కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూరం చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చుట్టూ కుటుంబం ఉంది. ఎందుకిలా.. ఏమి జరుగుతోంది.


రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. అయితే కుటుంబంలో గెలుపు ఓటములు ఉంటాయా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా తల్లిని, చెల్లిని, ఇతర బంధువులను ఎందుకు దూరం చేసుకున్నారనేది చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విషయాన్ని నిత్యం చర్చించుకుంటున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చాలా మంది బంధువులు, తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల భవిష్యత్ పై ఎన్నో ఆశలు పెంచుకున్నారు. షర్మిల తనకు రాజ్యసభ మా అన్న ఇస్తారని భావించారు. నేగా రాజ్య సభ ఇవ్వాలని అన్నను అడగక పోయినా నాకు ఏమి ఇవ్వాలో అన్నకు తెలుసు అనే ధోరణిలో షర్మిల ఉన్నారు. జగన్ మనసులో మాత్రం అటువంటి ఆలోచన ఏమీ లేదు.

జగన్ ఏమని భావించారంటే ఒకే జనరేషన్ నుంచి ఒకే ఇంట్లో వారు రాజకీయాల్లో ఉండటం మంచిది కాదనుకున్నారు. అందుకే షర్మిలకు ఏ పదవీ ఇవ్వలేదు. దీంతో తాను పార్టీని బతికించడం కోసం ఎంతో చేశాను. అయినా నన్ను పక్కన బెట్టారు. అధికారం వచ్చాక అన్న మారిపోయారు. నియంత పోకడలు ఎక్కువయ్యాయని చాలా సార్లు షర్మిల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో వైఎస్ జగన్ ఒకే జనరేషన్ నుంచి కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి వద్దనుకున్నాను. అందుకే షర్మిలకు రాజకీయంగా మంచిదో ఆలోచించలేదని అన్నారు. అంటే చెల్లెలుకు పదవి కావాలనే ఆలోచన ఉంది. అన్నకు మాత్రం ఇంట్లో ఎవ్వరికీ ఏ పదవీ ఇవ్వొద్దని భావించారు. ఇదే కుటుంబంలోని వారి మధ్య స్పర్థలకు దారి తీసింది.

ఒకే జనరేషన్ నుంచి ఒకేసారి కుటుంబంలోని వారు రాజకీయాల్లో ఒక్కరు తప్ప ఎక్కువ మంది ఉండకూడదని భావించారు. అంతవరకు బాగానే ఉన్నా వైఎస్ విజయమ్మ జగన్ జనరేషన్ కాదు కదా. ఆమెను రాజ్యసభకు పంపొచ్చు. లేదా ఎమ్మెల్సీగా పెద్దల సభకు పంపొచ్చు. కానీ ఆ ఆలోచన కూడా జగన్ చేయలేదు. విజయమ్మ వైఎస్ఆర్ మరణం తరువాత శాసన సభ్యురాలుగా అసెంబ్లీలో అడుగు పెట్టి హుందాగా వ్యవహరించారు. బాగా మాట్లాడారు. కానీ తల్లిని కూడా జగన్ పక్కన బెట్టారు. ఇవి షర్మిల, ఆమె భర్త అనిల్ కు నచ్చలేదు. అందుకే వారు దూరంగా ఉండాలనుకున్నారు. తెలంగాణలో వైఎస్సార్ పార్టీ పెట్టి సక్సెస్ కాలేక పోయారు. కాంగ్రెస్ ఆహ్వానం మేరకు షర్మిల కాంగ్రెస్ లో చేరి వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసింది. పైగా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయవద్దని, ఓడించాలని రాష్ట్రంలో తిరిగి ప్రచారం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు చుట్టూ తన కుటుంబం ఉంది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం నారా భువనేశ్వరి కూడా సభలు, సమావేశాలు పెట్టి ఓటర్లను ఆకట్టుకున్నారు. ఇక లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. నారా బ్రాహ్మణి కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రచారం చేశారు. ప్రత్యేకించి తన భర్త లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో డోర్ టు డోర్ తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. తిరుమల దర్శనానికి కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్లారు. చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ చంద్రబాబు వెన్నంటే ఉన్నారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా బాలకృష్ణ మూడో సారి గెలిచారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ చంద్రబాబుతోనే ఉన్నారు. దగ్గుబాటి పురందేశ్వరి బిజెపి అయినా చంద్రబాబుతో సన్నిహితంగానే ఉన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరావు కూడా చంద్రబాబుతో టచ్ లోనే ఉండటం విశేషం. ఇక చంద్రబాబు బంధువులు చాలా మంది బాబు కుటుంబానికి సన్నిహితంగానే ఉంటున్నారు. ఒకప్పుడు చంద్రబాబు కుటుంబాన్ని పట్టించుకునే వారు కాదనే ప్రచారం సాగింది. కానీ ఇటీవలి కాలంలో కుటుంబ సభ్యులతోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అప్పుడప్పుడూ మనుమడితో ఆడుకునేందుకు కూడా సమయం కేటాయిస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మాజీ ముఖ్యమంత్రి జగన్ కు మధ్య ఉన్న వ్యత్యాసాలను పక్కన బెడితే ప్రస్తుతం కుటుంబ సభ్యులందరినీ దూరం చేసుకున్న జాబితాలో వైఎస్ జగన్ ఉండగా, కుటుంబంతోనే కలిసి ఉంటున్న జాబితాలో చంద్రబాబు ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. జగన్ మాత్రం ఆ పనిచేయలేదు. నా కుటుంబం అంటే నేను, నా భార్య, పిల్లలు అన్నారు.

Next Story