కడప పర్యటనలో ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ జిల్లా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇది వరకే ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై తిరుగుబాటును ప్రకటించారు. ఆయా రంగాల వారీగా నిరసన కార్యక్రమాలు, కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని ఇది వరకే నిర్ణయించారు. తాను మాత్రం సంక్రాంతి తర్వాత ప్రజల్లో ఉంటానని, ప్రజల సమస్యల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పారు. అయితే ప్రస్తుతం కడప జిల్లా పర్యటనలో ఉన్న జగన్ పులివెందులలో ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. జగన్‌ను కలిసేందుకు అటు రాయలసీమ జిల్లాల నుంచి, ఇటు కడప జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు తరలి వస్తున్నారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్‌ను బుధవారం పులివెందులలోనే జరుపుకున్నారు. తన కుటుంబంతో కలిసి పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ కేక్‌ను కట్ చేయడంతో పాటు నూతన సంవత్సరం క్యాలెండర్‌ను కూడా జగన్ ఆవిష్కరించారు. అదే రోజు కోదండ రాముడి గుడికెళ్లారు. లింగంపల్లి మండలం తాతిరెడ్డిపల్లిలోని కోదండరాముడి విగ్రహాలను ప్రతిష్టించారు. అనంతరం పూజారులు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.