గతంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంలోనూ ఈ విధమైన అవకాశాలు కల్పించారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే కొన్ని సౌకర్యాలు ప్రతిపక్ష పార్టీ నేతకు వస్తాయి. ప్రస్తుతం జగన్‌కు ప్రతిపక్షనేత హోదా లేనందున ఆ సౌకర్యాలు లేకుండా పోయాయి. రాజ్యాంగంలో ఎక్కడా ప్రతిపక్ష నేత హోదా గురించిన ప్రస్తావన లేకపోయినప్పటికీ చట్టంలో మాత్రం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
2014 నుంచి ఏపీలో రాజకీయ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తనను జైలు పాలు చేయడంలో చంద్రబాబునాయుడు హస్తం కూడా వుందని పలు సార్లు మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టిన తరువాత చాలా వరకు కక్షపూరిత రాజకీయాల వైపు చూసింది. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులను ఎక్కడికక్కడ కట్టడి చేశారు. చివరకు చంద్రబాబును అరెస్ట్ కూడా చేయాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీల మధ్య, వ్యక్తుల మధ్య సానుకూల సంబంధాలు లేవని చెప్పాలి. కేవలం 11 సీట్లకు పరిమితమైన వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలనే ఆలోచనలో టీడీపీ ఉంది. పార్టీ నుంచి కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత రావడం వల్ల ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశమే లేదని కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ అన్నారు.
Next Story