వైసీపీ ప్రక్షాళన దిశగా జగన్ ప్రయత్నాలు..వారితోనే ప్రారంభం..!
x

వైసీపీ ప్రక్షాళన దిశగా జగన్ ప్రయత్నాలు..వారితోనే ప్రారంభం..!

వైసీపీ ప్రక్షాళన దిశగా జగన్ అడుగులు వేస్తున్నారా? అంటే పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. ఎన్నికల సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు దిద్దుకునే క్రమంలోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. 2019లో 152 స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైంది. హోరాహోరీ పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ ఎన్నికల కౌంటింగ్ రోజు వార్ వన్‌ సైడ్ అయిపోయింది. తొలుత వైసీపీ పోటీ ఇస్తున్నట్లే కనిపించినా మధ్యాహ్నం నుంచి మాత్రం కూటమి జోరుకు ఫ్యాన్ కొట్టుకుపోయింది. దాంతో వైసీపీలో వలసలు కూడా మొదలయ్యాయి. ఒకరి తర్వాత ఒకరుగా బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు టీడీపీతో కూడా టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీని ప్రక్షాళన చేయాలని జగన్ ఆలోచిస్తున్నారని సమాచారం.

వైసీపీ ప్రక్షాళకు జగన్ ప్రణాళికలు కూడా సిద్ధం చేశారని, ఎక్కడి నుంచి ఈ కార్యాన్ని ప్రారంభించాలో ఫుల్ క్లారిటీతో జగన్ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవల పార్టీని వీడుతున్న వారినుద్దేశించి మాట్లాడుతూ.. ‘‘వెళ్లే వాళ్లను ఎన్నాళ్లను ఆపగలం.. ఎవరు వెళ్లినా వైసీపీ ఇలానే ఉంటుంది. పార్టీని స్థాపించినప్పుడు పార్టీలో నేను, మా అమ్మ మాత్రమే ఉన్నాం. మళ్ళీ అక్కడి నుంచే నా ప్రయాణాన్ని ప్రారంబించడానికి నేను సిద్ధంగా ఉన్నాను’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పార్టీ పునఃనిర్మాణం చేపడతానని ఆయన పార్టీ వర్గాలకు ఢంకా భజాయిస్తున్నారు.

ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సిట్టింగులతో పాటు అభ్యర్థులను మార్చడం వల్లే పార్టీ ఓడిపోయిందని జగన్ భావిస్తున్నారని, అందుకే పార్టీ ప్రక్షాళన చేపట్టాలని ఆయన డిసైడ్ అయ్యారని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. దానికి తోడు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ స్వరం కూడా ఎక్కడా కనిపించకపోవడాన్ని జగన్ జీర్ణించుకోలేక పోతున్నారని, అదే సమయంలో నేతలు పార్టీ ఫిరాయించుతుండటంతో ప్రక్షాళనకు తెర లేపాలని జగన్ ఫిక్స్ అయిపోయినట్లు పార్టీ నుంచి అందుతున్న సమాచారం. దీనిపై ఇప్పటికే జగన్.. పార్టీ పెద్దలతో కూడా చర్చలు చేసి ప్రక్షాళనకు కావాల్సిన కార్యాచరణను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రక్షాళనకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రక్షాళన కార్యక్రమాన్ని నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల నుంచి ప్రారంభించాలని జగన్, పార్టీ పెద్దలు ఫిక్స్ అయ్యారట. ఇప్పుడున్న వారిని తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని, వారి ద్వారా పార్టీని మరోసారి క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ యోచిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మరోసారి ప్రజల్లోకి వస్తానని జగన్ చెప్పారు. అందులో భాగంగానే ప్రక్షాళన కూడా జరగనుందని సమాచారం. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని కూడా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి దీనిపై జగన్ కానీ పార్టీ నేతలు కూడా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

Read More
Next Story