
Janasena meeting poster
జనసేన ఆవిర్భావ సభ పేరు మారింది
జనసేన ఆవిర్భావ సభ పేరు మారింది. 2025 మార్చి 14న పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద జరిగే సభ పేరు ను ’జయకేతనం’ అని మార్చారు.
జనసేన ఆవిర్భావ సభ పేరు మారింది. 2025 మార్చి 14న పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద జరిగే సభ పేరు ను ’జయకేతనం’ అని మార్చారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామకరణం చేశారు. ఈ విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. చిత్రాడ సభ రాష్ట్ర చరిత్రలో మరో మైలు రాయిగా నిలిచిపోతుందని చెప్పారు.
ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి జనసైనికులు, వీరమహిళలు తరలిరానున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనసైనికులు, ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల నుంచి సైతం పెద్ద సంఖ్యలో వస్తున్నట్టు చెప్పారు. ఈ సభ స్థానిక చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టేలా ఉంటుందని మనోహర్ తెలిపారు.
ఈ ప్రాంతానికి విశేష సేవలందించిన మహానుభావులను స్మరించుకునే విధంగా మూడు ముఖద్వారాలకు వారి పేర్లు పెట్టారు.
తొలి ద్వారానికి పిఠాపురం మహారాజు శ్రీ రాజా సూర్యరావు బహదూర్ పేరు పెట్టారు. ఆయన విద్యాభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు ఎనలేని కృషి చేశారు.
రెండవ ద్వారానికి రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం చేసి ఇతోధికంగా సాయపడిన డొక్కా సీతమ్మ పేరు పెట్టారు.
మూడో ద్వారానికి విద్యాసంస్థలు స్థాపించి చరిత్ర సృష్టించిన మల్లాది సత్యలింగం నాయకర్ పేరు పెట్టారు.
భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు జనసేనకు అఖండ విజయాన్ని అందించారని మనోహర్ అభిప్రాయపడ్డారు. పోటీ చేసిన ప్రతి స్థానంలో జనసేన విజయం సాధించిందని, ఇది జనసైనికులు, వీర మహిళలు, నాయకుల నిస్వార్థ సేవలకు ఫలితమని ఆయన కొనియాడారు.
ఈ విజయాన్ని పురస్కరించుకుని, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, పిఠాపురం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసేందుకు ఈ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Next Story