టీడీపీకి షాక్‌ ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌
x
pavan with Chandrababu

టీడీపీకి షాక్‌ ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌

పవన్‌ కల్యాణ్‌ స్ట్రాంగ్ స్టాండ్‌ తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. జగన్‌ ఓడించాలంటే జనసేనను బలిపెడతానని కాదని టీడీపీకి హెచ్చరించారు.


పొత్తుపై పవన్ స్వరం మారింది. పొత్తు ఉంటుంది...కానీ షరతులు వర్తిస్తాయంటున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. అవునన్నా... కాదన్నా ఇది నిజమన్నారు పవన్. రిపబ్లిక్‌ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో.. టీడీపీకి తాను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. గౌరవప్రదమైన వాటా రావాల్సిందేనని, ఇందులో రాజీ ఉండదని తేల్చిచెప్పారు. వన్‌వే ట్రాఫిక్‌లా పొత్తు ఉండబోదని చెప్పకనే చెప్పారు.

గట్టి మేసేజే ఇచ్చారు పవన్‌...

ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరు గమనిస్తే...రానున్న అసెంబ్లీ- లోక్‌సభ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి మాట్లాడుతూ తాను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఇచ్చారు. తనను తక్కువగా తీసుకుని, ఏవో కొన్ని సీట్లు ఇచ్చేస్తే సరిపోతుందని అనుకోవద్దని, తనకు రావాల్సిన గౌరవకరమైన వాటా రావాల్సిందేనని నర్మగర్భంగా తెలుగుదేశం పార్టీకి తెలియచెప్పారు. 'పొత్తులో ఆటుపోట్లు ఉంటాయి. జనసేన మూడోవంతు సీట్లు తీసుకుంటుంది. ఎన్ని సీట్లు తీసుకోవాలో నాకు తెలుసు. ప్రత్యేక పరిస్థితుల్లో రెండు సీట్లు ప్రకటిస్తున్నా. పొత్తు ధర్మం ప్రకారం సంయమనం పాటించాలి. మీరు ఇచ్చేవారు.. మేము తీసుకునేవారిమని భావించవద్దు' అని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

మూడో వంతు అంటే 75 సీట్లు కావాల్సిందే....

పొత్తుతోనే జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నామని, ఇందులో కొన్ని ఆటుపోట్లు ఉంటాయని చెబుతూనే...స్థానిక సంస్థల నుంచి మొదలు పెట్టి.. అన్ని స్థాయిల్లోనూ భవిష్యత్తులో జనసేన మూడోవంతు సీట్లు తీసుకుంటుందని పార్టీ క్యాడర్‌కు భరోసా ఇచ్చారు. అంటే సుమారు 75 సీట్లు జనసేన కోరుతున్నట్టు స్పష్టమైంది. ఈ మాట అంటూనే టీడీపీతో పొత్తు ఉంటుందని కూడా 'ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు తెలుసని అన్నారు. ఆటుపోట్లు ఉన్నా...తెలుగుదేశంతో కలిసే వెళ్తున్నామని, ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగు దేశం పార్టీ రెండు అసెంబ్లీ సీట్లను ప్రకటించినట్టుగానే......ప్రత్యేక పరిస్థితుల్లో తాను కూడా రిపబ్లిక్ డే సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు, రాజానగరం అసెంబ్లీ సీట్లకు జనసేన పోటీచేస్తుందని ప్రకటిస్తున్నట్టు చెప్పారు. అంటే... తెలుగుదేశం వ్యవహరించే తీరుగానే, తాము వ్యవహరించాల్సి ఉంటుందని, అందుకే పొత్తు ధర్మం ప్రకారం సంయమనం పాటించాలని తెలుగుదేశానికి పరోక్షంగా సూచించారు. కేవలం వారు ఇచ్చే వారు...తాము తీసుకునేవారంలాగా భావించవద్దని పవన్ హితబోధ చేశారు.

మండపేట ప్రకటనే మంట పెట్టిందా?

తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు దాదాపు 18 శాతం ఓట్లు వస్తే...ఈ సారి అక్కడ ఓట్ల శాతం దాదాపు 10 శాతం పెరిగిందని చెబుతూనే..అక్కడ తెలుగు దేశం పార్టీ తమ అభ్యర్థిని ఏకపక్షంగా ప్రకటించడంతో, జనసేన కార్యకర్తలు బాధపడ్డారని అన్నారు. ఇది సరైన విధానమని తాను చెప్పడం లేదని అంటూ...పొత్తు ధర్మం ప్రకారం అలా ప్రకటించకూడదని జనసేన అధినేత చెప్పారు.

జనసేన నేతలు, కార్తకర్తల గౌరవానికి భంగం కలగదు

'మా నాన్న ముఖ్యమంత్రి కానున్నారని లోకేశ్ ఇటీవల ప్రకటించినప్పటికీ, పెద్ద మనసుతో...రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు' అని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. తనకు విహంగవీక్షణం ఉంటుందని, వచ్చే ఐదేళ్లలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా ఎలా చేయాలో తనకు తెలుసునని భరోసా ఇచ్చారు.

పొత్తూ ఉంటుంది... ఒత్తిళ్లూ ఉంటాయి...

'ఇరు పార్టీలు పొత్తు ధర్మం ఉంటుంది. పొత్తూ ఉంటుంది. ఒత్తిళ్లూ ఉంటాయి. పొత్తు ధర్మం ప్రకారం ఇరుపక్షాలు సంయమనం పాటించాలి. ఎవరంతట వారు సీట్లు ప్రకటించుకుంటూ వెళ్లకూడదు. సీట్లలో, అధికారంలో జనసేన తనవంతు వాటా తీసుకుంటుంది. జగన్‌ను దించడమే ఇప్పుడున్న ఏకైక లక్ష్యం. అధికారంలోకి వచ్చాక, వచ్చే ఐదేళ్లలో జనసేన గౌరవకరరీతిలో, తనదైన రీతిలో తన వంతు పాత్ర పోషిస్తుంది' అనడం వెనుక పవన్‌ కల్యాణ్‌ ఉద్దేశం స్పష్టమైనా టీడీపీ మండపేటకు అభ్యర్థిని ప్రకటించడాన్ని జనసేన కార్యకర్తలు తీవ్రంగానే పరిగణించారు. మొత్తం మీద చూస్తే...జనసేన కార్యకర్తల సమక్షంలో తెలుగుదేశం పార్టీకి తాను చెప్పదలచుకున్నది చెప్పేశారు పవన్‌కల్యాణ్. అవేంటంటే...పొత్తు ఉంటుంది...అదే సమయంలో ఒత్తిళ్లూ ఉంటాయి. పొత్తు ధర్మం ప్రకారం ఇరుపక్షాలు సంయమనం పాటించాలి. అలాగే ఎవరంతట వారు సీట్లు ప్రకటించుకుంటూ వెళ్లకూడదు. సీట్లలో, అధికారంలో జనసేన తనవంతు వాటా తీసుకుంటుంది. జగన్‌ను దించడమే ఇప్పుడున్న ఏకైక లక్ష్యం. అధికారంలోకి వచ్చాక, వచ్చే ఐదేళ్లలో జనసేన గౌరవకరరీతిలో, తనదైన రీతిలో తన వంతు పాత్ర పోషిస్తుంది అని చెప్పడం ద్వారా పొత్తులో జనసేన వ్యవహారశైలి ఎలా ఉంటుందో తేల్చిచెప్పారు పవన్.

Read More
Next Story