హంద్రీ నీవా సుజల స్రవంతిలో భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ లోకి నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి బాణం సంధించారు.
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)
వై నాట్ 175 (Why not 175) లక్ష్యంగా సాగుతున్న అధికార వైఎస్ఆర్సీపి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన విషయం తెలిసిందే. దశాబ్దాల కాలంగా కుప్పం ప్రజలకు తీరని కలగా మిగిలిన కృష్ణా జలాల తరలింపును ఒక ఆయుధంగా ప్రయోగించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గాన్ని లాక్కోవాలని చూస్తున్నారు. ఈ లక్ష్యంతో కుప్పంలో సోమవారం ఒకరోజు పర్యటనకు వచ్చారు. రెండుముఖ్యమయిన కార్యక్రమాలలో పాల్గొన్నారు.
కృష్ణా జలాలను కుప్పం బ్రాంచ్ కాలువలోకి సోమవారం ఉదయం 11.30 రామకుప్పం మండలం రాజుపేట వద్ద గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం ఆయన ప్రయోగించిన తొలి బాణం. దశాబ్దాల కాలంగా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఎన్ చంద్రబాబు నాయుడు చేయలేని పని ఇది,. ఆయన చేయలేని పని తాను చేసి చూపించామంటూ జగన్ ధీమాగా ఒక సందేశం ప్రజలకు పంపించారు. ఈ కాలువ నీటిని కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువులకు మళ్లించి 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, కుప్పం పలమనేరు నియోజకవర్గాల్లోని 4.02 లక్షల జనాభాకు తాగునీరు అందించాలి అనేది ప్రధాన లక్ష్యం. కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తీసుకురావాలనేది ఈ ప్రజల చిర కాలవాంఛ. 2014- 2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చంద్రబాబు నాయుడు ఈ పని చేయలేకపోయారు. ఇపుడు ఎన్నికల ముందు కుప్పానికి కృష్ణా నీళ్లు అందించి ప్రజలను తనవైపు తిప్పుకోవాలనుకుంటున్నారు.
2024 ఏప్రిల్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మళ్లీ అధికారంలోకి రావాలని జగన్, అధికారం కైవసం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరొక వైపు చంద్రబాబును కుప్పంలో ఓడిస్తానని జగన్ శపథం చేస్తూ వై నాట్ 175 అని పిలుపునిచ్చారు.
జగన్మోహన్ రెడ్ది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి మీద ప్రయోగించిన మరొక అస్త్రం పాలార్ ప్రాజక్టు.
దివంగత సీఎం వైఎస్. రాజశేఖర్ రెడ్డి కాలంలో పునాది పడిన ప్రాజక్టు ఇది, ఆ రోజుల్లో ఈ ప్రాజక్టుకు రు. 50 కోట్ల విడుదల చేశారు. ఆంధ్ర తమిళనాడు సరిహద్దున ఈ ప్రాజక్టు వల్ల రెండు రాష్ట్రాల మధ్య నీటివిభజన వివాదం వచ్చింది.ప్రాజక్టు నిర్మాణం ముందుకు సాగలేదు.
ఇపుడు న్యాయస్థానంలో కేసు పరిష్కారం కావడమయింది. కుప్పం మండలం గణేశ్వరపురం సమీపంలోని పాలార్ నదిపై 0.6 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి కూడా ఈ రోజు జగన్ శంకుస్థాపన చేశారు. ఇదీ జగన్ సత్తా అని వైయస్ఆర్సీపీ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. ఇది తెలుగు దేశం అభిమానులను కొద్ది కలవరపెడుతున్నాయి. చంద్రబాబు నాయుడు చేయలేకపోయిన ఈ రెండు ముఖ్యమయిన కార్యక్రమాలను జగన్ పూర్తి చేశారు. ఇది ఈ ప్రాంతంలో మంచినీళ్ల కొరత తీర్చింది. సాగునీటి అందించబోతున్నాయి.
పాలార్ రిజర్వాయర్ పనులు 214.81 కోట్లతో చేపట్టడానికి శుక్రవారం పరిపాలన అనుమతులు కూడా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ లో అంతర్భాగంగా గుడుపల్లి మండలం యామగాని పల్లె వద్ద 0.710 టిఎంసీల సామర్థ్యంతో ఓ రిజర్వాయర్ నిర్మించి 2500 ఎకరాలకు సాగునీరు, శాంతిపురం మండలం మాదనపల్లి వద్ద 0.354 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ తో 2,500 ఎకరాలకు సాగునీరు అందించడానికి పరిపాలన అనుమతులు ఇస్తూ ఆదివారం రాత్రి జీవో-100 తో జారీ చేశారు.
దీనితో కుప్పం నియోజకవర్గంలో జగన్ ది పై చేయి అవుతుందని వైసిపి నేతలు సంబర పడుతున్నారు.