పోతిన మహేష్ తన రాజకీయ సమాధి తానే కట్టుకున్నాడు
x
ఆళ్ల హరి

పోతిన మహేష్ తన రాజకీయ సమాధి తానే కట్టుకున్నాడు

వైసీపీ వాసన తగలగానే పోతిన మహేష్ తీరు మారిపోయిందంటూ జనసేన గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి మండిపడ్డారు.


జనసేనకు పోతిన మహేష్ రాజీనామా చేయటంతో పార్టీకి పట్టిన శని వదిలిపోయిందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమక్షంలో పోతిన మహేష్ వైసీపీ తీర్థం తీసుకోవటంపై ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. వైకాపా నేతల గుప్పిట్లోకి వెళ్లిన మహేష్.. వైసీపీ కోవర్టుగా మారాడని ఆరోపించారు. పవన్ కల్యాణ్ బొమ్మ పెట్టుకోకపోయినా, జనసేన జెండా పెట్టుకోకపోయినా మహేష్‌ను పక్కింటోడు కూడా పట్టించుకోరని విమర్శించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది, తనకు గుర్తింపు తీసుకువచ్చింది పవన్ కల్యాణ్ అని మహేష్ అన్న మాటలను ఆయన గుర్తుచేశారు. ఉన్నత విలువలు, అత్యున్నతమైన సిద్ధాంతాలు కలిగిన జనసేన పార్టీని వదిలి రక్తంతో తడిసిన పార్టీలో చేరినప్పుడే మహేష్ రాజకీయ జీవితం సమాధి అయిందన్నారు. జనసేన జెండా కాకుండా వేరే పార్టీ జెండా పట్టుకుంటే తన చేతిని నరకమన్న మహేష్ ఇప్పుడు పునర్జన్మ పేరుతో తప్పించుకున్నారని ఎద్దేవా చేశారు.

వైసీపీ వాసన తగలగానే పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి పోతిన మహేష్ మాట్లాడటంపై ఆయన మండిపడ్డారు. మెడలో కండువా వేసేప్పుడు మాత్రమే జగన్ రెడ్డి కనిపిస్తాడని ఆ తర్వాత తాడేపల్లి గేటు కూడా తాకనివ్వరన్నారు. ఎప్పుడు పడితే అప్పుడు కలవడానికి, గౌరవం ఇవ్వడానికి ఆయన పవన్ కల్యాణ్ కాదన్నారు. తాడేపల్లి స్క్రిప్ట్ చదవడం వరకే మహేష్ పరిమితం అవనున్నారని ఆళ్ల హరి విమర్శించారు. కాటూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాపుల గురించి పోతిన మహేష్ బాధపడనక్కరలేదని, తొంభై శాతం కాపులు జనసేన వెంటే ఉన్నారని అన్నారు. రెల్లి రాష్ట్ర నేత మాట్లాడుతూ.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ నిర్ణయం మేరకు బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని గెలిపించుకుంటామన్నారు.



Read More
Next Story