పవన్  వారాహి యాత్ర ఎలా సాగుతుందంటే...
x
Source: Twitter

పవన్ వారాహి యాత్ర ఎలా సాగుతుందంటే...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపటి నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ ప్రచార యాత్రకు ‘వారాహి విజయభేరి’ అని నామకరణం చేశారు.



ఆంధ్రలో పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలయిన టీడీపీ, వైసీపీ పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నాయి. ఈ ప్రచార మైదానంలోకి దిగడానికి తాజాగా పవన్ కూడా సిద్ధమవుతున్నారు. తన ఎన్నికల ప్రచారాన్ని పిఠాపురం నుంచి రేపటి నుంచి ప్రారంభించనున్నారు. పవన్ కల్యాణ్ ప్రచారం రేపు అంటే మార్చి 30న సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు రామాలయం సెంటర్‌లో ప్రారంభం అవుతోంది. ఈ సభ కోసం ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జనసైనికులు చెప్పారు. ఈ సభ భారీగా సాగనుందని, ఇందులో పవన్ స్పీచ్ మరింత స్పెషల్‌గా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

ప్రచారం పేరు

వైఎస్ఆర్‌సీపీ చీఫ్ జగన్‌మోహన్ రెడ్డి తమ పార్టీ ప్రచార యాత్రను ‘మేమంతా సిద్ధం’ అని ప్రారంభించారు. ఇప్పటికే రెండు రోజులు ముగించుకుని మూడో రోజు కూడా భారీగా ఈ యాత్ర సాగుతోంది. అదే విధంగా చంద్రబాబు కూడా ‘ప్రజాగళం’ పేరిట జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఈ ప్రచారంలో ఇరు పార్టీల అధినేతలు తమ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా ‘వారాహి విజయభేరి’ పేరుతో తమ ప్రచార రథాన్ని కదిలించడానికి రెడీ అయ్యారు. తమ ప్రచారానికి రేపు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. పవన్ కల్యాణ్ కార్యక్రమాల్లో భద్రతా వ్యవహారాల సమన్వయకర్తలుగా అందె నరేన్, మిథిల్ జైన్‌ నియామకానికి పవన్ ఆమోదం తెలిపారు.

పవన్ ప్రచారం షెడ్యూల్ ఇదే
ఈ నెల 30న పిఠాపురం నుంచి పవన్ తన ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రచారం కోసం ఇప్పటికే తన వారాహి వాహనాన్ని కూడా పూజలు చేయించి ప్రచారానికి సన్నద్ధం చేశారు. పవన్ ప్రచారం పిఠాపురంలో మూడు రోజుల పాటు సాగనుంది. ప్రచారంలో భాగంగా ఈనెల 30న పవన్ కల్యాణ్.. నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశమవుతారు. అనంతరం శ్రీపాద వల్లభుడి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మరుసటి రోజు 31న ఉప్పాడ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఏప్రిల్ 1న పార్టీ చేరికలు పర్యవేక్షించి, నియోజకవర్గంలోని మేధావులతో సమావేశం కానున్నారు. ఈ మూడు ప్రచార రోజుల్లో పవన్ కల్యాణ్.. పిఠాపురంలోనే బస చేయనున్నారు. ఆ తర్వాత పవన్..రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు.


Read More
Next Story