చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శ్వేత పత్రాల విడుదలపైనే దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు నాలుగు పత్రాలను విడుదల చేసిన బాబు తక్కిన మూడింటిని అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయాలని వాయిదా వేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో హింస పెచ్చరిల్లుతోంది. హింసాత్మక సంఘటనలను కట్టడి చేయడంలో వైఫల్యం చెందిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్నాయి. గత మూడు రోజులుగా రాష్ట్రంలో చేసుకున్న చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో శాంతి భద్రతలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదలను వాయిదా వేసుకున్నట్లు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి సమయంలో శ్వేత పత్రం విడుదల చేయడం కంటే వాయిదా వేయడమే మంచిదని ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు అధికార వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న లా అండ్ ఆర్డర్ సమస్యలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని భావించారు. జగన్ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు, నిర్భందం, నోరెత్తనీకుండా ప్రతిపక్షాలను అణచి వేసిన తీరు, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించిన పౌరులపై నమోదైన కేసులు, భావ ప్రకటన అడ్డుకోవడం, ఎస్సీ, ఎస్టీలపై పెరిగిన దాడులు, అమరావతి రైతులను అణచి వేసిన తీరు, డాక్టర్ సుధాకర్ ఉందంతం, దళిత డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు, కోడి కత్తి కేసు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వంటి పలు అంశాలతో శ్వేత ప్రతంలో ప్రస్తావించాలని భావించారు. ఆ మేరకు శ్వేత పత్రాన్ని కూడా రూపొందించారు. ఇక విడుదలే తరువాయిగా భావించారు. అయితే పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడి, వినుకొండలో చోటు చేసుకున్న దారుణ హత్య నేపథ్యంలో శ్వేత పత్రం విడుదలను వాయిదా వేసుకున్నట్లు తెలిసింది.
ఇప్పటికే ప్రభుత్వం నాలుగు రంగాలపై శ్వేత పత్రాలను విడుదల చేసింది. పోలవరం, అమరావతి, విద్యుత్, మైనింగ్ రంగాలకు సంబంధించిన శ్వేత పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా విడుదల చేసి గత ప్రభుత్వంపై విమర్శల దాడి కురిపించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుతం నెలకొన్న సమస్య రీత్యా తక్కిన శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ రంగాలకు సంబంధించిన మూడు శ్వేత పత్రాలను త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టి చర్చలు జరపాలని నిర్ణయానికి వచ్చింది. ఇప్పటి వరకు విడుదల చేసిన నాలుగు శ్వేత పత్రాలకు ప్రజల్లో పెద్దగా ఆదరణ రాలేదని, దీంతో అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకుని విడుదల చేస్తే ప్రజల్లోకి వెళ్లి చర్చనీయాంశాలుగా మారుతాయని, అందుకే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు విడుదల చేయాలని నిర్ణయించినట్లు టీడీపీ శ్రేణులు చెబుతన్నారు.
మరో వైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్బంగానే శ్వేత పత్రం విడుదల వాయిదా పడినట్లు వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు చెబుతున్నారు. వినుకొండలో రషీద్ అత్యంత కిరాతకంగా హత్యకు గురికావడంతో జగన్‌మోహన్‌రెడ్డి వినుకొండకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో బెంగుళూరులో ఉన్న జగన్ గురువారం తాడేపల్లికి చేరుకున్నారు. శుక్రవారం జగన్ పర్యటన సందర్భంగా భారీ స్థాయిలో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు హాజరయ్యే అవకాశం ఉందని, ఇదే సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యల గురించి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే చాన్స్ ఉందని ఈ నేపథ్యంలో లా అండ్ ఆర్టర్ సమస్యలపై శ్వేత పత్రం విడుదల చేస్తే ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందనే ఆలోచనలతో విరమించుకున్నట్లు తెలిసింది. బుధవారం జరిగిన వినుకొండ హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆటవికంగా హతుడు రషీద్‌పై నిందితుడు జిలాని దాడి చేసి క్రూరంగా హత్య చేసిన తీరు ప్రజల్లో భయాన వాతావరణాన్ని సృష్టించింది.
Next Story