జగన్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న చెల్లెళ్లు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను చెల్లెళ్లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. గుక్క తిప్పుకోనివ్వడం లేదు. వివేకా హత్య, రాష్ట్ర సమస్యలపై అస్త్రాలు సంధిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆటాడుకుంటున్నారు ఇద్దరు మహిళలు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను సొంత చెల్లెళ్లు నేరస్తునిగా చూడటంతో ప్రజల్లో పూర్తిస్థాయిలో చర్చకు దారి తీసింది. ఎన్నికల్లో జగన్ ఓడిపోతున్నాడు. అందుకే ఈనెల 15న లండన్ వెళుతున్నాడు. అన్నీ ఇప్పటికే సర్థుకున్నాడు. జనం మధ్య నుంచి పారిపోతున్నాడని చెల్లెలు ఏపీసీసీ చీఫ్ షర్మిల మాట్లాడిన మాటలు రాష్ట్రంలో దుమ్మురేపుతున్నాయి.
ఆమె నవ సందేహాల పేరుతో ప్రతిరోజూ మీడియా సమావేశంలో ప్రశ్నిస్తున్నారు. ఒక్కో సమస్యపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికలు అయిపోయే వరకు ఈ సందేహాలకు సమాధానాలు చెప్పాలంటూ ప్రశ్నిస్తుండటం చర్చనియాంశంగా మారింది. ఇన్ని సమస్యలు ఉన్నాయని, ఈ సందేహాలను ప్రజలకు చెప్పాలని ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఒక రోజు ప్రాజెక్టులు, మరో రోజు ఇసుక మాఫియా, ఇంకో రోజు మద్యం మాఫియా, ఒక రోజు మంత్రి పెద్దిరెడ్డి తీరుపై ప్రశ్నల వర్షం ఇలా ప్రతిరోజూ మాట్లాడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై కూడా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతినెలా ఒకటో తేదీన ఈ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఉద్యోగులు జీతాలు తీసుకున్నారా? కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించారా? ఇంతటి ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం దేశంలో ఎక్కడైనా ఉందా? ఇంతటి పన్నుల మోత ఎప్పుడైనా ఉందా? 2020 నాటికి పరిమితికి మించి అప్పులు చేయడాన్ని కాగ్‌తో పాటు క్రిసిల్ హెచ్చరించిన విషయం మీకు తెలియదా? ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రో ఉత్పత్తులపై పన్నుల రూపంలో 70వేల కోట్లు అదనపు భారం మోపారు. పంచాయతీలు, మునిసిపాలిటీల్లోని రూ. 12వేల కోట్లు దారి మళ్లించడం తప్పుకాదా? అంటూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు చెబుతూ ప్రశ్నిస్తుంటే ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు.
నేను పచ్చచీర కట్టుకుంటే ఎందుకు? ఎర్రచీర కట్టుకుంటే ఎందుకు? నేను ఏ చీర కట్టుకుంటున్నానో అంత కీన్‌గా అబ్జర్వ్ చేస్తున్న అన్న జగన్ ప్రజల కష్టాల గురించి ఎందుకు ఆలోచించడం లేదు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అంతా అయిపోయాక చేతులు పట్టుకుంటే ఏమి లాభం, తెలుగుదేశం ప్రభుత్వం కూడా లెక్కకు మించిన అప్పులు చేసింది. వీరిద్దరూ మోదీకి దాసోహం అంటున్నారు. ఇటువంటి వారినా మీరు గెలిపించేది అంటూ ఓటర్లను ఆమె ప్రశ్నిస్తున్నారు.
ప్రతి విషయంలోనూ చంద్రబాబును లాగటం, సీఎం జగన్ చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు పచ్చచీరలంటూ చెల్లెల్ని ఎగతాళి చేయడం ఏమిటి? మా చిన్నాన్నను చంపిన వారెవరో, చంపించిన వారెవరో సీఎం జగన్‌కు బాగా తెలుసు. ప్రభుత్వం ఆయన చేతుల్లో ఉంది. వారిని అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేయొచ్చు. కానీ ఆయన ఆ పనిచేయలేదు. ఇంత ఘోరంగా పరిపాలన ఉంటుందని నేను భావించలేదు. ముఖ్యమంత్రి అయ్యాక మనిషి మారిపోయాడు. అధికారం ఆయన అహంకాన్ని మరింత పెంచింది. అంటూ ఆమె ఆరోపణల వర్షం కురిపిస్తున్నారు.
కడప నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల ఒక నేరస్తుడికి ఓటు వేస్తారా? మీ వైఎస్సార్ బిడ్డ షర్మిలకు ఓటు వేస్తారా? అంటూ ఓటర్లను ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కొంగు చాచి అడుగుతున్నా. మాకు న్యాయం చేయండి. మా చిన్నాన్న వివేకా కుటుంబానికి న్యాయం జరగాలంటే నన్ను గెలిపించింది. గొడ్డలితో మనుషులను నరికించే వారు కావాలో, రాజన్న పాలన కావాలో మీరే తేల్చుకోండి అంటూ ఓటర్లను షర్మిల అడుగుతున్నారు.
షర్మిలతో పాటు వివేనందరెడ్డి కుమార్తె సునీత కూడా కడప జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ షర్మిలను గెలిపించాల్సిందిగా ప్రచారం చేస్తున్నారు.
చంద్రబాబు మా కుటుంబాన్ని చీల్చాడు. అన్నా, చెల్లికి కాకుండా చేశారు. ఈ పాపం ఊరికేపోదు. అంటూ చంద్రబాబుపై జగన్ నిప్పులు చెరుగుతున్నారు. అవకాశం వచ్చిన ప్రతిచోటా వివేకా హంతకులు ఎవరో అందరికి తెలుసునని అంటున్నాడు. అవినాష్ ఏ తప్పూ చేయలేదని భావించాను కాబట్టే పార్టీ టిక్కెట్ ఇచ్చి కడప నుంచి పోటీలో ఉంచానని జగన్ చెప్పడం విశేషం.
జగన్‌పై చెల్లెళ్లు చేస్తున్న ఆరోపణలు కడప పార్లమెంట్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అక్కడక్కడ జగన్ సపోర్టు దారులు షర్మిల, సునీతలను నిలదీస్తున్నారు. అయినా అవేమీ పట్టించుకోకుండా ధీటుగా వారికి సమాధానాలు చెబుతూ ముందుకు సాగుతున్నారు.
Next Story