జమ్మలమడుగు ఎమ్మెల్యేసుధీర్ కీ తిప్పలేనా?  జగన్ వార్నింగ్ దేనికి సంకేతం
x
జమ్మలమడుగు సిట్టింగ్ MLA సుధీర్

జమ్మలమడుగు ఎమ్మెల్యేసుధీర్ కీ తిప్పలేనా? జగన్ వార్నింగ్ దేనికి సంకేతం

మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి మేనల్లుడైన సుధీర్ రెడ్డికి ఈసారి సీటు దక్కదా.. ఆయన్నువేరే నియోజకవర్గానికి మారుస్తారా.. జమ్మలమడుగులో నడుస్తున్న ప్రస్తుత టాక్ ఇదే..


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సొంతజిల్లా వైఎస్సార్ కడప... ఈ జిల్లాలో పులివెందులతో పాటు జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం కూడా ముఖ్యమంత్రికి ప్రతిష్టాత్మకమే. అయితే ఇప్పుడా సీటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భవితవ్యంపై నీలినీడలు అలుముకున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ సీటు నుంచి సీఎం కుటుంబం నుంచే ఎవరో ఒకరు పోటీ చేసే ఛాన్స్‌ ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో జమ్మలమడుగు రాజకీయం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలను మారుస్తూ వైసీపీలో హైఅలర్ట్‌ ప్రకటించిన సీఎం జగన్‌... తన సొంత జిల్లా కడపలో కూడా కొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు డేంజర్‌ సిగ్నల్స్‌ పంపుతున్నారు. ముఖ్యంగా తన కుటుంబానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన జమ్మలమడుగులో ఈ సారి సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కొనసాగించే పరిస్థితి లేదన్న ప్రచారం... కడప జిల్లా రాజకీయాల్లో హీట్‌పుట్టిస్తోంది. కొద్ది రోజుల క్రితం అనంతపురం పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌... కడప ఎయిర్‌పోర్టులో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పనితీరుపై సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. పనితీరు మార్చుకోకపోతే వేటు తప్పదని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని సీఎం హెచ్చరించినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

సుధీర్ రెడ్డిని తప్పిస్తే ప్రత్యామ్నాయం ఎవరు?

సీఎం వార్నింగ్‌తో జమ్మలమడుగు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున దేవగుడి భూపేష్ రెడ్డి పోటీచేసే అవకాశం ఉంది. ఆయన ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించారు. వైసీపీలో మాత్రం స్తబ్ధుగా ఉంది. వైసీపీ నేతలందరూ జగన్ పై భారం వేసి ఆయన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. జమ్మలమడుగులో పట్టున్న దేవగుడి కుటుంబాన్ని ఢీకొట్టాలంటే వైఎస్ కుటుంబ సభ్యులెవరో ఒకరు పోటీలో ఉంటే బాగుంటుందని స్థానిక క్యాడర్‌ డిమాండ్‌ చేస్తోంది. మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి మేనల్లుడైన సుధీర్ రెడ్డి గత ఎన్నికల్లో సునాయాసంగానే గెలిచారు. జగన్ కనుసన్నలలోనే పని చేస్తూ వచ్చారు. అయినా సరే ఈసారి ఆయన్ను తప్పించాలని నియోజకవర్గ స్థాయిలో డిమాండ్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గంతో ఎమ్మెల్యే వర్గానికి పొసగకపోవడంతో సీఎం జగన్‌ కూడా ఈ నియోజకవర్గంపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

రామసుబ్బారెడ్డితో సుధీర్ కి దూరం పెరిగిందా?

జమ్ములమడుగు నియోజకవర్గంలో పట్టున్న నేతల్లో ఒకరైన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గాన్ని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పూర్తిగా దూరం పెట్టినట్లు చెబుతున్నారు. దీంతో ఆయన మద్దతుదారుల్లో చాలా మంది వైసీపీలో తమకు సముచిత స్థానం దక్కడంలేదని అసంతృప్తి చెందుతున్నారు. ప్రత్యామ్నాయంగా వీరంతా టీడీపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా సీఎం జగన్‌ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న నేతలను కూడా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పక్కనబెట్టే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదేసమయంలో ఎమ్మెల్యేతో విభేదాలు ఎక్కువ కావడంతో ఆయన సమీప బంధువులు కూడా పార్టీని వీడుతున్నారు. ఇటీవల కాలంలో టీడీపీలో చేరిన గంగవరం శేఖర్ రెడ్డి... ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి దగ్గర బంధువే.. కానీ, ఎమ్మెల్యే తనను నిర్లక్ష్యం చేస్తున్నారనే కారణంగా ఆయన పార్టీ మారాల్సివచ్చిందంటున్నారు వైసీసీ క్యాడర్‌.

పరిస్థితుల్లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సీటుపై వేటు వేసే పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యే పనితీరుపై ఆరోపణలతో పాటు వర్గ విభేదాలను ఎమ్మెల్యే పెంచి పోషిస్తున్నారని సీఎం జగన్‌కు నివేదికలు అందినట్లు చెబుతున్నారు. దీంతో జమ్మలమడుగు కోసం ప్రత్యామ్నాయ నేతలను అన్వేషిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అందుకే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి కూడా జగన్‌ వార్నింగ్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు.

Read More
Next Story