జనసేనను పటిష్టం చేసేందుకు పవన్‌ కల్యాణ్‌ శ్రీకారం చుట్టారు. సభ్యత్వ నమోదును మొదలు పెట్టారు. మెంబర్‌ రుసుంను బీమా కింద చెల్లించనున్నారు.


ఇప్పటి వరకు విపక్షంలో ఉంటూ వచ్చిన జనసేన పార్టీ తాజాగా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పటిష్టతపై దృష్టి సారించింది. అందులో భాగంగా సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఈ నెల 19 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగుతుంది. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి ఆరు లక్షలు మంది జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలోను ఇది ప్రారంభించారు. సభత్య రుసం కింద సభ్యుని వద్ద నుంచి రూ. 500 తీసుకుంటారు. ఈ డబ్బులను బీమా కింద జమ చేస్తారు. పార్టీ సభ్యునికి ఎటువంటి ఇబ్బందులు జరిగినా, బీమా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారు.

విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో మృత్తి చెందిన ఇద్దరు కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులను ఒక్కో కుటుంబానికి రూ. 5లక్షల ప్రకారం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ శుక్రవారం నియోజక వర్గానికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడ పశ్చమ నియోజక వర్గంలో సభ్యత్వ డ్రైవ్‌ను ఆయన ప్రారంభించారు. తెనాలి నియోజక వర్గ కేంద్రంలోను సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నాదెండ్ల మనోహర్‌ ప్రారంభించారు. నియోజక వర్గం మొత్తమ్మీద ఆరు వేల వరకు సభ్యత్వ నమోదు చేయాలని స్థానిక నాయకులకు అప్పగించారు.

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఈ నెల 19న సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సంవత్సరం కనీసం 10లక్షలకు తగ్గకుండా ఏపీలో సభ్యత్వ నమోదు చేయాలనే ఆలోచనలో జనసేన నేతలు ఉన్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజక వర్గాల్లో కాస్త భారీగానే సభ్యత్వ నమోదు ఎక్కువుగా అయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు లేని చోట్ల నియోజక వర్గ ఇన్‌చార్జిలు ఆ బాధ్యతలను తీసుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ సభ్యత్వ నమోదు విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను ఇప్పటికే పార్టీ నేతలకు తెలియజేశారు. ఎవరికంటే వారికి ఇష్టాను సారంగా సభ్యత్వం ఇవ్వకుండా సభ్యునిగా చేర్చుకునే వ్యక్తి కుటుంబ వివరాలను కూడా తెలుసుకోవాలని చెప్పినట్లు సమాచారం.
జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారిగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. సభ్యత్వ రుసం రూ. 500 ఖచ్చితంగా తీసుకుంటున్నప్పటికీ సభ్యునికి బీమా సౌకర్యం లబిస్తున్నందు వల్ల ఏ ఒక్క సభ్యుడు కూడా మెంబర్‌షిప్‌ రుసుం భారం అవుతుందనే భావనలో లేరని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం జూలై నెలలోనే జనసేన పార్టీ సభ్యత్వ నమోదును చేపడుతోంది. అయితే టీడీపీ మహానాడు సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదును చేపడుతుంది. ఇక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సంవత్సరంలో ఏ నెలలో మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ను చేపడుతోందనేది తెలియని పరిస్థితి నెలకొంది. పార్టీ ఆవిర్భావం మార్చిలో జరిగినందున ఆ పార్టీ నాయకులు అదే నెలలో సభ్యత్వ నమోదు చేపట్టి తూతూ మంత్రంగా ముగిస్తున్నారు.
లక్షల్లో సభ్యులున్నారని, చెప్పుకోవడం తప్పా పార్టీ అంటే ఏమిటో దాని విధివిధానాలు తెలుసుకొని పార్టీ నిర్మాణం కోసం పని చేసే కార్యకర్తలు మాత్రం వైఎస్‌ఆర్‌సీపీకి తక్కువుగానే ఉన్నారని చెప్పొచ్చు. అలాగని పార్టీకి మాస్‌ అట్రాక్షన్‌ ఏమాత్రం తగ్గ లేదు. వైఎస్‌ జగన్‌ వినుకొండ పర్యటన సందర్భంగా ఇది రుజువైంది. ఇక చంద్రబాబు నాయుడు, లోకేష్‌ల పర్యటనల్లోను ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగానే వస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణ విషయంలో పటిష్టమైన యంత్రాంగం ఉందని చెప్పొచ్చు. జిల్లాల వారీగా మినీ మహానాడు, రాష్ట్ర స్థాయిలో మహానాడు జరగడం ప్రతి ఏడాది సాధారణంగా మారింది. అయితే జనసేన పార్టీ ఇప్పటి వరకు నిర్మాణ సభలు మాత్రం నిర్వహించ లేదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు మాత్రమే జరుపుతూ వస్తున్నారు. ఇకపై జిల్లాల వారీగా నిర్మాణ మహా సభలు నిర్వహించాలనే ఆలోచనల్లో జనసేన ఉంది.
జనసేన పార్టీలో కొత్తగా సభ్యత్వం తీసుకునే సభ్యుడు ఏ పార్టీ నుంచి వస్తారనే చర్చ కూడా రాష్ట్రంలో జరుగుతోంది. ఇప్పటి వరకు వైఎస్‌ఆర్‌సీపీ అభిమానులుగానో, సభ్యులుగానో ఉన్న వారిలో ఎక్కువ మంది జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకునేందుకు ముందుకు వస్తున్నట్లు ఆయా నియోజక వర్గాల్లోని ముఖ్యనేతలు చెబుతున్నారు.
Next Story