టికెట్..ఎవరికి ఇస్తే మేలు..
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం సీటు ఎవరికి ఇస్తే బాగుంటుంది. మీ అభిప్రాయం చెప్పండి అంటూ జనసేన చీఫ్ సర్వేకు దిగారు.
ఎస్.ఎస్.వి.భాస్కర్ రావ్
తిరుపతి: తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపిక చేయడంలో జనసేన అధినాయకత్వం మల్లగులాలు పడుతోంది. చిత్తూరుకు చెందిన ఒకే మాజీ ఎమ్మెల్యే పేరుతో అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్వరంతో ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ జరుగుతోంది. సాధారణంగా అభిప్రాయ సేకరణ అంటే ఇద్దరు లేదా ముగ్గురు పేర్లు చెబుతూ వారిపై అభిప్రాయాన్ని కోరడం సహజం. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వాయిస్ తో ఒకే అభ్యర్థి పేరుపై అభిప్రాయం కోరుతున్నారు. ఆ అభ్యర్థిని తిరస్కరించండి అని తిరుపతిలోని బలియా సామాజిక వర్గం నేతలు మౌఖికంగా సందేశాలు పంపుకుంటున్నారు.
ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడ్డాయి. అంతకు ముందు నుంచి పట్టుబట్టి జనసేన పార్టీ తిరుపతి శాసనసభ నియోజకవర్గాన్ని దక్కించుకుంది. అభ్యర్థి ఎవరనేది ఇంతవరకు తేల్చుకోలేకపోతోంది. సమర్థుడైన అభ్యర్థి కోసం గాలింపు సాగిస్తూనే ఉన్నారు. ఇటీవల తిరుపతి నగరంలో బలిజ సామాజిక వర్గం సంఘాల సమావేశం జరిగింది. " జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మినహా, స్థానికేతరులకు టికెట్ ఇవ్వవద్దని, తిరుపతి నగరానికి చెందిన వారికే టికెట్ ఇవ్వాలని జనసేన టిడిపి నేతలు డిమాండ్ చేశారు.
"తెలుగుదేశం పుట్టిన తిరుపతిలోనే సైకిల్ గుర్తు లేకుండా పోలింగ్కు వెళ్లడం అనేది బాధాకరం" అని టిడిపి మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేస్తే అందరం సమష్టిగా పనిచేసే గెలిపిస్తామని కూడా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఇక్కడికి రారేపక్షంలో.. తనకే టికెట్ ఇవ్వాలని కూడా ఎం సుగుణమ్మ కోరారు. ఎందుకు అవసరమైతే టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు అనుమతి తీసుకొని, జనసేన నుంచి పోటీ చేస్తానంటూ పార్టీ కిరాయించడానికి కూడా సిద్ధమైనట్టు సంకేతం ఇచ్చారు.
ఇప్పుడేమయ్యింది..
గ్రేటర్ రాయలసీమలో ఏకైక బలిజ సామాజిక వర్గానికి చెందిన చిత్తూరు వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు ఈసారి ఎన్నికల్లో ఒక టికెట్ కేటాయించలేదు. దీంతో పార్టీ ఫిరాయించిన ఆరణి శ్రీనివాసులు దూరదృష్టితో జనసేనలో చేరారు. తిరుపతి స్థానంపై కన్నేశారు. తిరుపతిలోని జనసేన, టిడిపి లోని బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులు స్థానికేతురులకు టికెట్ ఇస్తే సహించబోమని గతం మొదటి నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో జనసేన పార్టీ అధినాయకత్వం అభ్యర్థి ఎంపికలో డోలాయమానంలో పడినట్లు సమాచారం.
అభిప్రాయ సేకరణకు రంగంలోకి...
తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో నుంచి పోటీ చేయడానికి ఔత్సాహిక నాయకులు పోటీ పడుతున్నారు. వారి శక్తి సామర్థ్యాల పనులు అంచనా వేసుకున్న పార్టీ అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకోవాలని స్థితిలో.... ఐ వి ఆర్ యస్ పద్ధతిలో అభిప్రాయ సేకరణకు దిగింది. అందులో... " నేను మీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న. తిరుపతి శాసనసభ నుంచి ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తారా? అయితే ఒకటి నొక్కండి. లేదా నూట నోట నొక్కండి అనే సందేశం" వినిపిస్తున్నారు.
అభిప్రాయ సేకరణలో ఒకే పేరును ప్రస్తావించడంపై కూడా విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ సర్వే ద్వారా జనసేనలో స్థానికులకు కాకుండా చిత్తూరుకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును రంగం లోకి దించడానికి అభిప్రాయ సేకరణ సాగిస్తున్నట్లు భావిస్తున్నారు. తిరుపతి నుంచి పోటీ చేయడానికి చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే... ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వాన్ని ఎంత మంది సమర్థిస్తారు? జనసేన అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే ప్రశ్నలకు సమాధానం కోసం ఎదురుచూడాల్సిందే.
Next Story