ఎన్‌టీఆర్ ఘాట్‌లో ఆంధ్ర రాజకీయ దుమారం..
x

ఎన్‌టీఆర్ ఘాట్‌లో ఆంధ్ర రాజకీయ దుమారం..

దివంగత సీఎం, ఆంధ్రుల అన్నగారు ఎన్‌టీఆర్ 101వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యలు, అభిమానులు, ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేతలు..


దివంగత సీఎం, ఆంధ్రుల అన్నగారు ఎన్‌టీఆర్ 101వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యలు, అభిమానులు, ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఈరోజు హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని, ప్రజానాయకుడు ఎన్‌టీఆర్‌కు నివాళులు అర్పించారు. నటుడిగా సాధించిన ఘనతను, నాయకుడిగా ప్రజలకు చేసిన సేవను వారంతా గుర్తు చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే ఈరోజు ఉదయాన్ని ఎన్‌టీఆర్ మనవళ్లు ఎన్‌టీఆర్(జూనియర్), కల్యాణ్ రామ్.. ఘాట్‌కు చేరుకుని పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఒకరొకరిగా పురంధేశ్వరి, బాలకృష్ణ, లక్ష్మీ పార్వతి, మాజీ మంత్రి ఎల్లబెల్లి దయాకర్‌రావు తదితరులు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు కూడా. కానీ వారి వ్యాఖ్యలు చూస్తుంటే ఎన్‌టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎన్‌టీఆర్ ఘాట్‌లో ఆంధ్ర రాజకీయ దుమారం రేగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యంగా లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఆమె మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు ఎన్‌టీఆర్ ఆశీస్సులు ఉంటాయని, మరోసారి ఆంధ్ర సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ నేతలు కూడా ఎన్‌టీఆర్ ప్రజా నాయకుడని, ఆయన స్థాపించిన టీడీపీపై ప్రజల నమ్మకం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందని, అది ఈ ఎన్నికల్లో తేటతెల్లం కానుందంటూ 2024 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని చెప్పకనే చెప్తున్నారు.

‘ప్రజల్లో రాజకీయ చైతన్యం తెచ్చింది ఎన్‌టీఆర్’

‘‘ఎన్‌టీఆర్ అంటే ఒక శక్తి. ఒకే పంథాలో వెళ్తున్న రాజకీయాలను మార్చిన నాయకుడు ఆయన. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. అప్పటివరకు కొంతమందికే రాజకీయాలు పరిమితం అన్న ఆలోచనను కూకటివేళ్లతో పెకలించి.. సేవ చేయాలనుకున్న వాళ్లవే రాజకీయాలని నిరూపించారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు. అధికారానికి అప్పటివరకు దూరంగా ఉన్న బడుగు బలహీనవర్గాల వారికి పదవులు కట్టబెట్టారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకుని సంక్షేమ, అభివృద్ధిని పెంచారు. ఆయన తెచ్చిన పథకాలనే ఇప్పటి ప్రభుత్వాలు కూడా అమలు చేస్తున్నాయి’’ అని ఆంధ్ర రాజకీయాల్లో ఎన్‌టీఆర్ తీసుకొచ్చిన మార్పును గుర్తు చేసుకున్నారు.

జగన్‌కు ఎన్‌టీఆర్ ఆశీస్సులు

ఈ నేపథ్యంలోనే ఎన్‌టీఆర్‌కు నివాళులు అర్పించి లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘‘జూన్ 4 తర్వాత ఆంధ్రప్రదేశ్ మరోసారి సుభిక్షమైన, సంక్షేమమైన పాలనను అందుకుంటుంది.అందుకోసం ఎన్‌టీఆర్ ఆశీస్సులు నిండుగా జగన్‌మోహన్ రెడ్డికి అందాలని కోరుకుంటున్నాను’’ అని వ్యాఖ్యానించారు. ఎన్‌టీఆర్ ఘాట్‌లో త్వరలో ఆంధ్ర సీఎంగా మరోసారి జగన్ నిలుస్తారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్‌టీఆర్ వారసులు, అభిమానులు, టీడీపీ నేతలను ప్రస్తావించని అంశంపై ఆమె ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆఖరికి ఎన్‌టీఆర్ ఘాట్‌ను కూడా రాజకీయాలకు వాడుకోవడానికి సిగ్గు లేదా అని కూడా కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లక్ష్మీపార్వతి వ్యాఖ్యలతో ఎన్‌టీఆర్ ఘాట్‌లో ఆంధ్ర రాజకీయ దుమారం రేగింది. ఎన్‌టీఆర్‌ జయంతి సందర్భంగా నివాళులు అర్పించి ఆయనకు సంబంధించిన అంశాలను గుర్తు చేసుకోవాల్సింది పోయి ఇప్పుడు రాజకీయాలు ఎందుకు చర్చిస్తున్నారు? మేము గులుస్తామంటే మేము గెలుస్తామని ఎందుకు ఇక్కడ కూడా జబ్బలు చర్చికుంటున్నారు? ఆఖరికి ఒక పెద్దమనిషి సమాధి దగ్గర కూడా మీ స్వార్థ రాజకీయాలేనా అంటూ మరికొందరు ఛీ కొడుతున్నారు.

Read More
Next Story