జముకుల కథ ఉత్తరాంధ్ర బతుకుపాట..
x
Source: Twitter

జముకుల కథ ఉత్తరాంధ్ర బతుకుపాట..

మాల మాదిగల పాట అది… అంతగా అక్షర జ్ఞానం లేకపోయినా... సాహిత్యం సహకరించకపోయినా...జనాలను ఉర్రూతలూగించిన పాట... ఏంటా పాట...?


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: సరిగమలు అవసరం లేదు… సాహిత్యంతో సంబంధం లేదు... భాష, యాస, మండలికాలతో స్థానికతను జోడించి... వాడుక పదాలతో పాట కట్టడమే దీని ప్రత్యేకత. ఉత్తరాంధ్ర జిల్లాల అతి ప్రాచీన జానపద కళారూపాల్లో జముకుల పాట ఒకటి. ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అనాదిగా ప్రాచుర్యం పొందిన ఈ కళారూపకం నేడు కనుమరుగయ్యే స్థితికి వచ్చేసింది. ఒకప్పుడు ఎన్నో కుటుంబాలను బతికించిన ఈ (జముకుల పాట) కళ నేడు మచ్చుకైనా కానరావడం లేదు. ఎంతో అద్భుతమైన ఈ కళారూపం ప్రస్తుతం యాచక వృత్తికి ఆసరాగా మారిపోయింది. ఈ కళకు ఆదరణ కరువు కావడంతో ఉత్తరాంధ్రకు చెందిన ఎందరో కళాకారులు రోడ్డున పడ్డారు. ఈ కళతో యాచక వృత్తిని సాగిస్తున్నారు.

బుడబుక్కల పాట...

'ఉండిపోదు జీవితం ఇలా ఎప్పుడూ… ఉండనిది ఊడేటిది ఒరేయ్ తమ్ముడా.... బండితో ధనమున్నను.. మరుబండితో వెండున్నను.. దండిగా బలమున్నను... మెండుగా బలగమున్నను.. కట్టై కాలిపోవును.. మట్టై మిగిలిపోవును... ఉండిపోదు జీవితం ఇలా ఎప్పుడూ' జముకుల పాటలో ప్రసిద్ధిగాంచిన ఓ పాట ఇది. ప్రస్తుతం ఇది చావు భజన పాటగా మారిపోయింది. వీరి పాటల్లో, కథల్లో జీవిత సత్యాలే కాదు... వీర, హాస్య, కరుణ, శృంగార రసాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. జముకుల పాట కళారూపం ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఆయా ప్రాంతాల్లో జముకుల పాటను బోనెల పాటగాను, బుడబుక్కల పాటగాను, బుడికి పాట గానూ పిలుస్తుంటారు. జముకుల కథలకు అనేక పేర్లు ఉన్నాయి. జముకుల కథను జక్కుల కథగాను, బుడబుక్కల కథగాను పిలుస్తారు. ఉత్తరాంధ్రకు చెందిన అతి ప్రాచీనమైన జానపద కళా రూపమైన ఈ జముకుల పాట కళను ఉత్తరాంధ్ర జిల్లాల దళిత(మాల, మాదిగ) కళాకారులు ఎన్నో తరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు.

జనం మెచ్చిన జముకుల కథ...

పురాణాలు, ఇతిహాసాలు, రామాయణ, మహాభారతాలు సాంఘిక, సామాజిక దురాచారాలు, భూస్వాములు, రాజుల అరాచకాలు… ఇలా ఒకటి కాదు సమాజాన్ని ప్రభావితం చేసే ఎన్నో కథలు… జముకుల కథలుగా ప్రసిద్ధిగాంచాయి. గానం, నృత్యం, వాయిద్యం, కథ, కథనం జముకుల పాటల్లో ప్రధానాంశాలు. జముకుల పాటలో కళాకారులు నవరసాలను పండించడంతో పాటు సిక్కోలు యాస భాషల గానం, వాయిద్యం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ కథలు కాకతీయుల కాలం నుండి ప్రాచుర్యం పొందాయని ఇక్కడి కళాకారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో జముకుల కథలను బోనేల ఆట అని కూడా అంటారు. ప్రస్తుతం జముకుల కథ కళాకారులు శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరే మిగిలారు. కళాకారులు కరువడంతో ఈ ప్రాచీన జముకుల కథ మరుగున పడిపోయింది. 'అతి ప్రాచీనమైన జముకుల కథా రూపకం మరుగున పడిపోయింది. ఈ కథ ప్రదర్శన చాలా కష్టంతో కూడుకున్న పని. రెండు జముకులు ఒక డక్కి వాయిద్యాలతో రూపకాన్ని ప్రదర్శించేవాళ్లం. ప్రస్తుతం కళాకారులు దొరకకపోవడంతో గత 20 ఏళ్లుగా ప్రదర్శనలు ఇవ్వడం మానేశాం' అని శ్రీకాకుళం జిల్లాకు చెందిన జముకుల కథ కళాకారుడు నందేడు చందర్రావు.. ది ఫెడరల్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో చెప్పారు.

'బుడబుక్కం' అంటే ఏంటి...?

జముకుల పాట, కథల్లో ప్రధాన వాయిద్యం జముకే… దీనినే బుడబుక్కం అని కూడా అంటారు. ఈ వాయిద్య సహకారంతోనే రూపకం ప్రదర్శన జరుగుతోంది. ఈ జముక ఒక గమ్మత్తైన శబ్దాన్ని ఇస్తుంది. కుంచం ఆకారంలో ఉండే ఈ వాయిద్యంతోనే శ్రావ్యమైన సంగీతంతో శ్రవణానందం కలిగిస్తారు కళాకారులు. ఈ వాయిద్యంపై పలు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సుకేతుడు అనే రాక్షసుడిని సంహరించిన ఎల్లమ్మ దేవి ఆ రాక్షసుడి వెన్ను చర్మాన్ని వలిపించి రెండు వైపులా తెరిచి ఉన్న డబ్బాకు ఓవైపు అమర్చారని, వెన్నునరం తీసితాడుగా చేయించి, కాలి మూలుగు దుమ్ము బిళ్ళగా మార్చి 'జముక'ను తయారు చేయించారని పురాణ కథ. అంతే కాదు జానపదుల్లో ఈ జముకుల కథకు సంబంధించి మరో నమ్మకం కూడా ఉంది.

ఈ జముకుధ్వని వినిపించినంత మేర దెయ్యం, పిశాచం లాంటివి ఏమీ రావని, వాటి ప్రభావం ఉండదని నమ్ముతుంటారు. తర్వాతి కాలంలో కప్ప చర్మంతో జమకును తయారు చేసే వారు… కుంచం ఆకారంలో ఉన్న ఒక డొక్కుకు ఒక ప్రక్క కప్ప చర్మంతో మూస్తారు. ఆ చర్మానికి మధ్య చిన్న రంధ్రం చేసి ఒక నరాన్ని చివర ముడివేసి అందులోకి దూర్చి ఆ నరానికి చిన్న కర్ర ముక్క కడతారు. ఆ కర్రకు నివర మువ్వలు కడతారు. కర్రతో దారాన్ని బిగుతుగా లాగి వదులుతుంటే ఒకరకమైన ధ్వని వస్తుంది. కళాకారులు ఉపయోగించే వాయిద్యం పేరు జముక కనుక ఈ కల జముకల కథగా ప్రాచుర్యం పొందింది. శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో బోనెల కుండ అని కూడా అంటారు. దీనిని రబ్బరు, కర్ర, రేకు, కంచు, ఇత్తడితో కూడా తయారుచేస్తారు.

శ్రీకాకుళ సాయుధ పోరాటంలో....

1960- 80 మధ్యకాలంలో జరిగిన శ్రీకాకుళ సాయుధ పోరాటంలో జముకుల పాట, కథ ప్రముఖ పాత్ర పోషించాయి. పలాసకు చెందిన మావోయిస్టు నేత సుబ్బారావు పాణిగ్రాహి ఉద్యమానికి ఊపిరి పోసే విధంగా… ప్రజల్లో చైతన్యం రగిలించే రెండు జముకుల కథ రూపకాలను తన బృందంతో ప్రదర్శనలు ఇచ్చి ప్రజలను ఉద్యమం వైపు నడిచే విధంగా చేసేవారు. ఈ జముకుల కథ రూపకాల్లో శ్రీకాకుళ ఆదివాసి కథ, శ్రీకాకుళ రైతాంగ పోరాట కథ అనే రెండు కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇందులో వచనము, సహాయ వచనము, హాస్యము మధ్య పాటలు ఉంటాయి. సుమారు గంటన్నర పాటు సాగే ఈ జముకుల కథ రూపకంలో శ్రీకాకుళం సాయుధ పోరాటాల సన్నివేశాలు... భూస్వాములు షావుకార్ల అరాచకాలు... ఆదివాసీలు, రైతు కూలీల అగచాట్లు... ప్రజలను చైతన్యపరిచే అంశాలు ఉంటాయి.

" ఎగిరింది ఎర్రజెండా.. ఎగసింది ప్రతి కొండ.. దిక్కూమొక్కు లేని జనం... ఒక్కొక్కరు ఒక్కో అగ్నికణం...సింహనాద కంఠంతో వస్తారిక కాసుకోండి… సీట్ల మీద కూర్చున్న మంత్రులారా ఇక ఖబడ్దార్" అంటూ సాగే ఈ కథ రూపకాలు శ్రీకాకుళం సాయుధ పోరాటాలకు ప్రజలను పోగు చేసేందుకు ఎంతగానో దోహద పడింది. 'సుబ్బారావు పాణిగ్రాహి చనిపోయారు... ఆయన సోదరుడు హేమ సుందర్ పాణిగ్రాహి జైలుకు వెళ్లిపోయారు. దీంతో జముకుల కథ ఆగిపోయింది' అని ఈ రూపకంలో సహాయ వచనం పాడే కళాకారుడు నందేడు చందర్రావు.. ది ఫెడరల్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి తెలిపారు.

కనుమరుగవుతున్న కళ...

అతి ప్రాచీన జానపద కళారూపాల్లో ఒకటైన జముకుల పాట, కథ కళాకారుల కొరత... ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో కనుమరుగైపోతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో బోనీల పాట కళాకారులు అంతరించిపోయారు. మరోవైపు సినిమాలు, టీవీల ప్రభావంతో మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే ఎన్నో జానపద కళారూపాలు కనుమరుగైపోతున్నాయి.

Read More
Next Story