పల్నాడు జిల్లాలో జగన్‌ పవర్‌ ప్లాంట్‌ భూములను స్వయంగా పవన్‌ కల్యాణ్‌ పరిశీలించారు. స్థానికులను గన్‌ పెట్టి బెదిరించి వారి భూములను లాక్కున్నారని విమర్శించారు.


మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడిచిపెట్టడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్‌ అధికారుల సస్పెన్షన్‌తో మొదలు పెట్టిన ప్రతీకార ప్రస్థానం.. టీడీపీ కార్యాలయాలపై దాడి, సోషల్‌ మీడియా కేసులు, రేషన్‌ బియ్యం అక్రమ రవాణా తదితర ఎపిసోడ్‌లలో ఆ పార్టీ నేతలపై కేసుల పరంపర కొనసాగిస్తోందనే విమర్శలు వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. అయితే ఈ సారి నేరుగా మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపైనే అస్త్రాన్ని ఎక్కుపెట్టింది. జగన్‌కు సంబంధించిన వ్యాపార సంస్థలపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం వాటికి సంబంధించిన భూములను స్వాధీనం చేసుకునే చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా సరస్వతి పవర్‌ ప్లాంట్‌కు సంబంధించిన అసైన్డ్‌ భూములను స్వాధీనం చేసుకుంది. పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్‌ ప్లాంట్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన 17.69 ఎకరాల అసైన్డ్‌ భూమిని కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మాచవరం మండలం వేమవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లిలో 3.89 ఎకరాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

పల్నాడు జిల్లాలోని జగన్‌కు చెందిన సరస్వతి పవర్‌ ప్లాంట్‌ కోసం ఎంత భూములు కొన్నారు, ఎంత మేరకు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారనే దానిపై లెక్కలు తేల్చేందుకు ఇది వరకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆ ప్రాంతాలకు వెళ్లి స్వయంగా పరిశీలించారు. భూములు అమ్మిన వారితోను ఆయన మాట్లాడారు. జగన్‌కు చెందిన సరస్వతి పవర్‌ ప్లాంట్‌కు సంబంధించిన భూముల్లో అక్రమాలు దొర్లాయని, వీటిని నిగ్గు తేలుస్తామని, స్థానికులను భయబ్రాంతులకు గురి చేసి వారి భూములను బలవంతంగా లాక్కున్నారని పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా 17.69ఎకరాల అసైన్డ్‌ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
Next Story