
కృష్ణా జిల్లా తుపాను బాధిత రైతులకు జగన్ పరామర్శ
పోలీసు ఆంక్షలు, వైసీపీ శ్రేణుల మోహరింపు మధ్య సాగుతున్న జగన్ పర్యటన
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. పోలీసు ఆంక్షలు కృష్ణా జిల్లా పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. మోంథా తుపానుతో నష్టపోయిన పంట పొలాలు పరిశీలిస్తున్నారు. బాధిత రైతులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెర్ని వెంకట్రామయ్య (నాని), తలసిల రఘురాం వెల్లడించిన వివరాల ప్రకారం, జగన్ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పెనమలూరు సెంటర్ కు చేరుకున్నప్పుడు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున స్వాగతం పలికాయి. ఉయ్యూరు బైపాస్, పామర్రు బైపాస్ మార్గంలో ఆయన పర్యటన సాగుతోంది.
జగన్ రాక సందర్భంగా పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లో స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు.  రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ షరతులు పెట్టారు. కేవలం 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని కృష్ణాజిల్లా పోలీసులు చెబుతున్నారు. అయితే జగన్ పర్యటనకు భారీగా రావాలంటూ సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలకు పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల వైసీపీ నాయకత్వం పిలుపునిచ్చింది. దీంతో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు.. జగన్ పర్యటన ప్రాంతానికి చేరుకున్నాయి.
పర్యటనలో తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి, నష్టాన్ని అంచనా వేసేందుకు రైతులతో నేరుగా మాట్లాడనున్నారు.
పరిశీలన అనంతరం ఆయన అవనిగడ్డ హైవే మార్గం గుండా తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
Next Story

