జగన్,ఇప్పుడేమంటావ్? నిలదీస్తున్న చంద్రబాబు!
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికే నలుగురు అరెస్ట్ అయ్యారు. ఈనేపథ్యంలో సవాళ్ల పర్వం మొదలైంది.
శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గానే తీసుకున్నట్టు అర్థమవుతోంది. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియమించిన టీటీడీ పాలకవర్గం చేసిన తప్పిదాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రముఖ డెయిరీల సీఇవోలు, డైరెక్టర్లు నలుగుర్ని అరెస్ట్ చేసింది. ఈ విషయాన్నీ ఎన్డీఏ కూటమిలోని రాష్ట్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోంది. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు ఆ విషయాన్నే రుజువు చేసేలా ఉంది. ఆయన ఏమన్నారంటే..
'తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి ఉపయోగిస్తున్నారని నేను చెబితే వైసీపీ అధినేత జగన్ కి మాలావు కోపం వచ్చింది. నా ఆరోపణను జగన్ గతంలో తప్పుబట్టారు.. అప్పట్లో నేను చెప్పింది నిజమేనని ఇప్పుడు సీబీఐ అరెస్టుల ద్వారా తేటతెల్లమైంది' అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
'తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యికి సంబంధించి సిట్ అధికారులు ఇప్పటికే నలుగుర్ని అరెస్ట్ చేశారు. వీరందరూ టీటీడీకి నెయ్యి సరఫరా పేరిట కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థతో సంబంధం ఉన్నవారే. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి సరఫరాకు వైసీపీ హయాంలో టెండర్లు పిలిచారు. కొందరికి అనుకూలంగా నిబంధనలు కూడా సడలించారు. ఆ విషయాన్నే నేను చెప్పా. దాన్ని ఆవేళ జగన్ తప్పుబట్టారు. ఇప్పుడేమంటారని' చంద్రబాబు ప్రశ్నించారు.
'ఇవన్నీ బయటపడ్డాక కూడా జగన్ నెయ్యి సరఫరాలో అక్రమాలు లేవంటారా? దీన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అంటారా? రాజకీయ కుట్ర అంటారా?.. ఏమంటారో చూడాలి?' అంటున్నారు చంద్రబాబు. తాను చెప్పిందే నిజమని నమ్మించేందుకు జగన్ ఎంతకైనా తెగిస్తారన్నారు.
2019 ఎన్నికల సమయంలో జరిగిన బాబాయ్ హత్యకేసును టీడీపీ పై నెట్టేందుకు ప్రయత్నించడమే దీనికి నిదర్శనమని కొందరు టీడీపీ నేతలు అప్పుడే ఎదురుదాడికి దిగారు. గతంలో కోడికత్తి డ్రామాను కూడా తెలుగుదేశంపై వేయాలని చూశారని.. గత ఎన్నికల్లో సానుభూతి సంపాదించేందుకు గులకరాయి డ్రామా ఆడినా తిప్పికొట్టామని చెబుతున్నారు. జగన్ నాటకాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎంతో సహా మంత్రులూ అభిప్రాయపడ్డారు. వైసీపీ నేతల అడ్డగోలు ఆక్రమణలు కూడా చర్చకొచ్చినట్లు తెలిసింది.
Next Story