నిబద్దతో ప్రజలకు సేవలు అందించారు. ప్రభుత్వ పెద్దల చేత, ప్రజల చేత శభాష్‌ అనిపించుకున్నారు. కానీ సర్వీసు ఉన్నప్పటికీ వీఆర్‌ఎస్‌ తీసుకోవలసి వచ్చింది. ఎందుకలా జరిగింది?


వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో నిబద్దతో పని చేసిన పలువురు అధికారులు ఆయన ముద్ర పడటంతో సర్వీసును అర్థాంతరంగా ముగించాల్సి వచ్చిందని అటు అధికార వర్గాలు, ఇటు రాజకీయ శ్రేణుల్లోను చర్చనీయాంశంగా మారింది. పూర్తి స్థాయిలో తమ సర్వీసులో కొనసాగకుండా అర్థాంతరంగా ముగిసి పోయింది. నిజాయితీతో, నిబద్దతో పని చేసి చివరికి అపవాదులు మూటగట్టుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని చర్చించుకుంటున్నారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో గౌతమ్‌ సవాంగ్‌ ఓ వెలుగు వెలిగారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే సవాంగ్‌ను పోలీస్‌ శాఖలో అత్యున్నతమైన డీజీపీ స్థానంలో కూర్చో బెట్టారు. అప్పటి నుంచి జగన్‌ ప్రభుత్వానికి అనుకూలంగానే పని చేస్తూ వచ్చారు. అలా 2019 నుంచి 2022 వరకు రెండున్నర ఏళ్లకుపైగా డీజీపీగా పనిచేశారు. నమ్మకంగానే పని చేసినప్పటికీ జగన్‌కు, సవాంగ్‌కు గ్యాప్‌ పెరిగింది. దీంతో ఆయనను డీజీపీ బాధ్యతల నుంచి తప్పించాలని జగన్‌ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిని కొత్త డీజీపీగా నియమించిన జగన్, జీఏడీకి రిపోర్టు చేయాలని సవాంగ్‌కు ఆదేశాలు అందాయి. ఒక కేసు విషయంలో జగన్‌ అసంతృప్తి కారణంగానే సవాంగ్‌ను డీజీపీ నుంచి సాగనంపారనే విమర్శలు అప్పట్లో వినిపించాయి. జగన్‌ చెప్పినట్టు పని చేసినా డీజీపీ నుంచి తొలగించారనే అసంతృప్తికి గురైన ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లాలని చేసిన ప్రయత్నాలు సైతం ఫలప్రదం కాలేదు. దీంతో సవాంగ్‌కు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్‌సీ) చైర్మన్‌గా జగన్‌ ఆఫర్‌ ఇచ్చారు. ఫలితంగా తనకు 17 నెలల సర్వీసు ఉన్నప్పటికీ ఐపీఎస్‌కు రాజీనామా చేసి ఏపీపీఎస్సీ చైర్మన్‌గా సవాంగ్‌ చేరి పోయారు. అంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా ప్రభుత్వం మారడంతో అసలు కథ మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సవాంగ్‌ సర్వీసుకు రోజులు లెక్క బెట్టుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జగన్‌ అధికారంలో ఉండగా ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అమరావతి పర్యట చేసినప్పుడు చోటు చేసుకున్న రాళ్ల దాడి సంఘటనను సవాంగ్‌ సమర్థిస్తూ మాట్లాడటం వివాదాస్పదమైంది. ప్రజలు నిరసనలు తెలపడానికే రాళ్ల దాడి చేశారని సవాంగ్‌ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు సీరియస్‌గానే తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు అనుకున్నారో ఏమో కానీ తన చైర్మన్‌ పదవికి రాజీనామా చేసేశారు.
ఒక ప్రభుత్వానికి కొమ్ము కాయడం వల్లే 17 నెలల ఐపీఎస్‌ సర్వీసును ఒదులుకున్న సవాంగ్‌ ఏపీపీఎస్సీ చైర్మన్‌గా జూలై 14 వరకు పదవీ కాలం ఉండగానే జూలై 4న తన చైర్మన్‌ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందనే చర్చ సాగుతోంది. 1986వ ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన సవాంగ్‌కు హానెస్ట్‌ అధికారిగా మంచి పేరుంది. చివరికి జగన్‌ ముద్రతో తన పదవీ కాలంతో ముగించాల్సి వచ్చింది.
ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ అహ్మద్‌ కూడా తనకు ఇంకా సర్వీసు ఉండగానే తన ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేశారు. ఇంతియాజ్‌కు 2025 మే 31 వరకు సర్వీసు ఉన్నా, జగన్‌ పిలుపు మేరకు ఎన్నికలకు ముందు తన పదవికి రాజీనామా చేడయం, దానిని ఆమోదించడం, జగన్‌ పార్టీలో చేరిపోవడం వెంట వెంటనే జరిగి పోయాయి. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన
ఇంతియాజ్‌ ఓటమిపాలయ్యారు. పైగా జగన్‌ పార్టీ ఓడి పోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇంతియాజ్‌ ఆశలన్నీ అడియాసలయ్యాయి. దీంతో రాజకీయంగా ఇంతియాజ్‌ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందనే టాక్‌ ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. డిప్యూటీ కలెక్టర్‌ నుంచి ఐఏఎస్‌గా పదొన్నతి పొందిన ఇంతియాజ్‌కు నిజాయితీ గల అధికారిగా పేరుంది. రాజకీయాల్లోకి వెళ్లడంతో ఇంతియాజ్‌కు 2025 మే 31 వరకు సర్వీసు ఉన్నా వృధా అయ్యిందనే టాక్‌ అధికార వర్గాల్లో వినిపిస్తోంది.
ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) డాక్టర్‌ జవహర్‌రెడ్డి పరిస్థితి కూడా అదే దారిలో నడిచింది. జవహర్‌రెడ్డి తొలి నుంచి నిజాయతీ కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. 1990వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఆయన ఎక్కడ పని చేసినా శభాష్‌ అనిపించుకున్నారు. కోవిడ్‌ కష్ట కాలంలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయన పని తీరు ప్రభుత్వానికి ప్రశంలు అందేలా చేసింది. సీఎస్‌కు ముందు టీడీపీ ఇవోగా అందరి మన్ననలు పొందారు. కానీ చివరకు వచ్చే సరికి అపవాదులు మూట గట్టుకోవలసి వచ్చింది. జగన్‌ ముద్ర పడటంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉండగానే సెలవులో వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చివరకు ఊహింని రీతిలో ఆయన పదవీ విరమణ పొందాల్సి వచ్చింది.
వీరందరి కంటే మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఉదంతం మరీ దారుణం. ఆయనకు ఏడేళ్ల సర్వీసు ఉండగానే వీఆర్‌ఎస్‌ తీసుకోవలసిన పరస్థితులు నెలకొన్నాయి. ప్రవీణ్‌ ప్రకాష్‌ 1994వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఆయన ఏ బాధ్యతలు చేపట్టినా అందులో తనదైన ముద్రవేశారు. ఆయన వల్ల ప్రజలకు మేలు జరిగితే.. ఆయన చేపట్టిన సంస్కరణల వల్ల ఇబ్బందిగా భావించినా వారు ఉన్నారు. విజయవాడ మునిసిపల్‌ కమిషనర్‌గా ఇరుకు రోడ్లను సైతం విశాలంగా చేసేందుకు ఆక్రమణల తొలగింపులో ఆయనపై వచ్చిన ఒత్తిళ్లు సామాన్యమైనవి కావు. వీటిని ముట్టుకుంటే బదిలీ వేటు తప్పదని తెలిసినా.. అప్పుడు ఆయన చేసిన సాహసోపేత ఆక్రమణల తొలగింపు నేడు విజయవాడలోని ఏలూరు, బందరు రోడ్లు విశాలంగా మారడానికి కారణమయ్యాయి. అయితే 2019లో జగన్‌ ప్రభుత్వం వచ్చే సరికి వాతావరణం మారి పోయింది. సీఎంలో కీలక అధికారిగా మారారు. సీఎస్‌ అనుమతులు లేకుండా ఉత్తర్వులు జారీ చేయడం అప్పట్లో వివాదలకు కారణమయ్యాయి. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయంలో ఆయనపై జగన్‌ ముద్ర బలంగానే పడింది. తర్వాత ఎన్నికలు రావడం, ప్రభుత్వం చకచక జరిగి పోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇబ్బందులు తప్పవని భావించిన ఆయన తనకు ఏడేళ్ల సర్వీసు ఉన్నా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవలసి వచ్చిందే టాక్‌ అధికార వర్గాల్లో సాగుతోంది.
వీరందరికీ మంచి ట్రాక్‌ రికార్డే ఉంది. మంచి అధికారులుగా పేరు తెచ్చుకున్న వారే. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా కీలక బాద్యతలు పోషించిన వారే. వారి పని తీరుతో చంద్రబాబు చేత శభాష్‌ అని భుజం తట్టించుకున్న వారే. వారికి ఏ బాధ్యతలు అప్పగించినా చంద్రబాబుకు, ఆయన ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన వారే. కానీ పరిస్థితులు తారుమారు కావడంతో ఇంకా సర్వీసు ఉన్నా బయటకు వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయనే టాక్‌ అధికార వర్గాల్లో వినిపిస్తోంది.
Next Story